
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటున్నాయి. తాజాగా ఈ యుద్ధం మరింత వేడెక్కింది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో భీకరదాడులు చేసింది. రష్యాలోని నాలుగు ఎయిర్‌బేస్‌లపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులు ఎలా జరిగాయి? శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులను ఎలా చూడొచ్చు? ఉక్రెయిన్ ఏం చెబుతోంది? రష్యా ఎలా స్పందించింది?
ఒకరు తగ్గారంటే మరొకరు. ఉక్రెయిన్, రష్యా ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తే.. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేస్తోంది. మొన్నటి వరకు శాంతి చర్చలన్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఆదివారం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఈ దాడులు చేసింది. ఈ దాడులకు స్పైడర్‌వెబ్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్ నాలుగు రష్యన్ ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసింది. రియాజన్ ప్రాంతంలోని డయాగిలెవో ఎయిర్‌బేస్, ఇవానోవో ప్రాంతంలోని ఇవానోవో ఎయిర్‌బేస్, ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బెలాయా ఎయిర్‌బేస్, ముర్మాన్స్క్ ప్రాంతంలోని ఒలెన్యా ఎయిర్‌బేస్ పై ఉక్రెయిన్ అటాక్ చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. ఈ విమానాల్లో టు-95, టు-22, టు-160 వంటి హెవీ బాంబర్లు ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్‌పై మిసైల్ దాడులు చేయడానికి రష్యా ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఈ దాడుల్లో ఒక విమానం మంటల్లో చిక్కుకున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ డ్రోన్‌లను రష్యా లోపలి భాగంలోకి రహస్యంగా తీసుకెళ్లి, అక్కడ లాంచ్ చేసింది. ఈ దాడులు రష్యన్ వైమానిక స్థావరాలపై ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో అత్యంత భీకరమైనవని చెబుతున్నారు. దీని వల్ల రష్యాకు నష్టం 2 బిలియన్ డాలర్లు దాటినట్లు అంచనా. ఈ దాడుల కోసం ఉక్రెయిన్ 3,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కొత్త డ్రోన్‌లను ఉపయోగించి చేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్‌లను ఈ ఏడాదే ఉక్రెయిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది.
శాంతి చర్చలు ప్రస్తావనకు వచ్చిన సమయంలో ఈ దాడులను ఎలా చూడొచ్చు..? అయితే దాడులు జరిగిన కొన్ని గంటల ముందు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇస్తాంబుల్‌లో రష్యాతో శాంతి చర్చల కోసం ఒక బృందాన్ని పంపుతామని ప్రకటించారు. ఈ చర్చలు జూన్ 2 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, శాంతి చర్చలకు ముందు ఇలాంటి భారీ దాడులు చేయడం వెనుక ఉక్రెయిన్ వ్యూహం ఏమిటి అనే చర్చ నడుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది రష్యాపై ఒత్తిడి పెంచే వ్యూహంగా కనిపిస్తోంది. శాంతి చర్చల్లో బలమైన స్థానం సంపాదించడానికి, రష్యా సైనిక శక్తిని బలహీనపరిచే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
గతంలో కూడా ఇలాంటి శాంతి చర్చల సమయంలో రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి. మే 25 రష్యా-ఉక్రెయిన్ మధ్య 1000 మంది ఖైదీల మార్పిడి జరిగినప్పుడు, ఆ రోజు రాత్రి డ్రోన్‌లు, మిసైల్‌లతో ఉక్రెయిన్‌పై రష్యాభారీ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ఈ దాడులను ఒక ప్రతీకార చర్యగా, అదే సమయంలో శాంతి చర్చల్లో తమ బలాన్ని చూపించే మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ దాడులు శాంతి చర్చలను ఎలా ప్రభావితం చేస్తాయనే మాట వినిపిస్తోంది. కొందరు నిపుణులు, ఈ దాడుల వల్ల రష్యా ఆగ్రహానికి గురై, చర్చలు విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. మరికొందరు, ఈ దాడులు రష్యాకు తమ సైనిక బలహీనతను తెలియజేసి, చర్చల్లో రాజీకి ఒప్పుకునేలా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ దాడులు జరిగిన తర్వాత రష్యాలోని క్రెమ్లిన్‌లో ఒక అత్యవసర సమావేశం జరిగింది.
