
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యాలోని ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంతో, రష్యా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతోందా? ఈ దాడుల నేపథ్యంలో రష్యా తదుపరి చర్య ఏమిటి? ఉక్రెయిన్ ఎలాంటి దాడులు చేసింది, రష్యాకు ఎంత నష్టం జరిగింది? ఈ ఘటన తర్వాత ట్రంప్, పుతిన్ క ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారు? నార్త్ కొరియా రష్యాకు మద్దతు ఇస్తుందా, కిమ్ జాంగ్ ఉన్ తన టీమ్‌కు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? రష్యా ప్రతీకార చర్యను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందా?
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరో కీలక దశకు చేరుకుందా.? రష్యా ఇంతకు ముందు చేసిన దాడులకు తీవ్రంగా దాడి చేయబోతోందా..? ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. రష్యాలోని ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ ఆకస్మిక డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 41 రష్యన్ విమానాలు ధ్వంసమయ్యాయి. వీటిలో స్ట్రాటజిక్ బాంబర్స్, సర్వైలెన్స్ విమానాలు ఉన్నాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ విడుదల చేసిన వీడియోలో, డ్రోన్‌లు చెక్క షెడ్‌ల పైకప్పుల్లో దాక్కుని, రష్యా విమానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు కనిపిస్తోంది. ఈ దాడి, రష్యా సైనిక సామర్థ్యాన్ని పెద్ద దెబ్బ తీసింది, ఎందుకంటే ఈ విమానాలను ఉక్రెయిన్ నగరాలపై దాడులకు ఉపయోగిస్తున్నారు.
రష్యాకు ఈ దాడుల వల్ల తీవ్ర నష్టం జరిగింది. 41 విమానాలు దెబ్బతినడంతో, రష్యా వైమానిక దాడుల సామర్థ్యం గణనీయంగా తగ్గింది. ఈ దాడి తర్వాత రష్యా వెంటనే ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం.
ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ దాడులకు తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని పుతిన్ ట్రంప్ తో గట్టిగా చెప్పారు. ఈ ఫోన్ సంభాషన వివరాలను ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. తమ మధ్య సంభాషణ మంచిగానే జరిగిందని అయితే.. వెంటనే శాంతి పరిస్థితులు ఏర్పడవని ట్రంప్ పేర్కొన్నారు. అయితే పుతిన్ కోపాన్ని తగ్గించడానికి ట్రంప్ ఒత్తిడి చేశారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు, కానీ ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో, రష్యా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 2న రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒక పెద్ద డ్రోన్ యుద్ధమే జరిగింది, ఇది ఇస్తాంబుల్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు బ్రేక్ పడేలా చేసింది. తాజా ఘటనలు యుద్ధం మరింత తీవ్రమవుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. మేలో.. రష్యా ఉక్రెయిన్‌పై 367 డ్రోన్‌లు, మిస్సైల్‌లతో దాడి చేసింది. ఇది యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడిగా నిలిచింది. ఈ దాడుల్లో 12 మంది, వీరిలో ముగ్గురు చిన్నారులు, మరణించారు. రష్యా, ఈ దాడులను సైనిక లక్ష్యాలపైనే చేసినట్లు చెప్పినప్పటికీ, ఉక్రెయిన్ నగరాలపై దాడులు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఏం చేస్తుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అటు నార్త్ కొరియా రష్యాకు మద్దతు ఇస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు అందింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు భేటీ అయ్యారు. ఈసందర్భంగా కీవ్‌తో యుద్ధానికి రష్యాకు తాము భేషరతుగా మద్దతిస్తున్నట్లు కిమ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ సమస్యలలో రష్యా వైఖరినీ, ఆ దేశ విదేశాంగ విధానాలకు బేషరతుగా మద్దతిస్తోంది అని కిమ్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కుర్స్క్ ప్రాంతం పునర్‌నిర్మించే అంశంపై కూడా మాట్లాడుకున్నారు. షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఆయన మార్చిలోనే ఈ దేశంలో పర్యటించి కిమ్‌తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తోన్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టంచేశారు. రష్యా-ఉత్తర కొరియాల మధ్య జరిగిన పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఎంతమంది సైన్యం ఉన్నారనే విషయం మాత్రం బయటపెట్టలేదు. అయితే, 10-12వేల మందికిపైగా బలగాలు ఉండవచ్చని ఉక్రెయిన్ నిఘా సంస్థ, దక్షిణ కొరియా అధికారులు గతంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా రష్యా అత్యాధునిక ఆయుధాలు, అత్యున్నత సాంకేతికతను కిమ్‌కు అందిస్తున్నట్లు తెలుస్తోంద
రష్యా ప్రతీకార చర్యను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందా అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, పుతిన్‌తో సమావేశం జరిగే వరకు యుద్ధ విరమణ ప్రతిపాదించారు. కానీ రష్యా దీనికి స్పందించలేదు. జెలెన్‌స్కీ, ఈ దాడులను స్పైడర్స్ వెబ్ ఆపరేషన్‌గా పేర్కొన్నారు. రష్యా యుద్ధ విరమణకు అంగీకరించి ఉంటే ఈ దాడులు జరిగేవి కావు అని అన్నారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ తమ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది, కానీ అమెరికా ఆయుధ సాయం, ఆర్థిక సహాయం ఆగిపోవడంతో ఉక్రెయిన్ కు ఇబ్బందిగా మారింది. ట్రంప్, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒత్తిడి తెస్తున్నప్పటికీ, పుతిన్‌ను ఆపడంలో విజయం సాధించలేకపోతున్నారు. ఇటీవీ నగరాలపై రాకెట్లు వేయడం మంచి పద్దతి కాదని పుతిన్ ను ట్రంప్ హెచ్చరించారు. కానీ రష్యా దాడులు ఆగలేదు. ట్రంప్, రష్యాపై కొత్త ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఉక్రెయిన్ శక్తివంతమైన డ్రోన్ దాడులతో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చినప్పటికీ, రష్యా ప్రతీకార దాడులు మరింత తీవ్రమవుతాయనే ఆందోళనలు ఉన్నాయి. అయితే యూరోపియన్ యూనియన్, అమెరికాతో కలిసి రష్యాపై కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆంక్షలు రష్యా ఎనర్జీ సెక్టార్‌పై దృష్టి సారించనున్నాయి, నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌లకు సంబంధించిన కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో, ఈ యుద్ధం మరింత ఉద్ధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.