
North Korean dictator Kim: పైకి గొప్పలు చెప్పుకున్నా.. నార్త్ కొరియా ఆర్థిక సమస్యలతో సతమతవుతోంది. ఇప్పటికే ఆ దేశంపై అనేక ఆంక్షలు ఉండటంతో విదేశీ మారకం రాదు. దీంతో టూరిజంపై కన్నేశాడు కిమ్. టూరిజంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు కాబట్టి ఆదాయం రాబట్టవచ్చని భావిస్తున్నాడు. దీని కోసమే ఓ భారీ పర్యటక ప్రాజెక్టును ప్రారంభించాడు. నార్త్ కొరియాలోకి ఎవరికీ ప్రవేశం లేదనే కిమ్.. టూరిజం ద్వారా ఆదాయం ఎలా సాధించాలని అనుకుంటున్నారు..? అసలు కిమ్ ఆలోచన ఏంటి..? దక్షిణ కొరియాకు, ఉత్తర కొరియాకు టూరిజం విషయంలో తేడా ఏంటి..?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీరు మార్చుకుంటున్నారా..? గతంలో వినోదాన్ని వ్యతిరేకంగా కిమ్ ఆలోచన మారిందా.. ? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెందుకు కిమ్.. టూరిజం ద్వారా ఆదాయం సంపాదించాలని చూస్తున్నాడు. దీని కోసమే
ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఓ భారీ బీచ్ రిసార్ట్ ను ప్రారంభించారు. ఈ రిసార్ట్ 5 కిలోమీటర్ల తీరప్రాంతంలో 54 హోటళ్లు, వాటర్ పార్క్‌లు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, పబ్‌లతో సందర్శకులను ఆకర్షించేలా రూపొందించారు. కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి, జూన్ 24న రిబ్బన్ కట్ చేశారు. ఈ రిసార్ట్ జూలై 1 నుంచి స్థానిక పర్యాటకులను అనుమతించనున్నారు. జూలై 7 నుంచి విదేశీ టూరిస్టులను అనుమతిస్తారు. అయితే విదేశీ టూరిస్టులంటే అన్ని దేశాల వారు అనుకుంటే పోరాపాటే. కేవలం రష్యన్ టూరిస్టులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2018లో మొదలై, కోవిడ్-19, లాజిస్టిక్ సమస్యల వల్ల ఆలస్యమై, ఏడేళ్ల తర్వాత ఇప్పుడు పూర్తయింది. రిసార్ట్‌లో రైలు స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. అయితే ఈ రిసార్ట్ ఉత్తర కొరియా పార్టీ అధికారులు, సైనిక ఉన్నతాధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. సామాన్య పౌరులకు ప్రవేశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రిసార్ట్ ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. North Korean dictator Kim.
ఉత్తర కొరియా విదేశాలతో ఆర్థిక సంబంధాల్లో ఒంటరి కావడం వల్లే టూరిజం అభివృద్ధిపై కిమ్ జోంగ్ ఉన్ దృష్టి సారించారని అంటున్నారు. ఐక్యరాష్ట్ర సమితి ఆంక్షల వల్ల ఆయుధ కార్యక్రమాలు, ఎగుమతులపై నిషేధం ఉంది, టూరిజం మాత్రమే చట్టబద్ధమైన ఆదాయ మార్గం. ఈ రిసార్ట్ ద్వారా విదేశీ కరెన్సీని సంపాదించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 1990లలో మౌంట్ కుమ్‌గాంగ్ ప్రాజెక్ట్ దక్షిణ కొరియా టూరిస్టుల నుంచి రూ. 500 కోట్లకు పైగా ఆదాయం తెచ్చింది, కానీ 2008లో ఒక ఘటన వల్ల అది మూతపడింది. ఈ అనుభవం నుంచి నేర్చుకుని, కిమ్ కొత్త రిసార్ట్‌తో టూరిజం రంగాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ఉత్తర కొరియాలో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ పార్క్‌ల నిర్వహణ ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు.
ప్రధానంగా ఉత్తర కొరియాకు చైనా, రష్యా నుంచే టూరిస్టులు వెళ్తుంటారు. 2020లో కోవిడ్ కారణంగా ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. 2023 నుంచి కొంతమంది రష్యన్ టూరిస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఉత్తర్ కొరియా వెళ్లే విదేశీ టూరిస్టులు కఠిన నియమాలను పాటించాలి. ఫొటోగ్రఫీకి అనుమతి లేదు, టూర్లకు స్థానిక గైడ్ తప్పనిసరి, స్థానికులతో టూరిస్టులు మాట్లాడకూడదు. ఇలాంటి కఠిన ఆంక్షల మధ్య కిమ్ జోంగ్ ఉన్ టూరిజం ద్వారా ఆర్థిక లాభాలను ఆశిస్తున్నారు. ఈ ఆంక్షల వల్ల కిమ్ టూరిజం అభివృద్ధికి ఎన్ని చర్యలు తీసుకున్నా కష్టమనే మాట వినిపిస్తోంది. ఈ రిసార్ట్ కు పెట్టిన డబ్బు కూడా బూడిదలో పోసిన పన్నీరు అంటున్నారు. అయితే కిమ్ మాత్రం ఈ రిసార్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉత్తర కొరియాతో పోలిస్తే.. దక్షిణ కొరియా టూరిజంలో దూసుకుపోతోంది. సౌత్ కొరియా విధానాలు ఆ దేశాన్ని టూరిజం హబ్ గా చేశాయి.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా టూరిజం రంగాలను పోల్చినప్పుడు, దక్షిణ కొరియా టూరిజం రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. 2023లో దక్షిణ కొరియా 11 మిలియన్ విదేశీ టూరిస్టులను ఆకర్షించింది. ఈ విషయాలో కొరియన్-పాప్, కొరియన్-డ్రామా, సియోల్, జెజూ దీవి వంటివి ప్రధాన పాత్ర పోషించాయి. దక్షిణ కొరియా టూరిజం ఆదాయం సుమారు 15 బిలియన్ డాలర్లు. దక్షిన కొరియా అంతర్జాతీయ సంబంధాలు, ఆధునిక సౌకర్యాల కారణాల వల్ల ఇది సాధ్యమైంది. వీసా-ప్రీ ఎంట్రీ, ఆధునిక రవాణా వ్యవస్థ, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చలర్ దక్షిణ దక్షిణ కొరియా విదేశీ టూరిస్టులకు కేరాఫ్ అడ్రెస్ అయ్యింది. ఉత్తర కొరియా టూరిజం, దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఏ దేశం బడితే ఆ దేశం నుంచి ఉత్తర కొరియా టూరిస్టులను అనుమతించడదు. 2019లో సుమారు 3 లక్షల మంది విదేశీ టూరిస్టులు ఉత్తర కొరియా వెళ్లగా.. అందరూ చైనా, రష్యాకు చెందిన వారే. కోవిడ్ తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉత్తర కొరియా టూరిజం ఆంక్షలు, భావజాలం, మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆ దేశ టూరిజం అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే కొత్త రిసార్ట్ ఈ లోటును తగ్గిస్తుందని కిమ్ భావిస్తున్నారు. కానీ ఆంక్షలు, అంతర్జాతీయంగా ఏకాకి కావడం వల్ల పర్యటకం అంతగా ఉండదనే భావనా ఉంది.