నార్త్ కొరియాలో యుద్ధనౌకకు ప్రమాదం.. అధికారులకు మరణశిక్ష విధించిన కిమ్.!!

ఉత్తర కొరియాలో ఏం జరిగినా అంతా రహస్యమే. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్న ఏం చేసిన విచిత్రమే. అక్కడ చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు. అలాంటిది పెద్ద తప్పుచేస్తే ఇక ఏమైనా ఉందా..? తాజాగా పొరపాటున జరిగిన ఓ తప్పునకు కిమ్ .. పెద్ద శిక్షే విధించాడు.. ఇంతకీ వారు చేసిన తప్పు ఏంటి..? కిమ్ విధించిన శిక్ష ఏంటి..? గతంలో కిమ్ వేసిన శిక్షలు ఏంటి..? అసలు ఉత్తర కొరియాలో ఎందుకు అన్ని సీక్రెట్ గా ఉంచుతారు.? ఆ దేశంలో ఏంఏం నిషేధం?

నార్త్ కొరియా తయారు చేసిన కొత్త 5,000 టన్నుల బరువు గల యుద్ధనౌకను చాంగ్జిన్ ఓడరేవులో ప్రారంభించే కార్యక్రమంలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. రష్యన్ సహాయంతో తయారుచేసిన ఈ యుద్ధనౌక, దాని ప్రారంభోత్సవం సమయంలో నీటిలోకి దిగుతూ పక్కకు పడిపోయింది. దీనివల్ల నౌకకు తీవ్ర నష్టం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడే ఉన్నాడు. ఈ ఘటన దేశ సైనిక గౌరవానికి తీరని అవమానంగా కిమ్ భావించారు. ఈ వైఫల్యం నార్త్ కొరియా నౌకాదళ సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదాన్ని నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంగా కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నారు. కిమ్‌ జోంగ్ ఉన్‌ కర్కశత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత. తాజా ప్రమాదంపై కిమ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. అధికారుల నిర్లక్ష్యం బాధ్యతారాహిత్య చర్య వల్లే ఇలా జరిగిందని.. ఇందుకు శిక్షగా నౌకను రూపొందించిన వారిపై, అధికారులపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధిస్తామని ప్రకటించారు. జూన్‌లో తమ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరగనుందని.. అప్పటిలోపు నౌకను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ యుద్ధ నౌకను వచ్చే ఏడాది ప్రారంభంలో నావికా దళంలో మోహరించాలని భావిస్తున్నట్లు కిమ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఉత్తర కొరియాలో ప్రయోగాలు వరుసగా జరగడం కిమ్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. 2023 ఆగస్టులో అత్యవసర బేస్టింగ్ వ్యవస్థలోని లోపం కారణంగా ఓ ఉపగ్రహ ప్రయోగం విఫలమయ్యింది. గతేడాది నవంబర్‌లోనూ.. ఉత్తర కొరియా సైనిక ఉపగ్రహం గాలిలో పేలిపోయింది. తాజాగా యుద్ధనౌక ప్రమాదం కిమ్ ను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఖచ్చితమైన శిక్షల వివరాలు బహిరంగంగా వెల్లడి కాలేదు. అయితే , కిమ్ జాంగ్ ఉన్ గతంలో తప్పులు చేసిన అధికారులపై కఠిన చర్యలకు పేరుగాంచినవాడు కాబట్టి, ఈ సందర్భంలో కూడా తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. దీనిలో ఉన్నత స్థాయి సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రాజెక్ట్‌లో పనిచేసిన సాంకేతిక నిపుణులు శిక్షలను ఎదుర్కొనవచ్చు. అయితే కిమ్ ఈ ఘటనకు సంబంధించి తీవ్రమైన శిక్షలు విధించేందుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ గతంలో సైనిక, రాజకీయ, సాంకేతిక వైఫల్యాలకు సంబంధించిన తప్పులకు కఠిన శిక్షలు విధించిన చరిత్ర ఉంది. 2013లో ఆయన మామ జాంగ్ సాంగ్-థాయెక్‌ను దేశద్రోహం ఆరోపణలపై ఉరితీశాడు. 2015లో, ఒక సైనిక ప్రాజెక్ట్ వైఫల్యం కారణంగా కొందరు అధికారులను బహిరంగంగా ఉరితీసినట్లు సామాచారం. 2016లో, క్షిపణి పరీక్షల వైఫల్యాలకు సంబంధించి శాస్త్రవేత్తలు, సైనిక అధికారులపై కఠిన శిక్షలు విధించినట్లు తెలిసింది. ముఖ్యంగా జైలు శిక్షలు, బహిష్కరణలు, కొన్ని సందర్భాల్లో మరణశిక్షలు కిమ్ విధిస్తుంటాడు. ఈ శిక్షలు నార్త్ కొరియా రహస్య స్వభావం కారణంగా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, అంతర్జాతీయ మీడియా ద్వారా బయటకు తెలుస్తుంటాయి.

