డీపోర్టేషన్ పేరు చెప్పి బెదిరిస్తోన్న ట్రంప్..!

Trump Threatens Deportation Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే డీపోర్టేషన్ అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంటే అమెరికాలో అక్రమ వలసదారులను వారి స్వేదేశాలకు పంపేస్తామని చెబుతున్నారు. అయితే డీపోర్టేషన్ ను ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ కు కూడా ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మస్క్ తో సంబంధాలు చెరిన నేపథ్యంలో చివరికి మస్క్ ను కూడా దేశం నుంచి పంపిచేస్తామని ట్రంప్ చెప్పడం దీనికి పారాకాష్ట అనుకోవచ్చు. అయితే తాను తీసిన గోతిలో తానే పడినట్టు.. ట్రంప్ వాడుతోన్న డీపోర్టేషన్ సూత్రం.. ఇప్పుడు ఆయన కుటుంబానికే ఎసరు పెట్టింది. ట్రంప్ నిజంగా రూల్స్ ఫాలో అయితే ట్రంప్ భార్య దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సిందే.. అసలు ఫస్ట్ లేడి ఎందుకు దేశాన్ని వదిలేయాలి..? ట్రంప్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమం మొదలైంది..?

అమెరికాలో రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ చేసిన మొదటి పని డీపోర్టేషన్. అంటే అమెరికాలో అక్రమంగా ఉంటోన్న వారిని పట్టుకుని.. వారివారి స్వదేశాలకు పంపడం. దీని వల్ల అనేక దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వగా.. స్వదేశంలో కూడా అల్లర్లు చెలరేగాయి. అయితే దేశం కోసం ఇది తప్పదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ డీపోర్టేషన్ ను ట్రంప్ ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ కోసం కూడా వాడుకుంటున్నారని అంటున్నారు. మాజీ ప్రాణ స్నేహతుడు మస్క్ ను ఇది విషయంలో ట్రంప్ బ్లాక్ మెయిల్ చేసినట్టు అందరూ భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల వివాదం మరింత ముదురుతోంది. ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. దేశ రుణ భారాన్ని ఈ బిల్లు 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని, ఇది అమెరికాను ఇది ఆర్థికంగా దివాళా తీస్తుందని మస్క్ విమర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తొలగించడం వంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు మస్క్ కు చెందిన టెస్లా వ్యాపారాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఈ అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.., మస్క్‌ను దేశం నుంచి బహిష్కరించే విషయాన్ని పరిశీలిస్తాం అన్నారు. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ని మస్క్‌పై ప్రయోగిస్తామని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మస్క్ 1995లో J-1 వీసాపై అమెరికాకు వచ్చి, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకోకుండా నిబంధనలను ఉల్లంఘించి పనిచేశారని, ఆయన అక్రమ వలసదారుడని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్లే మస్క్‌ను డిపోర్ట్ చేయాలని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇటీవల మస్క్ కొత్త పార్టీ పెడతానని బెదిరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ రిపోర్ట్ అస్త్రాన్ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. Trump Threatens Deportation Musk.

ట్రంప్ తన రెండవ పదవీకాలంలో వలసదారులపై కఠిన విధానాలను అమలు చేస్తున్నారు. 2025 జనవరిలో అధికారం చేపట్టిన తర్వాత, ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించి, వలసదారులను భారీ స్థాయిలో బహిష్కరించే ప్రణాళికను ప్రకటించారు. అక్రమ వలసదారులతో పాటు సాధారణ పౌరులపై కూడా కొన్ని సందర్భాల్లో దీనికి బలవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం అలియన్ ఎనిమీస్ యాక్ట్ వంటి చట్టాలను ఉపయోగించి, వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులను గ్యాంగ్ సభ్యులుగా ఆరోపిస్తూ డిపోర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ 14వ సవరణను తిరిగి వ్యాఖ్యానించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీని ద్వారా అక్రమ వలసదారుల పిల్లలు, తాత్కాలిక వీసాలపై ఉన్నవారి సంతానం అమెరికా పౌరసత్వం పొందకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్డర్ ప్రస్తుతం కోర్టులో ఉంది. అటు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థను ఉపయోగించి, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి, డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తోంది ట్రంప్ సర్కార్.

అయితే ట్రంప్ డిపోర్టేషన్ వ్యవహారం ఆయన కాలికే చుట్టుకుంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న చాలా మంది కొంత డిమాండ్ వెలుగులోకి తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా.. ఆమె కుటుంబాన్ని డిపోర్టేషన్ ప్రకారం దేశం నుంచి పంపివేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మెలానియా, ఆమె తల్లిదండ్రుల వలస వచ్చారన్న విషయాన్ని ట్రంప్ గుర్తించాలని సూచిస్తున్నారు. మెలానియా తల్లిదండ్రులు 2018లో అమెరికా పౌరసత్వం పొందారని, వారి గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మెలానియా స్పాన్సర్‌గా ఉన్నారని వార్తలొచ్చాయి. ట్రంప్ 14వ సవరణ సవరణ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను విమర్శిస్తూ, ట్రంప్ అక్రమ వలసదారుల పిల్లలను డిపోర్ట్ చేయాలనుకుంటే, ముందు మెలానియా రికార్డులను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. మెలానియా స్వయంగా వలసదారురాలు, ఆమె కుటుంబం గ్రీన్ కార్డ్ ద్వారా పౌరసత్వం పొందింది.

మెలానియా, ఆమె కుటుంబాన్ని డిపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, మూవాన్ అనే సంస్థ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. మెలానియా, ఆమె తండ్రి, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌ను డిపోర్ట్ చేయాలని ఈ సంస్థ అభిప్రాయాలు సేకరిస్తోంది. మెలానియా తల్లి స్లోవేనియాలో పుట్టడం వల్ల ఆమె కుటుంబం ట్రంప్ విధానాల క్రింద డిపోర్టేషన్‌కు అర్హులని వాదిస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక యాంటీ-డోజ్ నిరసన తర్వాత మూవాన్ పేరుతో సంతకాల సేకరణ చేయడం వైరల్ అయింది. అయితే ట్రంప్ వదిలిన బాణాన్ని తిరిగి అతడిపైకే వదిలారనే మాట వినిపిస్తోంది. దీనిపై ట్రంప్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

మెలానియా ట్రంప్ 1970 ఏప్రిల్ 26న స్లోవేనియాలోని నోవో మెస్టోలో జన్మించారు. అప్పటి యుగోస్లావియాలో ఈ ప్రాంతం భాగంగా ఉంది. ఆమె 1996లో మోడలింగ్ కెరీర్ కోసం న్యూయార్క్‌కు వలస వచ్చారు. మొదట టూరిస్ట్ వీసాపై, తర్వాత ఐన్‌స్టీన్ వీసా ద్వారా అమెరికాలో స్థిరపడ్డారు. ఇది అసాధారణ ప్రతిభావంతులైన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. 1998లో డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన తర్వాత, వారు 2005లో వివాహం చేసుకున్నారు. మెలానియా 2006లో అమెరికా పౌరసత్వం పొందారు. ఆమె తల్లిదండ్రులు మెలానియా స్పాన్సర్‌షిప్ ద్వారా 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే మెలానియా తల్లి అమలిజా 2024లో మరణించారు. మెలానియా పౌరసత్వం చట్టబద్ధంగా పొందినదే అయినప్పటికీ, ఆమె టూరిస్ట్ వీసాపై పనిచేసినట్లు కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇవి ఆమె డిపోర్టేషన్ డిమాండ్లకు రాజకీయ ఆధారంగా ఉపయోగపడుతున్నాయి.