
Trump Musk BigBeautiful Bill: ట్రంప్, ఎలాన్ మస్క్… ఈ ఇద్దరూ మళ్లీ మాటల యుద్ధం మొదలెట్టారు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య గొడవ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. మస్క్ కొత్త పార్టీ గురించి మాట్లాడితే, ట్రంప్ ఎలక్ట్రిక్ కార్ల రాయితీలపై సెటైర్లు వేశారు. అసలు ఈ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది? మస్క్ కొత్త పార్టీ గురించి ఏం చెప్పారు? ట్రంప్ ఎలక్ట్రిక్ కార్ల అంశంలో ఎలా కౌంటర్ ఇచ్చారు? ఈ గొడవను ఎలా చూడాలి?
ట్రంప్, మస్క్.. ఒకరు అమెరికా అధ్యక్షుడు. మరొకరు ప్రపంచ కుబేరుడు. ఒకప్పుడు వారిద్దరు ప్రాణస్నేహితులు కాని.. ఇప్పుడు శత్రువులగా మారారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్, మస్క్ మధ్య గొడవ జూన్‌లో మొదలైంది. ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఖర్చుల బిల్లు విషయంలో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ బిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే రాయితీని తొలగించారు. దీనితో మస్క్ ఆగ్రహించారు,. ఈ బిల్ దేశ రుణాన్ని 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచుతుందని, ఆదాయ లక్ష్యాలను చేరదని విమర్శించారు. దీనికి కౌంటర్‌గా, మస్క్ కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకు ఇచ్చే బిలియన్ల డాలర్ల సబ్సిడీలను రద్దు చేస్తానని ట్రంప్ బెదిరించారు. చివరికి రిపబ్లికన్‌లను 2026 ఎన్నికల్లో ఓడించేందుకు కొత్త పార్టీ పెడతానని మస్క్ చెప్పేంత దూరానికి ఈ వివాదం వెళ్లింది. ఈ వివాదం వల్ల టెస్లా షేర్లు 14% పడిపోయాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఈ గొడవ వ్యక్తిగత దూషణల వరకు వెళ్లి, రాజకీయ, వ్యాపార లాభాల మధ్య ఘర్షణగా మారింది. Trump Musk BigBeautiful Bill.
జూన్‌లో ఎలాన్ మస్క్, ట్రంప్ బిల్‌ను వ్యతిరేకిస్తూ, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ప్రకటించారు. ఈ బిల్ దేశ రుణాన్ని 5 ట్రిలియన్ డాలర్లు పెంచుతుందని, రిపబ్లికన్‌లు ఖర్చు తగ్గిస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఈ బిల్‌ను సమర్థించిన రిపబ్లికన్ ఎంపీలను 2026 మధ్యంతర ఎన్నికల్లో ఓడించేందుకు ది అమెరికా పార్టీ అనే కొత్త పార్టీ పెడతానని చెప్పారు. ఈ పార్టీ అమెరికాలో 80% మధ్యతరగతి ప్రజల అవసరాలను తీరుస్తుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలు ప్రజలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్‌లో రాజకీయ లాభాల కోసం ప్రభుత్వ సొమ్ము వినియోగించడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు.
అటు ట్రంప్, మస్క్ వివాదంలో ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలు పెద్ద అంశంగా మారాయి. ట్రంప్ తన బిల్‌లో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఇచ్చే 7,500 డాలర్ల టాక్స్ క్రెడిట్‌ను తొలగించారు. ఈ నిర్ణయం టెస్లాకు నష్టమని, మస్క్ ఈ కారణంగానే బిల్‌ను వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎవరూ కొనని ఎలక్ట్రిక్ కార్ల కోసం బిలియన్ల డాలర్లు రాయితీల పేరుతో వృథా చేస్తున్నారని, మస్క్ కంపెనీలు ఈ సబ్సిడీల మీద ఆధారపడుతున్నాయని సెటైర్లు వేశారు. అయితే మస్క్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. రాయితీలు తొలగించినా టెస్లాకు నష్టం లేదని, ఇతర కంపెనీలకే ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పారు. అయినా, ఈ బిల్‌లోని ఇతర వృధా ఖర్చులను మస్క్ విమర్శించారు, దీనిపై ట్రంప్ మరింత ఆగ్రహించారు.
ట్రంప్, మస్క్ గొడవను రాజకీయ, వ్యాపార లాభాల ఘర్షణగా చూడొచ్చు. 2024 ఎన్నికల్లో మస్క్ 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ట్రంప్‌కు సహాయం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, మస్క్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ హెడ్‌గా నియమించారు. దీని లక్ష్యం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. కానీ, ఈ బిల్ విషయంలో విభేదాలతో వీరి సంబంధం చెడిపోయింది. మస్క్ ఈ బిల్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరంగా భావిస్తే, ట్రంప్ దాన్ని తన పాలనలో పెద్ద విజయంగా చూపాలనుకున్నారు. ఈ గొడవ వ్యక్తిగత ఈగోల ఘర్షణగా మారింది. మస్క్ ట్రంప్‌ను జెఫ్రీ ఎప్స్టీన్ కేసుతో ముడిపెట్టి మాటల దాడి చేయడం, ట్రంప్ మస్క్‌ను సౌత్ ఆఫ్రికాకు వెళ్లిపో అని సెటైర్ వేయడం గొడవను మరింత పెంచింది. మధ్యలో ఈ గొడవ కాస్త చల్లారినా మళ్లీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో వీరి గొడవ ఇంకా పూర్తికాలేదని కేవలం విరామం ఇచ్చారని భావిస్తున్నారు.