
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలపై చాలా ఖచ్చితంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కీలక సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇజ్రాయెల్ ఈ దాడులను ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పిలిచింది. ఇరాన్ ఆయువుపట్టుపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వెనుక ఆ దేశ గూఢచార సంస్థ మోసాద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అసలు ఈ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ ఎలా పనిచేస్తుంది? ఇది ఎందుకు ప్రపంచంలోనే బెస్ట్ గూఢచార సంస్థగా పేరు తెచ్చుకుంది? గతంలో మోసాద్ చేసిన ఆపరేషన్లు ఏంటి? ఇరాన్ విషయంలో ఇతర దేశాల గూఢచార సంస్థలు మోసాద్ కు ఎలా సహకరిస్తున్నాయి?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా నడిచిన షాడో వార్ ఇప్పుడు.. బహిరంగ యుద్ధ స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇది ఇరాన్ అణు కార్యక్రమంలో చాలా కీలకమైన స్థలం. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హొస్సేన్ సలామి, ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ మొహమ్మద్ బఘేరీ, ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇరాన్ ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రెయెల్ లోని టెల్ అవీవ్, జెరూసలేం వంటి ఇజ్రాయెల్ నగరాలపై వందలాది బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. అమెరికా కూడా ఈ దాడులకు బాధ్యత వహించాలని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ముందస్తు చర్య అని చెప్పారు. ఇరాన్‌కు 15 అణు బాంబులు తయారు చేయడానికి సరిపడా యురేనియం ఉందని ఆరోపించారు. ఈ ఘటనలు మధ్యప్రాచ్యంలో పెద్ద యుద్ధం జరుగుతుందేమోననే భయాలను పెంచాయి. చమురు ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
జూన్ 13న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ 200 ఫైటర్ జెట్‌లతో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు మొదలుపెట్టింది. ఇరాన్‌లో 100కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసింది. నటాంజ్ అణు కేంద్రంలోని భూగర్భ సెంట్రిఫ్యూజ్ హాల్, పవర్ రూమ్స్ పూర్తిగా నాశనమయ్యాయి. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలు, రాడార్ సిస్టమ్స్ కూడా ధ్వంసమయ్యాయి. కీలక సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇది ఇరాన్ సైనిక నాయకత్వానికి చాలా పెద్ద దెబ్బ. ఇజ్రాయెల్ ఈ దాడులు ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడానికి అవసరమని చెప్పింది. ఇరాన్ 60% శుద్ధిచేసిన యురేనియం స్టాక్‌తో ఒక వారంలో అణు బాంబు తయారు చేయగలదని ఆరోపించింది. కానీ ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతోంది.
అయితే ఇరాన్ కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ ఇంత క్లియర్ కట్ లక్ష్యంతో దాడులు చేయడమే ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ సత్తా అని అంటున్నారు. దాడుల వెను మోసాద్ గూఢచార్యం, ఇజ్రాయెల్ అధునాతన సైనిక టెక్నాలజీ ఉన్నాయి. మోసాద్ సీక్రెట్ ఏజెంట్లు ఎన్నో ఏళ్లుగా ఇరాన్‌లో రహస్యంగా పనిచేశారు. డ్రోన్‌లు, పేలుడు పదార్థాలను రహస్యంగా తరలించారు. ఇరాన్ ప్రజలతో కలిసిపోయి వివరాలు సేకరించారు. అవసరమైనప్పుడు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టించారు. ఇజ్రాయెల్ AI-ఆధారిత టార్గెటింగ్ సిస్టమ్స్, ఆటోనమస్ డ్రోన్‌లు, సైబర్ వార్‌ఫేర్‌ను ఉపయోగించింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను పనిచేయకుండా చేసింది. నటాంజ్‌లో సెంట్రిఫ్యూజ్‌లకు విద్యుత్ సరఫరాను నాశనం చేయడం, రాడార్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేయడం వంటివి చేశారు మోసాద్ గూఢచారులు. మోసాద్ గతంలో కూడా ఇరాన్‌లో శాస్త్రవేత్తలను హత్య చేసింది. సైబర్ దాడులు కూడా చేసింది. ఇది ఇరాన్ రక్షణ వ్యవస్థలలో మోసాద్ ఎంత లోతుగా చొరబడిందో తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ సామర్థ్యం వెనుక అమెరికా నుంచి ఇంటెలిజెన్స్ సహాయం, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల నుంచి టెక్నాలజీ సహకారం ఉందని అంటున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన గూఢచార సంస్థ మోసాద్, అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్, సైనిక ఇంటెలిజెన్స్ యూనిట్ అమాన్ కలిసి పనిచేస్తాయి. మోసాద్ 1949లో స్థాపించబడింది. ఇది విదేశీ గూఢచర్యం, రహస్య ఆపరేషన్లు, హత్యలలో స్పెషలిస్ట్. దీని ఆపరేషన్లు చాలా రహస్యంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఏజెంట్ల నెట్‌వర్క్‌ను నడిపిస్తోంది. మోసాద్ మెయిన్ గోల్ ఇజ్రాయెల్ జాతీయ భద్రతను కాపాడటం, ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాల నుంచి అణు బెదిరింపులను అడ్డుకోవడం. దీని ఆపరేషన్లలో సైబర్ వార్‌ఫేర్, డ్రోన్ దాడులు, హ్యూమన్ ఇంటెలిజెన్స్, అవసరమైతే ఎవరినైనా లేపేయడం ఉంటాయి. షిన్ బెట్ దేశీయ భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలపై ఫోకస్ చేస్తుంది. అమాన్ సైనిక ఇంటెలిజెన్స్ సేకరణలో పనిచేస్తుంది. మోసాద్ శిక్షణ చాలా కఠినం. ఏజెంట్లు చాలా భాషలు మాట్లాడగలరు, గుర్తింపును మార్చుకోగలరు, రహస్య ఆపరేషన్లలో ఎక్స్‌పర్ట్‌లు. ఇజ్రాయెల్ చిన్న దేశం, చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అందుకే మోసాద్ చాలా చురుగ్గా, బలమైన సంస్థగా మారింది.
