ప్రమాదంలో యూదులు..అమెరికాలో దాడి.. ఇజ్రయెల్ రియక్షన్ ఏంటి..?

పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా గాజాలో పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతీకారంగా యూదులపై దాడులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో యూదులపై దాడికి ప్రయత్నించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. కొలరాడోలో యూదు సమాజంపై ఫైర్ బాంబు దాడి జరిగింది. ఈ దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? యూదులనే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ దాడికి హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో సంబంధం ఏమిటి? వైట్ హౌస్ ఎలా స్పందించింది?

ఒక చర్యకు ఎన్నో ప్రతిచర్యలు ఉంటాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఇలాంటి ప్రతిచర్యలు ఎదరవుతున్నాయి. అయితే ఇవి నేరుగా ఇజ్రాయెల్ పై కాకుండా యూదులపై జరుగుతున్నాయి. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ నగరంలో దారుణమైన ఘటన జరిగింది. స్థానిక యూదు సమాజం ఒక శాంతియుత సమావేశం నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి ఫైర్ బాంబు దాడి చేశాడు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిపై పెట్రోల్ బాంబు వంటి మండే స్వభావం ఉన్న వస్తువులతో దాడి చేయడంతో 8 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి చేసిన వ్యక్తిని ఈజిప్ట్ కు చెందిన.. మొహమ్మద్ సబ్రీ సోలిమన్ అని గుర్తించారు. అతను దాడి సమయంలో ఫ్రీ పాలస్తీనా, ఎండ్ జియోనిస్ట్స్ అని అరుస్తూ బాంబులను సమావేశంలోకి విసిరాడు. సోలిమన్ చొక్కా లేకుండా, చేతిలో ఎరుపు గుడ్డలతో నిండిన బాటిళ్లను పట్టుకుని, గుంపుపై దాడి చేశాడు. దాడి తర్వాత వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. FBI ఈ దాడిని టార్గెటెడ్ టెర్రర్ యాక్ట్ గా అభివర్ణించింది. అతడు ఒంటరిగానే దాడి చేసినట్లు, ఎటువంటి గ్రూపుతోను సంబంధం లేనట్లు పేర్కొన్నారు. బౌల్డర్‌లోని యూదు సమాజం రన్ ఫర్ దేర్ లైవ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒక శాంతియుత సమావేశం నిర్వహిస్తోంది. ఈ సంస్థ 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ నుంచి గాజాకు తీసుకెళ్లబడిన బందీల విడుదల కోసం అవగాహన కల్పిస్తుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈ సమావేశం జరుగుతుంది, ఇందులో 20 నుంచి 100 మంది వరకు పాల్గొంటారు. వారు ఎరుపు రంగు దుస్తులు ధరించి, 1 కిలోమీటర్ నడుస్తూ, బందీల పేర్లను చదువుతూ, ఇజ్రాయెల్ జాతీయ గీతం ఆలపిస్తారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

మొహమ్మద్ సబ్రీ సోలిమన్ ఈ దాడిని ఎందుకు చేశాడు? సోలిమన్ దాడి సమయంలో ఫ్రీ పాలస్తీనా అని అరవడం ద్వారా, ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవలపై తన వైఖరిని స్పష్టం చేశాడు. సోలిమన్ ఈ దాడిని ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా చేసినట్లు తెలిపాడు. ముఖ్యంగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఈ దాడకి పాల్పడినట్లు చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఈ దాడిని ఖండిస్తూ, యూదు దేశంపై, యూదు సమాజంపై వ్యాప్తి చేసే అసత్య ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా యాంటీ-సెమిటిక్ దాడులకు కారణమవుతున్నాయని అన్నారు.
కొలరాడో గవర్నర్ ఈ దాడిని ఖండిస్తూ, ఇది యాంటీ-సెమిటిక్ దాడిగా, స్వేచ్ఛా భావ ప్రకటనపై దాడిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలపై ఎలాంటి అభిప్రాయాలైనా ఉండవచ్చు, కానీ ఇలాంటి హింసాత్మక చర్యలు, టెర్రరిజం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

గతంలో అమెరికాలో యూదులపై ఎలాంటి దాడులు జరిగాయి? యాంటీ-డిఫమేషన్ లీగ్ డేటా ప్రకారం, 2023లో యూఎస్‌లో యాంటీ-సెమిటిక్ ఘటనలు 8,873 నమోదయ్యాయి. ఇది 2022తో పోలిస్తే 140% ఎక్కువ. 2014లో కాన్సాస్‌లోని ఓవర్‌ల్యాండ్ పార్క్‌లో ఒక నియో-నాజీ సానుభూతిపరుడు యూదు కమ్యూనిటీ సెంటర్ వద్ద ముగ్గురిని కాల్చి చంపాడు. 2024 జూన్ 23న లాస్ ఏంజిల్స్‌లో హమాస్ సానుభూతిపరులు దాడి చేసి, యూదులను వేధించాడు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత, యూఎస్‌లో యాంటీ-సెమిటిక్ ఘటనలు 400% పెరిగాయని ADL నివేదించింది. ఈ దాడులకు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో సంబంధం ఏమిటి? 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసింది, ఇందులో 1,200 మంది మరణించారు, 250 మందిని బందీలుగా తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్రమైన బాంబు దాడులు చేసింది, దీనిలో 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా యాంటీ-సెమిటిజం, ఇస్లామోఫోబియాను పెంచింది. యూఎస్‌లో ఈ యుద్ధం తర్వాత యూదు సమాజంపై దాడులు పెరిగాయి, ఎందుకంటే కొందరు ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణలో భాగంగా చూస్తూ, యూదు సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొలరాడో దాడి కూడా ఈ యుద్ధం నేపథ్యంలో జరిగింది. సోలిమన్ ఫ్రీ పాలస్తీనా అని అరవడం, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా దాడి చేసినట్లు చెప్పడం దీనికి సంబంధాన్ని సూచిస్తుంది. ఈ దాడి యూదు సమాజంలో భయాందోళనలను పెంచింది. దీంతో మతపరమైన స్థలాల వద్ద పోలీసు భద్రతను పెంచారు.

యూదులు, ఇజ్రాయెల్ మధ్య సంబంధం చారిత్రక, మతపరమైన సంబంధం ఉంది. క్రీ.పూ. 1200 నాటికి ఇజ్రాయెల్ రాజ్యం రాజు డేవిడ్, సోలమన్‌లు పరిపాలించారు. అయితే, బాబిలోనియన్లు, రోమన్ల ఆక్రమణలతో యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురై వలస వెళ్లారు. 1947లో UN విభజన ప్రణాళిక ఆమోదించగా, 1948 మే 14న ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్ చట్టం ప్రకారం, ప్రపంచంలోని ఏ యూదుడైనా ఇజ్రాయెల్‌లో పౌరసత్వం పొందవచ్చు. ఇజ్రాయెల్ జనాభా 9.3 మిలియన్లు, ఇందులో 73.2% యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్ యూదులకు జాతీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అటు భారత్ యూదులను, ఇజ్రాయెల్‌ను వివిధ రూపాల్లో ఆదుకుంది. భారత్‌లో యూదు సమాజం 2000 సంవత్సరాలుగా శాంతియుతంగా జీవిస్తోంది, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం ప్రాంతాల్లో యూదులు ఇప్పటికీ ఉన్నారు. కొచ్చిన్‌లో యూదు సమాజం క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి ఉంది. అయితే ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో యూదులపై దాడులు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత .. యూతలు ఆందోళన చెందుతున్నారు.