ఇరాన్‌లో తీవ్రమవుతున్న రాజకీయ అనిశ్చితి.!

Political uncertainty is deepening in Iran: ఇరాన్‌లో రాజకీయ, భద్రతా గందరగోళం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ మిసైల్ దాడులు ఒకవైపు, అమెరికా దాడుల భయం మరోవైపు ఇరాన్‌ను కలవరపెడుతున్నాయి. ఇటు బలోచిస్థాన్, కుర్దిష్ వేర్పాటువాద గ్రూప్‌లు తమ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ అల్లకల్లోలం ఇరాన్ తో పాటు ఇప్పుడు పాకిస్థాన్‌కూ నిద్ర లేకుండా చేస్తోంది? ఇరాన్ లో ఖమేనీ పాలన కుప్పకూలితే పాకిస్థాన్ కూడా ముప్పు ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.? అయితే ఇరాన్ లో పాలన కుప్పకూలిపోతే పాకిస్థాన్ కు సంబంధం ఏంటి..? ఇరాన్ లో కట్టప్పలు ఖమేనీని లేపేసేందుకు కాచుకుని కూర్చున్నారా?

ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ చేజారిపోతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి మిసైల్ దాడుల శబ్దం ఒకవైపు గుండెల్లో గుబులు రేపుతుంటే, అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందోనన్న ఆందోళన మరోవైపు. ఈ సమయంలో ఇరాన్ కొత్త సమస్యల ఊబిలో ఇరుక్కుంటోంది. బలోచిస్థాన్ స్వాతంత్ర్యవాదులు, ఇరాన్ విడిపోవాలనుకునే గ్రూప్‌లు తమ సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ అనిశ్చితి ఇరాన్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా రాత్రిపూట నిద్రపట్టని పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇరాన్ శక్తి కోల్పోతున్న ఈ సమయంలో, తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇదే సరైన టైమ్ అని.. ఇరాన్, పాకిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూపులు కుట్రలు పన్నుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పాలనను ముగించేందుకు ఇజ్రాయెల్, అమెరికా సన్నాహాలు చేస్తున్నాయన్న భయం ఉంది. ఈ ఒత్తిడి మధ్య, దేశంలోని మైనారిటీ సమూహాలు, విడిపోవాలనుకునే సంస్థలు తమ ఆందోళనలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి, ఇది ఇరాన్‌లో అస్థిరతను మరింత రెట్టింపు చేస్తోంది.

ఒకవేళ ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వం పడిపోతే, బలోచిస్థాన్ స్వాతంత్ర్య ఉద్యమం మరింత ఉగ్రరూపం తీసుకుంటుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఈ విషయాన్ని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ లేవనెత్తారు. బలోచ్ ప్రజలు పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రాంతంలో, ఇరాన్ సరిహద్దులోని సిస్థాన్-బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇరాన్ ప్రభుత్వం బలోచ్ సమాజాన్ని తొక్కిపడేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బలోచ్ ఏర్పాటు వాద గ్రూప్‌లు ఒక్కటై, స్వతంత్ర బలోచిస్థాన్ కోసం తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల పాకిస్థాన్ సైన్యంపై దాడులను పెంచింది. గతంలో జప్ఫార్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన దీనికి నిదర్శనం. ఈ ఉద్యమం మరింత బలపడితే, పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రాంతంలో అలజడి పెరిగి, దేశ భద్రతకు ప్రమాదం తప్పదని పాకిస్థాన్ భయపడుతోంది.

జైష్ అల్ అదిల్ అనే తీవ్రవాద సంస్థ ఇరాన్, పాకిస్థాన్ రెండు దేశాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ గ్రూప్ ఇరాన్ నుంచి విడిపోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉన్న యుద్ధం తమకు అనుకూలమైన అవకాశంగా చూస్తోంది. ఈ సంస్థలో ఎక్కువ మంది బలోచ్ సభ్యులు ఉండటం వల్ల, దీని ప్రభావం పాకిస్థాన్‌పై కూడా పడొచ్చని ఆ దేశం భయపడుతోంది. బలోచిస్థాన్ ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధపడాలి అని జైష్ అల్ అదిల్ ఆహ్వానం పలికింది. ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని మిలిటెంట్ గ్రూపులు తమ ప్రభుత్వాలపై దాడులకు సన్నద్ధమవుతున్నాయి. పరిస్థితులు అనుకూలంగా మారితే, ఈ రెండు దేశాల తీవ్రవాద గ్రూప్‌లు కలిసి పోరాడే అవకాశం కూడా ఉంది. బలోచ్ జాతికి చెందిన వారు పాకిస్థాన్‌లో 3.6% జనాభా, ఇరాన్, అఫ్గానిస్థాన్‌లో 2% జనాభాతో ఉంది, ఈ ఉద్యమం రెండు దేశాలకూ సవాలుగా మారుతోంది. Political uncertainty is deepening in Iran

అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి స్వదేశం నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఖమేనీ పాలనను కూల్చడానికి ఇరాన్‌లోని మైనారిటీ గ్రూప్‌లు కుట్రలు పన్నుతున్నాయి. ఇరాన్‌లో షియా ముస్లింలు అధికారంలో ఉండగా, బలోచ్, కుర్దులు మైనారిటీ సమూహాలుగా ఉన్నారు. వీరిలో చాలా మంది సున్నీలు. ఖమేనీ షియా ప్రభుత్వం ఈ సమూహాలను అణచివేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్‌లో 10-12 మిలియన్ కుర్దులు ఉన్నారు. ఈ కుర్దులు ఖమేనీ ప్రభుత్వం పతనమైతేనే తమ జీవన పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తూ, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇరాక్, సిరియా, తుర్కియేలో కుర్దులు మైనారిటీలుగా ఉండగా, తుర్కియేలో కుర్దిష్ తీవ్రవాద గ్రూప్‌ను అణచివేశారు, సిరియాలో అహ్మద్ అల్ షారా పాలనలో కుర్దులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌లోనూ కుర్దులు ఖమేనీ దమనాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, కుర్దిష్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇరాన్ ఖమేనీ పాలనను ముగించాలని పిలుపునిచ్చింది. ఇరాన్‌లో భయం పోవాలంటే, ప్రజలు స్వేచ్ఛగా తిరగాలంటే, ఖమేనీ పాలన తప్పక కూలాలి అని KDPI ప్రకటించింది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఈ సవాళ్ల మధ్య ఖమేనీ ప్రభుత్వం ఎంతకాలం నిలబడగలదన్నది సందేహాస్పదంగా మారింది.

Also Read: https://www.mega9tv.com/international/india-did-not-sign-the-cluster-bomb-agreement-why-is-there-a-tremor-in-israel/