సిట్యుయేషన్ రూమ్‎కి ట్రంప్.. ఏం జరగబోతోంది..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సదస్సును సగంలో వదిలేసి, వైట్ హౌస్ లో సిట్యుయేషన్ రూమ్‌లో నేషనల్ సెక్యూరిటీ టీమ్‌తో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంఘటన పశ్చిమాసియాలో ఏదో పెద్ద పరిణామం జరుగుతోందన్న సంకేతాలను ప్రపంచానికి ఇచ్చింది. గతంలో అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్, ఐసిస్ నేత అబూ బకర్ అల్ బగ్దాదీలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా అధ్యక్షుడు ఈ సిట్యుయేషన్ రూమ్ నుంచే ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ట్రంప్ ఈ సిట్యుయేషన్ రూమ్ కు వెళ్లాడంతో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ సిట్యుయేషన్ రూమ్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? దీని పని ఏమిటి? ఎందుకు ఇంత రహస్యంగా ఉంటుంది?

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సును మధ్యలో వదిలేసి, వాషింగ్టన్‌కు బయల్దేరారు. ట్రంప్ శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ని సిద్ధంగా ఉంచమని ఆదేశించారు. ఈ గదిలో అధ్యక్షుడు, ఆయన సలహాదారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సిట్యుయేషన్ రూమ్ వైట్ హైస్ లోని వెస్ట్ వింగ్ బేస్‌మెంట్‌లో, 5,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో కాన్ఫరెన్స్ రూమ్, ఇంటెలిజెన్స్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఉన్నాయి. ఇక్కడ అత్యంత సురక్షిత కమ్యూనికేషన్ పరికరాలతో అమెరికా అధ్యక్షుడు ప్రపంచ నాయకులతో, సైనిక అధికారులతో మాట్లాడతారు. ఈ గది 24 గంటలూ ప్రపంచవ్యాప్త పరిణామాలను గమనిస్తుంది.

సిట్యుయేషన్ రూమ్‌ను మొదట 1961లో ఏర్పాటు చేశారు. 1898లో స్పానిష్-అమెరికన్ యుద్ధం సమయంలో అప్పటి అధ్యక్షుడు మెకిన్లీ వార్ రూమ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించారు. అప్పట్లో టెలిగ్రాఫ్, మ్యాప్‌లతో సమాచారం సేకరించేవారు. కానీ 1961లో క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా చేపట్టిన బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ విఫలమైంది. రియల్‌టైమ్ సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని అమెరికా గుర్తించింది. దీంతో అత్యంత రహస్య, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థతో సిట్యుయేషన్ రూమ్‌ను రూపొందించారు. ఈ గదిలో ఐదు బృందాలు పనిచేస్తాయి. ప్రతి బృందంలో ముగ్గురు డ్యూటీ ఆఫీసర్లు, ఒక కమ్యూనికేషన్ అసిస్టెంట్, ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ ఉంటారు. మొత్తం 30 మంది సిబ్బంది, వివిధ ఏజెన్సీలు, సైనిక విభాగాల నుంచి ఇక్కడ పనిచేస్తారు. ఈ టీమ్ రోజూ జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను గమనిస్తూ, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తుంది.

సిట్యుయేషన్ రూమ్‌లో 24 గంటలూ ప్రపంచవ్యాప్త సమాచారం సేకరిస్తారు. అధ్యక్షుడు శ్వేతసౌధంలో లేనప్పుడు కూడా రహస్య సమాచారం ఈ గదికి చేరుతుంది. ఈ సమాచారాన్ని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సీనియర్ అధికారులకు చేరవేస్తారు. రోజువారీ ఇంటెలిజెన్స్, విదేశీ వ్యవహారాలు, దౌత్య సమాచారం ఈ గది నుంచే అందుతాయి. ఏదైనా పెద్ద సంఘటన జరిగితే, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, శ్వేతసౌధ అధికారులకు సిట్ రూమ్ నోట్ పేరిట నోటిఫికేషన్ పంపిస్తారు. 2006-07లో ఈ గదిలో పెద్ద మార్పులు చేశారు. పాత కాథోడ్ రే ట్యూబ్ మానిటర్లు, ఫ్యాక్స్ మిషన్ల స్థానంలో కొత్త కమ్యూటర్లు, వేగవంతమైన కమ్యూనికేషన్ పరికరాలు అమర్చారు. ఎయిర్‌ఫోర్స్ వన్ కు డైరెక్ట్‌గా సమాచారం పంపే వ్యవస్థ, సెల్‌ఫోన్ సిగ్నల్ సెన్సర్లు జోడించారు. 2023లో మరోసారి ఆధునిక ఆడియో, కంప్యూటర్ వ్యవస్థలతో అప్‌గ్రేడ్ చేశారు.

సిట్యుయేషన్ రూమ్ చరిత్రలో పలు కీలక ఆపరేషన్లకు వేదికగా నిలిచింది. 1962లో క్యూబా మిస్సైల్ సంక్షోభం సమయంలో మొదటిసారి ఈ గదిని వాడారు. 1979-81లో ఇరాన్‌లో బందీల సంక్షోభం సమయంలో కూడా ఇక్కడి నుంచే నిర్ణయాలు తీసుకున్నారు. 2001లో 9/11 దాడుల తర్వాత అమెరికా ప్రతిస్పందనకు సంబంధించిన ప్లానింగ్ ఈ గదిలో జరిగింది. 2006లో అల్‌ఖైదా ఉగ్రవాది అబూ ముసబ్ అల్ జరాక్వి కాంపౌండ్‌పై దాడి ప్లాన్ కూడా ఇక్కడే రూపొందింది. 2011లో అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్‌లో అమెరికా నేవీ సీల్స్ మట్టుబెట్టిన ఆపరేషన్‌ను అప్పటి అధ్యక్షుడు ఒబామా ఈ గది నుంచే పర్యవేక్షించారు. ఈ సంఘటనతో సిట్యుయేషన్ రూమ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.

2020లో ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్ బగ్దాదీని సిరియాలో అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌ను డొనాల్డ్ ట్రంప్ ఈ సిట్యుయేషన్ రూమ్ నుంచే గమనించారు. ఈ గది అధ్యక్షుడికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా పనిచేస్తుంది. ఇక్కడ అత్యంత రహస్య సమాచారం, సైనిక ఆపరేషన్లు, దౌత్య చర్చలు జరుగుతాయి. ఈ గదిలో సమాచారం సురక్షితంగా ఉండేలా అత్యాధునిక ఎన్‌క్రిప్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ట్రంప్ జీ7 సదస్సు నుంచి తిరిగి వాషింగ్టన్‌కు రావడం, సిట్యుయేషన్ రూమ్‌లో సమావేశం ఏర్పాటు చేయడం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై అమెరికా తీవ్ర దృష్టి సారించిందన్న సంకేతం పంపుతోంది.

ట్రంప్ జీ7 సదస్సు నుంచి తొందరగా వాషింగ్టన్‌కు బయల్దేరడం పశ్చిమాసియాలో కీలక పరిణామాలను సూచిస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఈ గదిలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో సమావేశం కావడం, అమెరికా ఈ సంఘర్షణలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకోవచ్చని సంకేతాలు ఇస్తోంది. ఈ గది గతంలో బిన్ లాడెన్, బగ్దాదీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్టే, ఇప్పుడు కూడా అమెరికా విదేశీ విధానంలో ముఖ్యమైన నిర్ణయాలకు వేదికగా నిలుస్తుంది. ఈ సంఘటనలు ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.