ఇరాన్ యుద్ధంలో సహకరించని రష్యా..?

Russia and Iran: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ముదిరి, యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ఇరాన్‌కు మిత్రదేశమైన రష్యా కూడా తన వైఖరిని వెల్లడించింది. కానీ, ఆశ్చర్యం ఏంటంటే, ఇరాన్‌కు రష్యా సైనిక సహాయం చేయలేదు. భారత్‌కు కష్టం వస్తే రష్యా అండగా నిలుస్తుంది, కానీ ఇరాన్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయంలో ఏం చెప్పారు? మిత్ర దేశమైన ఇరాన్ ను వదిలేసి.. ఇజ్రాయెల్ పై రష్యాకు అంత ప్రేమ ఎందుకు..?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలోకి ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయ్యింది. అయితే ఇరాన్ కు ఎంతో మిత్రదేశమైన రష్యా మత్రం అంటిముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ మొదట సైనిక దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తోందనే అనుమానంతో ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఇద్దరు సీనియర్ సైనికాధికారులు, కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైళ్లతో ప్రతిదాడి చేసింది. ఈ ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాన్ని పెంచాయి. రష్యా, ఇరాన్‌కు మిత్రదేశంగా, ఈ సంఘటనపై స్పందించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడులను క్షమించరాని చర్యగా, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని ఖండించింది. అంతే అంతకంటే ముందుకు మాత్రం వెళ్లలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ, ఈ వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించాలని పుతిన్ సూచించారు. అయితే, రష్యా ఇరాన్‌కు సైనిక సహాయం మాత్రం చేయలేదు. ఇది ఇరాన్‌తో రష్యా మిత్రత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. Russia and Iran

రష్యా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక మిత్రత్వం ఉంది. జనవరి 2025లో ఇరు దేశాలు 20 ఏళ్ల స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఆర్థిక, సైనిక సహకారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. రష్యా ఇరాన్‌కు గతంలో ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరఫరా చేసింది, ఇరాన్ రష్యాకు డ్రోన్లు అందించింది. అయితే, ఈ ఒప్పందంలో సైనిక సహాయం లేదా మిలిటరీ అలయన్స్‌కు సంబంధించిన షరతులు లేవు. ఇరాన్ తమ నుంచి సైనిక సహాయం అడగలేదని.. తమ ఒప్పందంలో అలాంటి బాధ్యతలు లేవని రష్యా తెలిపింది. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉంది, దీనివల్ల దాని సైనిక వనరులు, ఆర్థిక స్థితి ఒత్తిడిలో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో మరో యుద్ధంలో చిక్కుకోవడం రష్యాకు రిస్క్‌తో కూడుకున్నది. అంతేకాదు, రష్యా ఇజ్రాయెల్‌తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్‌లో దాదాపు 20 లక్షల మంది రష్యన్ ప్రజల నివసిస్తున్నారు, మాజీ సోవియట్ దేశాల వలసదారులు అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్ లో చాలా మంది రష్యన్ భాషనే మాట్లాడతారు. దీంతో ఇజ్రాయెల్ తమ దేశం కిందే భావిస్తుంది రష్యా. ఈ కారణంగా రష్యా ఇజ్రాయెల్‌తో సంబంధాలను కాపాడుకోవాలనుకుంటుంది.

పుతిన్ ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో రష్యా వైఖరిని స్పష్టం చేశారు. జూన్ 20న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ, రష్యా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. తాము ఎవరిపైనా ఏదీ రుద్దడం లేదని… ఈ వివాదానికి రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం చూడాలని మేం సూచిస్తున్నామని పుతిన్ అన్నారు. ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని, దానికి ఇరాన్‌కు హక్కు ఉందని పుతిన్ సమర్థించారు. అంతేకాదు, ఇజ్రాయెల్‌తో మాట్లాడి, ఇరాన్‌లోని రష్యా నిర్మించిన బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పనిచేసే 200 మంది రష్యన్ సిబ్బంది భద్రతను నెతన్యాహూ హామీ ఇచ్చారని తెలిపారు. రష్యా ఈ వివాదంలో నేరుగా చొరబడకుండా, శాంతి చర్చల ద్వారా పరిష్కారం చూడాలని కోరుకుంటోంది. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తోందనే ఆధారాలు తమకు, అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు లేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

భారత్‌కు రష్యా దీర్ఘకాలిక మిత్రదేశం. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఉంది. భారత్‌కు కష్టం వస్తే, రష్యా అండగా నిలబడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. రష్యా భారత్‌కు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, సుఖోయ్ యుద్ధ విమానాలు సరఫరా చేస్తోంది. రష్యా ఇరాన్‌తో మిత్రత్వం కొనసాగిస్తూనే, ఇజ్రాయెల్‌తో సంబంధాలను కాపాడుకుంటోంది. భారత్ కూడా ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతిక రంగాల్లో బలమైన సంబంధాలు కలిగి ఉంది. రష్యా ఈ వివాదంలో నిష్పక్షపాతంగా, దౌత్యపరంగా వ్యవహరించడం భారత్‌కు అనుకూలం, ఎందుకంటే భారత్ మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకుంటుంది. రష్యా ఈ వివాదంలో చిక్కుకోకుండా, శాంతి చర్చలపై దృష్టి పెట్టడం ద్వారా తన ప్రపంచ ప్రభావాన్ని కాపాడుకుంటోంది. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో రష్యా వైఖరి భారత్‌తో సంబంధాలను బలపరచడమే కాకుండా, మధ్యప్రాచ్యంలో స్థిరత్వం కోసం భారత్ ఆకాంక్షలకు తోడ్పడుతుంది.

Also Read: https://www.mega9tv.com/international/trump-claims-that-khamenei-is-a-us-target-america-bombs-iran/