ట్రంప్ రెండో పర్యాయంలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, లాస్ ఏంజెలస్ ఆందోళనలు..!

అటు ప్రపంచ దేశాలను.. ఇటు సొంత దేశంలోని ప్రజలను ట్రంప్ వణికిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా రెండో పర్యాయంలో ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి, అరెస్ట్ చేసి, డిపోర్ట్ చేసేందుకు భారీ ఆపరేషన్‌లు చేపట్టారు. ఈ చర్యలు లాస్ ఏంజెలస్ వంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. అసలు లాస్ ఏంజెలస్ లో ఏం జరుగుతోంది..? ట్రంప్ ఆ నగరంపై ఎందుకు ఫోకస్ పెట్టారు..? అసలు అక్రమ వలసలపై ట్రంప్ ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? ట్రంప్ అక్రమ వలసలను పూర్తి స్థాయిలో అరికట్టగలరా..?

ఓ పక్క టారిఫ్ లు.. మరో పక్కా అక్రమ వలసపై కఠిన నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అటు ప్రపంచ దేశాలను.. ఇటు దేశంలోని అక్రమ వలస దారులను వణికిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను డిపోర్ట్ చేయడానికి భారీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జనవరి నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు అమెరికాలోని చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజెలస్ వంటి నగరాల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం బైడెన్ కాలంలో అనుమతించిన కొన్ని ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌లను రద్దు చేసింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా నుంచి వచ్చిన 5.3 లక్షల మందికి అనుమతించిన హ్యూమానిటేరియన్ పరోల్‌ను రద్దు చేసింది. అలాగే, అక్రమ వలసదారులను వెంటనే డిపోర్ట్ చేసే కొత్త పాలసీని తీసుకొచ్చింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న 1.17 కోట్ల మందిని వారి స్వదేశానికి పంపే లక్ష్యంగా పనిచేస్తోంది ట్రంప్ సర్కార్.

అయితే లాస్ ఏంజెలస్‌లో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చెలరేగాయి. ఫిబ్రవరి 2025 నుంచి వలసదారుల హక్కుల కోసం వేలాది మంది 101 ఫ్రీవేపై ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేసే కార్యక్రమాలు చేపట్టారు. అయితే జూన్ 6, 7 తేదీల్లో ICE ఏజెంట్లు లాస్ ఏంజెలస్‌లో దాదాపు 70-80 మందిని అరెస్ట్ చేశారు, దీనికి నిరసనగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనల్లో కొందరు రాళ్లు, సీసాలు విసిరారు, దీంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్, స్టన్ గ్రెనేడ్‌లను ఉపయోగించారు. శనివారం జరిగిన ఆందోళనల్లో లాస్ ఏంజెలస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా మందిని అరెస్టు చేసింది.

లాస్ ఏంజెలస్‌లోని ఆందోళనలను ట్రంప్ రైట్స్ అండ్ లూటర్స్ గా పేర్కొన్నారు. అలాగే కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజెలస్ మేయర్ ను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. వీళ్లు తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారని.., ఫెడరల్ ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని పోస్ట్ చేశారు. అటు 2,000 మంది నేషనల్ గార్డ్ సైనికులను లాస్ ఏంజెలస్‌లో మోహరించారు. అయితే స్థానిక గవర్నర్, మేయర్ ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.. ఈ దాడులను ప్రజల్లో భయాందోళనలను సృష్టించే చర్యలుగా పేర్కొన్నారు. ICE ఏజెంట్లు ప్రజలను వీధుల్లో పరుగులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విమర్శలు ట్రంప్ ఫెడరల్ అధికారాన్ని ఉపయోగించి స్థానిక నాయకులను ఒత్తిడి చేస్తున్న వైఖరికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ఎక్కడున్నా .. ఎదుటి వ్యక్తిపై అథారిటీ చెలాయించాలనే ఆలోచనలో ఉంటారు. చివరికి అమెరికాలోని మేయర్లు, గవర్నర్లపై కూడా ఆ అథారిటీ చెలాయిస్తున్నారు.

అయితే ట్రంప్ అక్రమ వలసదారులను అరికట్టకపోతే అమెరికాకే ముప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అక్రమ వలసలను దేశ భద్రతకు ముప్పు గా భావిస్తారు. ఆయన 2024 ఎన్నికల ప్రచారంలో అమెరికాను ఆక్రమణ నుంచి కాపాడతాం, క్రిమినల్ వలసదారులను డిపోర్ట్ చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ విధానం వెనుక ఆయన మాజీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్, బోర్డర్ చీఫ్ టామ్ హోమన్ వంటి కఠిన వలస వ్యతిరేక నాయకుల ప్రభావం ఉంది. ట్రంప్ వీసాలపై కూడా కఠిన నియంత్రణలు విధించారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు, విద్యార్థి వీసాలపై ఉన్నవారు ట్రంప్ విధానాలను విమర్శిస్తే వారిని డిటైన్ చేస్తున్నారు. పాలస్తీనియన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ను ప్రో-పాలస్తీన్ ఆందోళనల్లో పాల్గొన్నందుకు అరెస్ట్ చేశారు. అలాగే, యెమెన్, సోమాలియా, హైతీ వంటి దేశాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్ బ్యాన్ విధించారు.

అటు అమెరికా వీసా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సంతకం చేశారు. దీని ద్వారా 12 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రతా కారణాలతో తీసుకున్నామని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ దేశాల నుంచి వచ్చే వ్యక్తులను సరిగ్గా స్క్రీనింగ్ చేయడం, వారి నేపథ్యాన్ని వెరిఫై చేయడం సాధ్యం కావడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ జాబితాలో అఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉగ్రవాదం, జాతీయ భద్రతకు ముప్పు వంటి సమస్యలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ తెలిపింది.