ప్రధాని షినవాత్రపై సస్పెన్షన్‌ వేటు..!

Thailand PM Shinawatra suspended: థాయ్‌లాండ్‌ యువ ప్రధాని పేటోంగ్టార్న్ పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్‌ కాల్‌ లీక్ అవడం ఆమె పదవికి ఎసరు పెట్టింది. దేశంలోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని ఆమెపై కేసు కూడా దాఖలైంది. దానిపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అదేంటి ఒక ఫోన్ కాల్ ఎందుకంత వివాదానికి కారణమైంది..? అందమైన థాయ్ లాండ్ ప్రధాని చిక్కుల్లో ఎందుకు వివాదానికి కేంద్రబిందువయ్యారు..? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి..?

థాయ్‌లాండ్‌ బిలియనీర్‌, మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రా కుమార్తె అయిన షినవత్రా.. గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే అనుభవ రాహిత్యమో తెలియదు కాని తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చారు. థాయ్‌లాండ్‌ కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్‌ మానెట్‌ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే, పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్‌సేన్‌. ఇటీవల ఆయనకు థాయ్‌ ప్రధాని షినవత్రా ఫోన్‌ చేశారు. అంకుల్‌ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్‌ ఆర్మీ కమాండర్‌ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్‌కాల్‌ సంభాషణ లీకైంది. సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండగా.. సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో అవి మరింతగా దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్‌ భూమ్‌జాయ్‌థాయ్‌ పార్టీ విడిపోయింది.

మాజీ ప్రధాని తక్సిన్ షినవాత్ర కుమార్తె అయిన పేటోంగ్టార్న్ షినవాత్రకు రాజకీయ అనుభవం తక్కువ. 2006లో సైనిక తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన తక్సిన్ .. అవినీతి ఆరోపణలతో 15 ఏళ్ల పాటు విదేశాల్లో తలదాచుకున్నాడు. 2023లో థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చిన తక్సిన్, జైలు శిక్షకు బదులు వీఐపీ హాస్పిటల్ సూట్‌లో గడిపాడు. తర్వాత రాజ విధేయత కేసులో పెరోల్ పొందాడు. 2024 ఆగస్టులో, మాజీ ప్రధాని స్రెత్తా థవిసిన్‌ను కోర్టు తీర్పు ఉల్లంఘన కేసులో పదవి నుంచి తొలగించిన తర్వాత షినవాత్ర ప్రధాని అయ్యారు. స్రెత్తా, తక్సిన్‌కు సన్నిహితుడైన ఒక న్యాయవాదిని మంత్రిగా నియమించడం వల్ల ఈ పేటోంగ్టార్న్ షినవాత్ర ప్రధాని అయ్యారు. ఆమెకు రాజకీయ అనుభవం తక్కువ, కానీ తండ్రి ప్రభావం వల్ల రాజకీయాల్లో నెట్టుకువస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్నా ఆమె అందం గురించి సోషల్ మీడియాలో, మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఆమె యువతరానికి ఆకర్షణీయంగా, ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుందని, ఆమె స్టైలిష్ డ్రెస్సింగ్, ఆధునిక ఇమేజ్ ఆమెను ప్రధాని కంటే ఫ్యాషన్ ఐకాన్ గా చూస్తారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అమె చేసిన ఓ చిన్న ఫోన్ కాల్.. ప్రధాని పదవికి గండం తెచ్చిపెట్టింది.

థాయ్‌లాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం గురించి, ముఖ్యంగా ప్రెహ్ విహెర్ దేవాలయం వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ ఫోన్ కాల్ లో చర్చించారు. దీనికి తోడు ఈ కాల్‌లో షినవాత్ర, థాయ్‌లాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ను తన ప్రత్యర్థి అని పరోక్షంగా అనడం, కంబోడియా మాజీ ప్రధాని హన్ సెన్‌ను అంకుల్ అని సంబోధించడం థాయ్‌లాండ్‌లో వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యాన్ని అవమానించినట్లు, దేశ భద్రతను తక్కువ చేసినట్లు భావించారు, దీంతో ప్రజల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ ఈ లీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కంబోడియా రాయబారికి లేఖ రాసింది, ఈ లీక్ ద్వైపాక్షిక చర్చలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ లీక్ వల్ల థాయ్‌లాండ్‌లో షినవాత్రపై విమర్శలు వ్యక్తమయ్యాయి. Thailand PM Shinawatra suspended.

థాయ్ ఆర్మీ చీఫ్‌ను షినవాత్ర ప్రత్యర్థిగా పేర్కొనడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యానికి, దేశభక్తులకు కోపం తెప్పించాయి, ఎందుకంటే సైన్యం థాయ్‌లాండ్‌లో శక్తివంతమైన, గౌరవనీయమైందిగా భావిస్తారు. దేశ భద్రతా విషయంలో షినవాత్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. హన్ సెన్, కంబోడియాలో ఇప్పటికీ బలమైన ప్రభావం కలిగిన నాయకుడు, అయితే ఆయనే ఈ కాల్‌ను లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి, కానీ దీనిపై స్పష్టత లేదు. ఈ లీక్ వల్ల థాయ్‌లాండ్‌లో షినవాత్ర రాజకీయ నాయకత్వంపై సందేహాలు పెరిగాయి. ఆమె సరిహద్దు సమస్యను సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కావడంతో, ప్రజలు ఆమె రాజకీయ అనుభవం చేస్తున్నారు. అందంపై పెట్టిన దృష్టి పాలనపై కూడా పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.

అటు ఈ ఫోన్ కాల్ లీక్ వల్ల షినవాత్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె ప్రభుత్వంలో కీలక కూటమి భాగస్వామి అయిన ఒక ప్రధాన పార్టీ బయటకు వెళ్లిపోయింది, దీంతో ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడింది. విపక్ష పార్టీలు, వివిధ సంఘాలు ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ, ఆమె నాయకత్వం దేశ భద్రతకు ముప్పు అని ఆరోపించాయి. అయితే దీనిపై మీడియా ముందు షినవాత్ర క్షమాపణ కూడా చెప్పారు. ఈ లీక్ వల్ల ప్రజల్లో తనపై ఆగ్రహం కలిగిందని.. దీనికి తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అయితే, ఈ క్షమాపణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సంక్షోభంలో ఉంది, ఈ రాజకీయ అస్థిరత వల్ల విదేశీ పెట్టుబడులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఈ సమయంలోనే అమెపై కేసు కూడా నమోదైంది. దీనిపై విచారణ జరిపిన దేశ న్యాయస్థానంపై ఆమెపై వేటు వేసింది. దీంతో తుది తీర్పు వెలువడే వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనుంది.

Also Read: https://www.mega9tv.com/international/north-korean-dictator-kim-unveils-new-plan-to-boost-tourism-opens-huge-beach-resort/