నార్త్ కొరియాలో ఎందుకు అంతా రహస్యంగా ఉంచుతారు?
ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధాన కారణాలు కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని సర్వాధికార పాలన, ఆ దేశ దేశం రాజకీయ, సామాజిక విధానాలు. నార్త్ కొరియా ప్రభుత్వం సమాచార వివరాలను కఠినంగా నియంత్రిస్తుంది. ఇంటర్నెట్, స్వతంత్ర మీడియా, విదేశీ వార్తా సంస్థలు ప్రజలకు అందుబాటు లేవు. దేశంలోని అన్ని వార్తలు రాష్ట్ర నియంత్రణలోని KCNA ద్వారా మాత్రమే వస్తాయి. ఈ నియంత్రణ వల్ల ప్రజలకు బయటి ప్రపంచం గురించి తెలియదు, దేశంలో జరిగే విషయాలు బయటకు రాకుండా ఉంటాయి. కిమ్ జాంగ్ ఉన్ అతని పూర్వీకులైన కిమ్ జాంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్‌ల నాయకత్వంలో, దేశం ఒక సర్వాధికార వ్యవస్థను అనుసరిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలు అసమ్మతిని అణచివేయడానికి, సమాచారం బయటకు రాకుండా చేస్తారు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, నిషేధిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తే, వారికి కఠిన శిక్షలు, మరణశిక్ష కూడా విధించవచ్చు. బయటి ప్రపంచంతో ఒంటరితనం: నార్త్ కొరియా తనను తాను బయటి ప్రపంచం నుంచి వేరు చేసుకుంది. విదేశీ సంస్కృతి, సాంకేతికత, లేదా జీవనశైలిని “పాశ్చాత్య విలాసం”గా భావిస్తుంది. ఈ ఒంటరితనం వల్ల దేశంలో జరిగే విషయాలు బయటకు రావు, మరియు బయటి సమాచారం లోపలికి రాదు. నార్త్ కొరియా ప్రభుత్వం తన పాలనను సమర్థించడానికి, కిమ్ ను దేవుడిలా చూపించడానికి భారీగా ప్రచారం చేస్తుంది. దీని కోసం, దేశంలోని వాస్తవ పరిస్థితులను దాచిపెడతారు, కేవలం ప్రభుత్వం చెప్పిన సమాచారం మాత్రమే ప్రజలకు అందుతుంది.

నార్త్ కొరియాలో ఇంటర్నెట్ దాదాపు అందరికీ అందుబాటులో ఉండదు. కొద్దిమంది ఉన్నతాధికారులకు మాత్రమే పరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, అది కూడా ప్రభుత్వం గట్టిగా పర్యవేక్షిస్తుంది. నార్త్ కొరియా సరిహద్దులు కఠినంగా పర్యవేక్షించబడతాయి. ఎవరైనా దేశం నుంచి బయటకు వెళ్లడం లేదా లోపలికి రావడం చాలా కష్టం. దీని వల్ల దేశంలోని వాస్తవ పరిస్థితులు బయటకు రావు. ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా దేశంలోని సమస్యలను బహిర్గతం చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలకు మరణశిక్ష లేదా జైలు శిక్ష విధించబడుతుంది. 2007లో ఒక ఫ్యాక్టరీ బాస్ అనధికారికంగా అంతర్జాతీయ కాల్స్ చేసినందుకు అందరి ముందు ఉరితీయబడ్డాడు. రూమ్ 39 వంటి రహస్య సంస్థలు దేశ ఆర్థిక, సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ఈ సంస్థలు డబ్బు ఆర్జన కోసం చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటాయని నమ్ముతారు.

నార్త్ కొరియాలో పెంపుడు కుక్కలను పెంచడం సోషలిస్ట్ జీవనశైలికి విరుద్ధం అని అంటారు. 2020లో, కిమ్ జాంగ్ ఉన్ పెంపుడు కుక్కలను పట్టుకోవాలి.. వాటిని మాంసం, బొచ్చు కోసం ఉపయోగించాలని ఆదేశించాడు. ముఖ్యంగా పోమెరేనియన్, షిహ్ ట్జు వంటి విదేశీ జాతి కుక్కలను చంపేశారు. కుక్కలను ఇంట్లో ఉంచడం, వాటికి బట్టలు వేయడం, చనిపోయినప్పుడు ఖననం చేయడం వంటివి కూడా నార్త్ కొరియాలో నిషేధించబడ్డాయి. కుక్కలను మాంసం లేదా బొచ్చు కోసం మాత్రమే పెంచాలని సోషలిస్ట్ విమెన్స్ యూనియన్ ఆఫ్ కొరియా ఆదేశించింది. విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ ఛానెళ్లను చూడటం, వినడం నిషేధం. ఇలా చేస్తే జైలు శిక్ష, మరణశిక్ష విధిస్తారు. 2014లో ఒక అమెరికన్ పర్యాటకుడు బైబిల్‌ను రెస్టారెంట్‌లో మర్చిపోయినందుకు ఐదు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.
నార్త కొరియాలో సాధారణ ప్రజలు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించడం నిషేధం. కొందరు ఉన్నతాధికారులకు మాత్రమే పరిమిత యాక్సెస్ ఉంటుంది. ఒక విదేశాలకు ఫోన్ కాల్స్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. 2007లో ఒక వ్యక్తి ఇలా ఫోన్ చేస్తే మరణశిక్ష వేశారు. ఇక ప్రభుత్వం ఆమోదించిన 28 రకాల హెయిర్‌కట్స్ మాత్రమే అనుమతించబడతాయి. కిమ్ జాంగ్ ఉన్ హెయిర్‌స్టైల్‌ను ఎవరూ అనుకరించకూడదు. రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో నివసించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. దేశంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లడానికి కూడా అనుమతి తప్పనిసరి. నార్త్ కొరియాలో జరిగే అనేక విషయాలు రహస్యంగా ఉంటాయి, అయితే దేశం నుంచి పారిపోయినవారు, అంతర్జాతీయ సంస్థలు, కొన్ని రహస్య నివేదికల ద్వారా కొంత సమాచారం బయటకు వస్తుంది.