మోసాద్ ప్రపంచంలోనే బెస్ట్ గూఢచార సంస్థగా ఎందుకు పేరు తెచ్చుకుంది? మోసాద్ ఇరాన్, సిరియా, లెబనాన్ వంటి శత్రు దేశాలలో నెట్ వర్క్ కలిగి ఉంది. రహస్య ఏజెంట్లు, డబుల్ ఏజెంట్లు, స్థానిక సహకారుల ద్వారా సమాచారం సేకరిస్తుంది. AI, సైబర్ వార్‌ఫేర్, డ్రోన్ టెక్నాలజీ, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ లో మోసాద్ అగ్రగామి. మోసాద్ శాస్త్రవేత్తలు, సైనిక నాయకులను టార్గెట్ చేసి హత్యలు చేయడంలో ఎక్స్‌పర్ట్. 2010-2012 మధ్య ఇరాన్ అణు శాస్త్రవేత్తలు మసౌద్ అలీమొహమ్మదీ, మజీద్ షహ్రియారీ, మొస్తఫా అహ్మదీ రోషన్‌లను హత్య చేసింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతాకు ఎప్పుడు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే మోసాద్‌ను చాలా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూనే ఉంటుంది. 1976లో ఎంటెబ్బె ఆపరేషన్‌లో ఉగాండాలో బందీలను విడిపించింది. మోసాద్ CIA, MI6, BND, భారత్ కు చెందిన రా వంటి సీక్రెట్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ షేరింగ్, జాయింట్ ఆపరేషన్ల ద్వారా బలపడుతుంది.
మోసాద్ గతంలో చాలా పెద్ద ఆపరేషన్లు చేసింది. 1976లో ఉగాండాలో హైజాక్ చేసిన ఎయిర్ ఫ్రాన్స్ విమాన బందీలను విడిపించింది. ఇది మోసాద్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌ను ధ్వంసం చేసి, ఇరాక్ అణు కార్యక్రమాన్ని ఆగిపోయేలా చేసింది. 2010లో ఇరాన్ నటాంజ్ అణు స్థావరంలో సెంట్రిఫ్యూజ్‌లను ధ్వంసం చేసింది. ఇది మోసాద్-సిఐఏ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ అని అంటారు. హత్య 2024లో టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ చీఫ్‌ను హత్య చేసింది. ఇది ఇరాన్ భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ ఆపరేషన్లు మోసాద్ శక్తి, సామర్థ్యాన్ని చూపిస్తాయి.
తాజా ఇరాన్ పై దాడుల్లో మోసాద్ కీలక పాత్ర పోషించింది. ఇరాన్ సైనిక, అణుస్థావరాల వివరాలను ముందే ఖచ్చితమైన సమాచారం సేకరించింది. అణుస్థావరాల మ్యాప్స్, శాస్త్రవేత్తల కదలికలు తెలుసుకుంది. మోసాద్ కమాండోలు ఇరాన్‌లో డ్రోన్‌లు, పేలుడు పదార్థాలను రహస్యంగా సరఫరా చేశారు. ఇవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ సైట్‌లను టార్గెట్ చేశాయి. అణు శాస్త్రవేత్తలు, సైనిక నాయకులను టార్గెట్ గా ఖచ్చితమైన దాడులు చేసింది. ఇరాన్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను నిర్వీర్యం చేయడానికి సైబర్ దాడులు చేసింది. ఇది ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్‌లకు మార్గం సుగమం చేసింది. మోసాద్ ఆపరేషన్లు ఇరాన్ నాయకత్వాన్ని షాక్‌లోకి నెట్టాయి. ఇరాన్ భద్రతా వ్యవస్థలలో లోపాలను బయటపెట్టాయి.
అయితే ఇజ్రాయెల్ దాడులకు ముందు అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ సైనిక సహాయం ఇవ్వలేదు. గతంలో కూడా ప్రత్యక్ష, పరోక్ష సైబర్ దాడుల్లో సిఐఏ-మోసాద్ కలిసి పనిచేశాయి. బిట్రన్ కు చెందిన సీక్రెట్ సర్వీస్ సంస్థ MI6 ఇరాన్ అణు కార్యక్రమంపై ఇంటెలిజెన్స్ సేకరణలో మోసాద్ కు సహకరించిందని అంటున్నారు. ఇరాన్ శాస్త్రవేత్తల హత్యల్లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సహాయం ఉందని ఇరాన్ ఆరోపించింది. జర్మనీ రహస్య సంస్సత BND కూడా ఇరాన్ అణు కార్యక్రమంపై సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ఐరోపాలో ఇరాన్ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడంలో సహకరిస్తుంది. అలాగే ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ, UAE ఇంటెలిజెన్స్ సంస్థలు మోసాద్‌కు అనధికారికంగా సహకరించాయని ఆరోపణలు ఉన్నాయి.