
Nobel Peace Prize For Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో గ్రాండ్ విందు ఇచ్చారు. ఇది ఇప్పుడు భారత్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. మునీర్ పై అగ్గిమీద గుగ్గిలమవుతోన్న భారత్ .. ట్రంప్ మునీర్ కు విందు ఇవ్వడంతో మరింత మండిపడుతోంది. ఇంతకీ ఈ విందు వెనుక అసలు కథ ఏంటి? ట్రంప్ ఇంత హడావిడిగా మునీర్‌ను ఎందుకు ఆహ్వానించారు? ఇది భారత్-పాక్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ఘటనపై భారత్‌లో ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? కాంగ్రెస్ నేత శశి థరూర్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో లంచ్‌కు ఆహ్వానించారు. ఇది చాలా అరుదైన ఘటన, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు సాధారణంగా ఒక దేశ ఆర్మీ చీఫ్‌ను ఇలా ఒంటరిగా కలవడం చాలా అసాధారణం. ఈ విందు వెనుక పలు కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ ఈ మీటింగ్ కు ఒక కారణంగా భావిస్తున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ ఘర్షణ నాలుగు రోజుల తర్వాత మే 10న సీజ్‌ఫైర్‌తో ముగిసింది. ఈ సీజ్‌ఫైర్‌కు తానే మధ్యవర్తిత్వం చేశానని, అసీమ్ మునీర్, భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు. అందుకే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మునీర్ సిఫార్సు చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో మునీర్ పై ట్రంప్ కు అమితమైన ప్రేమ వచ్చిందని అంటున్నారు. ఇక రెండో కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. పాకిస్తాన్, ఇరాన్‌తో సరిహద్దు పంచుకుంటుంది, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో పాక్ సహకారం కోసం ట్రంప్ మునీర్‌ను కలిశారని చెబుతున్నారు. పాకిస్తాన్‌కు ఇరాన్ గురించి బాగా తెలుసు, వాళ్లు ఇరాన్ వైఖరితో సంతోషంగా లేరని ట్రంప్ అన్నారు.
ఈ విందు అందరి దృష్టిని ఆకర్షించడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. జూన్ 14న అమెరికా ఆర్మీ డే సెలబ్రేషన్స్‌కు మునీర్‌ను ఆహ్వానించారని వచ్చిన పాకిస్థాన్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. దీనిపై భారత్ అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. దీంతో ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది. అయితే ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ సమన్వయం చేశారని వార్తలు వచ్చాయి. అటు ఈ విందు భారత్-పాక్ ఘర్షణ తర్వాత జరగడం వల్ల భారత్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. తాను భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపానని.., తాను పాకిస్తాన్‌ను ఇష్టపడతాను, మోదీ అద్భుతమైన నాయకుడని ట్రంప్ చెప్పారు. అయితే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సీజ్‌ఫైర్‌కు అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదని, ఇది భారత్-పాక్ సైనికుల మధ్య చర్చల ఫలితమని స్పష్టం చేశారు. కాని పాకిస్థాన్ మాత్రం ట్రంప్ ను ఆకాసానికి ఎత్తేసింది. దీంతో ట్రంప్ ఉబ్బిపోయీ ఈ విందు ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ విందు భారత్‌లో తీవ్ర చర్చను రేకెత్తించింది.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ విందుపై సెటైరికల్‌గా స్పందించారు. మునీర్‌కు భోజనం బాగుందని, ఆ భోజనంతో పాటు కొంత హెచ్చరికలు కూడా చేసి ఉంటారని వ్యంగ్యంగా అన్నారు. అమెరికా ఈ సమావేశంలో పాకిస్తాన్‌ను ఉగ్రవాదంపై హెచ్చరించి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం, భారత్‌పై ఉగ్రదాడులకు పంపడం వంటివి ఆపాలని అమెరికా గట్టిగా చెప్పి ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు. థరూర్, 2001లో 9/11 దాడులకు కారణమైన అల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను పాక్ ఆర్మీ క్యాంప్ సమీపంలో దాచిన చరిత్రను గుర్తు చేశారు. ఒసామా వల్ల అమెరికా రెండు ఐకానిక్ భవనాలు కోల్పోయింది, 2000 మంది చనిపోయారు. అతన్ని దాచిన పాకిస్తాన్‌ను అమెరికా ఇంత త్వరగా మర్చిపోదు అని ఆయన అన్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై భారత వైఖరిని వివరించేందుకు థరూర్ అమెరికా సహా 33 దేశాలకు బహుళ పార్టీ డెలిగేషన్‌ను నడిపించారు. ఈ సమావేశంలో అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు పాక్ డెలిగేషన్‌తో ఉగ్రవాదం గురించి మాట్లాడినట్టు థరూర్ తెలిపారు. ఈ విందు అమెరికా పాక్‌ను ఉగ్రవాదంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Nobel Peace Prize For Donald Trump
అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ లో భారత్-పాకిస్థాన్ విషయంలో ద్వంద్వ వైఖరిని స్పష్టంగా కనిపిస్తోంది. డిప్లొమాటిక్ లాభాలు, అమెరికా ఆర్థిక లాభాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాడు. ఒకవైపు, ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు, భద్రతా సహకారం ద్వారా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి గా కొనియాడాడు. మరోవైపు, పాకిస్థాన్‌ను స్మార్ట్ పీపుల్ తో కూడిన దేశంగా ప్రశంసిస్తూ, ఆ దేశంతో కూడా వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించాడు. 2025 మేలో భారత్-పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌లో తానే కీలక పాత్ర పోషించానని, వాణిజ్య ఒత్తిడి ద్వారా యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పదేపదే చెప్పాడు, కానీ భారత్ ఈ మధ్యవర్తిత్వాన్ని ఖండించి, సీజ్‌ఫైర్ ద్వైపాక్షిక చర్చల ఫలితమని స్పష్టం చేసింది. కాశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ప్రతిపాదించడం భారత్‌కు రుచించలేదు, ఎందుకంటే ఇది ద్వైపాక్షిక సమస్యగా ఉండాలని భారత్ భావిస్తుంది. అయితే, పాకిస్థాన్ ఈ ప్రతిపాదనను స్వాగతించింది, ఇది ట్రంప్ రెండు దేశాలనూ సమానంగా చూసే వైఖరిని సూచిస్తుంది. ట్రంప్ ఈ ద్వంద్వ వైఖరి భారత్‌తో స్నేహం, పాకిస్థాన్‌తో వాణిజ్యం, రెండింటిలోనూ శాంతి స్థాపకుడిగా కనిపించే ప్రయత్నం అని చెప్పొచ్చు. తన విదేశాంగ విధానంలో ట్రంప్ అమెరికా ఫస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, దీని కోసం భారత్, పాక్ రెండు దేశాలతో లాభదాయక సంబంధాలు నిర్వహించడం ప్రధాన లక్ష్యం. ఈ వైఖరి భారత్‌కు ఒక సవాలుగా ఉంది. ఎందుకంటే ట్రంప్ పాకిస్థాన్‌కు దగ్గరగా ఉండటం, కాశ్మీర్‌ను ప్రపంచం దృష్టికి తీసుకువెల్లే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి.