
అమెరికాలో ఏం జరుగుతోంది..? ప్రపంచానికి శాంతి బోధించే పెద్దన్న ట్రంప్.. ఇప్పుడు తమ దేశంలో మొదలైన అల్లర్లను చక్కదిద్దడంలో విఫలమయ్యారా..? అక్రమ వలస దారులను పట్టుకునేందుకు మొదలుపెట్టిన చర్యలు దారిమళ్లాయా..? ఇప్పుడు అవే ట్రంప్ కొంపముంచాయా.? లాంజ్ ఏంజెలెస్ అల్లర్లు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి కారణమేంటి..? ట్రంప్ తీరుపై ఎలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి..? అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పడిపోతుందా..?
అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్‌లో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, చికాగో, సియాటెల్ వంటి నగరాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆందోళనలను అణచివేయడానికి నేషనల్ గార్డ్‌లు, మెరైన్‌లను మోహరించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు చేపట్టిన దాడులు లాస్ ఏంజెలెస్‌లో ఇటీవల భారీ ఆందోళనలకు దారితీశాయి. శుక్రవారం నుంచి లాస్ ఏంజెలెస్‌లోని హిస్పానిక్ సముదాయం ఎక్కువగా ఉండే దక్షిణ లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో ఐసీఈ అధికారులు దాడులు మొదలుపెట్టారు. ఒకే ఆపరేషన్‌లో 44 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. గ్రేటర్ లాస్ ఏంజెలెస్‌లో డజన్ల కొద్దీ మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్‌లోని పలు ప్రాంతాల్లో యాంటీ-ఐసీఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలు శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయిస్‌విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో వంటి నగరాలకు వ్యాపించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మందిని, న్యూయార్క్‌లో పలువురిని అరెస్టు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో లో వేలాది మంది ఐసీఈ రైడ్స్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు.

ట్రంప్ కార్యవర్గం రోజూ కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేయాలని ఐసీఈని ఆదేశించడంతో ఈ సమస్య మొదలైంది. ఈ ఆదేశాల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్‌లో దాడులు తీవ్రమవడంతో ఆందోళనలు ఊపందుకున్నాయి. డెటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ట్రంప్ 2,000 మంది నేషనల్ గార్డ్‌లను, 700 మంది మెరైన్‌లను లాస్ ఏంజెలెస్‌లో మోహరించారు. ఐసీఈ అధికారులను రక్షించేందుకు నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగాయి. అమెరికాలో నేషనల్ గార్డ్ అనేది రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేసే హైబ్రీడ్ విభాగం. సాధారణంగా గవర్నర్ ఆదేశాలతో రాష్ట్రాల్లో వీరిని మోహరిస్తారు, కానీ ట్రంప్ తన అరుదైన అధికారాలను వినియోగించి 1965 తర్వాత తొలిసారిగా ఫెడరల్ స్థాయిలో నేషనల్ గార్డ్‌లను లాస్ ఏంజెలెస్‌లో దింపారు. ఈ చర్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. నేషనల్ గార్డ్‌ల మోహరించాల్సిన అవసరం లేదని, సొంత పౌరులపై సైన్యాన్ని ఉపయోగించడం సరికాదని అన్నారు. నేషనల్ గార్డ్‌లకు సరైన ఆహారం, నీరు, నిద్రించే స్థలం వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదని ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. హింసాత్మక చర్యలను అడ్డుకోవడానికి, అల్లర్లను ఎదుర్కోవడానికి నేషనల్ గార్డ్ మోహరింపు అవసరమని, లేకపోతే లాస్ ఏంజెలెస్ తుడిచిపెట్టుకుపోయేదని అన్నారు. న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డు తగిలేవారిని అరెస్టు చేస్తామని బోర్డర్ జార్ టామ్ హోమన్ హెచ్చరించగా, ట్రంప్ ఈ వైఖరిని సమర్థించారు, న్యూసమ్‌ను అరెస్టు చేయాలన్న హోమన్ వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించారు.
అయితే లాస్ ఏంజెలెస్ ఇలాంటి ఆందోళనలు కొత్త కాదు. గతంలో కూడా ఈ నగరం భారీ నిరసనలకు కేంద్రంగా నిలిచింది. 1968లో 15,000 మంది మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు విద్యా వివక్షకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. శ్వేతజాతీయులకు ఉన్నత విద్యను ప్రోత్సహించిన ప్రభుత్వం, మెక్సికన్ అమెరికన్‌లకు వొకేషనల్ శిక్షణతో సరిపెట్టడం, స్పానిష్ మాట్లాడటంపై నిషేధం విధించడం వంటి చర్యలను వ్యతిరేకించారు. ఈ నిరసనలు షికానో పౌర హక్కుల ఉద్యమానికి నాంది పలికింది.. 1992లో రాడ్నీ కింగ్ కేసులో నలుగురు శ్వేతజాతి అధికారులను నిర్దోషులుగా ప్రకటించడంతో ఆందోళనలు చెలరేగాయి. 50 మంది మరణించగా, 2,000 మంది గాయపడ్డారు. అప్పటి అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ వేలాది నేషనల్ గార్డ్‌లు, మెరైన్‌లను మోహరించారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం లాస్ ఏంజెలెస్‌ను కుదిపేసింది. లూటీలు, హింసతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది.

ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఐసీఈ దాడులు, నేషనల్ గార్డ్ మోహరణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలు, న్యూసమ్ వ్యతిరేకత ఈ సమస్యను జటిలం చేస్తున్నాయి. బోర్డర్ జార్ టామ్ హోమన్ ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డుపడేవారిని అరెస్టు చేస్తామని హెచ్చరించడం, ట్రంప్ దాన్ని సమర్థించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టాయి. ఈ ఘటనలు అమెరికాలో ఇమిగ్రేషన్ విధానాలపై, జాతి సంబంధాలపై తీవ్ర చర్చను రేకెత్తిస్తున్నాయి. గతంలో రాడ్నీ కింగ్, జార్జ్ ఫ్లాయిడ్ ఆందోళనలు దేశవ్యాప్త ఉద్యమాలకు దారితీసినట్టు, ఈ నిరసనలు కూడా పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎలా సమసిపోతాయి, ట్రంప్ విధానాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారమవుతుందా లేక మరింత హింసాత్మకంగా మారుతుందా అనేది సమయమే చెప్పాలి.