ఈ దాడులపై ఉక్రెయిన్ ఏం చెబుతోంది? ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ దాడులపై ప్రకటన విడుదల చేసింది. ఇది శత్రువు బాంబర్ విమానాలను నాశనం చేయడానికి చేసిన ఒక పెద్ద స్పెషల్ ఆపరేషన్ అని తెలిపింది. రష్యా లోపల అనేక ఎయిర్‌బేస్‌లలో 41 స్ట్రాటజిక్ బాంబర్లను నాశనం చేశాము. శత్రువు స్ట్రాటజిక్ బాంబర్లు రష్యాలో భారీగా దెబ్బతిన్నాయని SBU వెల్లడించింది. ఈ దాడులు రష్యా సైనిక శక్తిని బలహీనపరచడానికి, ముఖ్యంగా ఉక్రెయిన్‌పై దాడులు చేసే బాంబర్ విమానాలను నాశనం చేయడానికి ఉద్దేశించినవని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఇర్కుట్స్క్ ఒబ్లాస్ట్‌లోని బెలాయా ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి ఫుటేజ్‌ను కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది, ఇందులో డ్రోన్‌లు ఎయిర్‌బేస్‌పైకి దూసుకెళ్లి, పేలుళ్లతో దట్టమైన పొగలు ఆకాశంలోకి లేవడం కనిపిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాజీ ప్రెస్ సెక్రటరీ Xలో ఒక క్లిప్ షేర్ చేస్తూ, ఈ దాడులను పొగడ్తలతో ముంచెత్తారు. 40కి పైగా రష్యన్ విమానాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ దాడులు ఉక్రెయిన్ సుదూర దాడి సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని, రష్యా లోపల ఎంత దూరంలోనైనా దాడి చేయగలమని నిరూపించే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు. అయితే, ఈ దాడులు జరిగిన సమయంలో ఉక్రెయిన్‌లో కూడా రష్యన్ దాడులు జరిగాయి. ఒక రష్యన్ మిసైల్ దాడిలో ఉక్రెయిన్ కు చెందిన 12 మంది సైనికులు మరణించారు, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి ఒక ట్రైనింగ్ సెంటర్‌పై జరిగింది, అయితే ఈ సెంటర్ ఎక్కడ ఉందో, ఏ రకమైన మిసైల్ ఉపయోగించారో వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ఈ దాడులను రష్యాకు ఒక హెచ్చరికగా, తమ సైనిక సామర్థ్యాన్ని చూపించే మార్గంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ దాడులపై రష్యా ఎలా స్పందించింది? రష్యా నుంచి అధికారిక స్పందన ఇంకా స్పష్టంగా రాలేదు, కానీ కొన్ని ప్రాథమిక నివేదికలు ఉన్నాయి. ముర్మాన్స్క్ ఒబ్లాస్ట్ గవర్నర్ ఒక ప్రకటనలో ముర్మాన్స్క్ ప్రాంతంలో శత్రు డ్రోన్‌లు దాడి చేశాయి అని ధృవీకరించారు. రష్యన్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ RT నివేదిక ప్రకారం, ఇర్కుట్స్క్ ప్రాంతంలోని ఒక సైనిక స్థావరంపై అనేక డ్రోన్‌లు దాడి చేశాయి. ఈ దాడుల తర్వాత క్రెమ్లిన్‌లో ఒక అత్యవసర సమావేశం జరిగినట్లు రష్యన్ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
అయితే, ఈ దాడుల్లో జరిగిన నష్టం గురించి ధృవీకరించ లేదు. ఉక్రెయిన్ 41 విమానాలు దెబ్బతిన్నాయని చెప్పినప్పటికీ, రష్యా ఈ సంఖ్యను ధృవీకరించలేదు. గతంలో ఇలాంటి దాడుల సమయంలో రష్యా తమకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపించడం లేదా పూర్తిగా దాచడం చేసింది. మే నెలలో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో రష్యా 110 డ్రోన్‌లను కూల్చినట్లు చెప్పినప్పటికీ, తమ వైపు జరిగిన నష్టం గురించి వివరాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, రష్యా ఈ దాడులను తేలిగ్గా తీసుకోలేదని, దీనిపై తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా గతంలో ఇలాంటి దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై భారీ దాడులు చేసింది. మే 26 న రష్యా 355 డ్రోన్‌లు, 9 క్రూయిజ్ మిసైల్‌లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది, దీనిలో 12 మంది మరణించారు. ఈ నేపథ్యంలో, ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇది యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.