
పశ్చిమాసియా దేశాల పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘనమైన స్వాగతం లభించింది. అయితే అంతకంటే విమర్శలే ఎక్కువ వస్తున్నాయి. పశ్చిమాసియాలో ట్రంప్ పర్యటిస్తే తప్పేంటి అనుకోవచ్చు. అయితే ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటోంది పర్యటన గురించి కాదు.. ఒక విమానం గురించి.. ట్రంప్ కు ఖతార్ రాజ కుటంబం విమానం గిఫ్ట్ వ్యవహారం.. ఇప్పుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఇది లంచమే అని అమెరికాలోని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా.. కాస్ట్లీ గిఫ్ట్ తీసుకుంటే తప్పేంటని ట్రంప్ అంటున్నారు. ఇంతకీ ఈ విమానం స్పెషల్ ఏంటి..? దీనిని ట్రంప్ ఏం చేయాలని అనుకుంటున్నారు..? ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గిఫ్ట్ అని ఎందుకు అంటున్నారు..?
ట్రంప్ విమానం గిఫ్ట్ వ్యవహారం అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఇదే మొదటి విదేశీ పర్యటన. ఇప్పుడు ఈ పర్యటనే వివాదాలకు కారణమైంది. పశ్చిమ ఆసియా పర్యటనలో భాగంగా మొదట సౌదీ అరేబియాలో మొదట ట్రంప్ కాలుపెట్టారు. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నాలుగు రోజుల పర్యటన ప్లాన్ చేశారు. రియాద్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమైన ట్రంప్, ఇరు దేశాల మధ్య స్నేహాన్ని, సౌదీ పెట్టుబడుల ద్వారా అమెరికాలో ఉద్యోగాల సృష్టిని ప్రశంసించారు. ఆయిల్, పశ్చిమ ఆసియా దేశాలతో వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులను పెంచడం, దీర్ఘకాల స్ట్రాటజిక్ సంబంధాలను బలోపేతం చేయడమే ట్రంప్ పర్యటన లక్ష్యంగా చెబుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక, ఆర్థిక సహకారం అమెరికా, పశ్చిమ ఆసియా సంబంధాలు బలంగా ఉండటానికి కారణంగా చెప్పొచ్చు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు అమెరికాకు ఎప్పటి నుంచో మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇవి భద్రత, వాణిజ్యం, ఇంధన రంగాలలో అమెరికాతో సన్నిహితంగా పనిచేస్తాయి. ట్రంప్ 2017లో సౌదీ అరేబియా సందర్శన సమయంలో కుదిరిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు, ఖతార్‌తో దౌత్య సంబంధాలు ఈ దేశాలతో అమెరికా సంబంధాలను బలపరిచాయి. అంతే ఈ బంధాలు భారీ గిఫ్టులు ఇచ్చే వరకు వచ్చాయి. ఈ పర్యటన ద్వారా ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తూ, పశ్చిమ ఆసియా దేశాలతో ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారని అధికారికంగా చెబుతున్నారు. కాని ట్రంప్ వ్యాపర ప్రయోజనాల కూడా దీని వెనుక ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే గిఫ్ట్ కూడా వస్తుందని ఆరోపిస్తున్నారు.
ఖతార్ రాజ కుటుంబం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా ఆఫర్ చేసింది. దీనిని తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించి, ట్రంప్ పదవీ కాలం ముగిసిన తర్వాత ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్‌కు బదిలీ చేయనున్నారు. ఈ విమానాన్ని ఫ్లయింగ్ ప్యాలెస్ అని పిలుస్తారు. 400 మిలియన్ డాలర్ల విలువైనది, లగ్జరీ ఇంటీరియర్, విశాలమైన బాత్‌రూమ్‌లు, ప్రైవేట్ బెడ్‌రూమ్‌లు, గ్రాండ్ స్టెయిర్‌కేస్ ఈ విమానం ప్రత్యేకతలు. ఈ విమానం గతంలో ఖతార్ రాజ కుటుంబం, తర్వాత టర్కీ ప్రభుత్వం ఉపయోగించింది. ఇప్పుడు ట్రంప్ కు దీనిని ఆఫర్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విదేశీ ప్రభుత్వాల నుంచి బహుమతులను అంగీకరించడానికి కాంగ్రెస్ అనుమతి అవసరమని చెబుతున్నారు. ట్రంప్ వ్యాపార ఒప్పందాలు, ముఖ్యంగా ఖతార్‌లో ట్రంప్ ఆర్గనైజేషన్ 5.5 బిలియన్ డాలర్ల గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్ట్ కారణంగా ఈ గిఫ్ట్ ఆఫర్ చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రిపబ్లికన్లు కూడా ఈ బహుమతి అమెరికా ఫస్ట్ విధానానికి వ్యతిరేకమని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. ఈ విమానం తనకు వ్యక్తిగత బహుమతి కాదని, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వబడుతుందని, ఇది పారదర్శకమైన ఒప్పందమని చెప్పారు. 400 మిలియన్ డాలర్ల విమానాన్ని ఉచితంగా తిరస్కరించడం మూర్ఖత్వం అని ట్రంప్ తెలిపారు. ఖతార్ ఈ బహుమతిని అమెరికా భద్రతకు మద్దతుగా ఇస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు రెండు బోయింగ్ 747-200B విమానాలను ఎయిర్ ఫోర్స్ వన్ లుగా ఉపయోగిస్తున్నారు. 1990, 1991 నుంచి ఇవి సేవలందిస్తున్నాయి. ఈ విమానాలను అధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్ ఫోర్స్ వన్ అనే ఆపరేషనల్ కోడ్‌తో పిలుస్తారు. ఈ విమానాలు అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్టేట్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, ఆన్‌బోర్డ్ ఆపరేటింగ్ రూమ్, యాంటీ-మిసైల్ కౌంటర్‌మెజర్స్, రేడియేషన్ షీల్డింగ్ వంటి భద్రతా ఫీచర్లతో ఉంటాయి. గాలిలో ఇంధనం నింపే సామర్థ్యం ఈ విమానాలకు ఉంది. దీని వల్ల ఎక్కువ సేపు గాలిలో ఉండగలవు. ఈ రెండు విమానాలను కోల్డ్ వార్ ముగిసే సమయంలో.. అణు దాడుల నుంచి రక్షణ కల్పించేలా డిజైన్ చేశారు. ఈ విమానాలు దాదాపు 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్నాయి. అంటే చాలా పాతవని అర్థం. అందుకే నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పదేపదే ఫిర్యాదు చేశారు. 2018లో ట్రంప్ మొదటి పదవీకాలంలో బోయింగ్‌తో రెండు కొత్త 747-8 విమానాలను తయారు చేయడానికి 3.9 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది, కానీ ఈ విమానాలు 2029 వరకు సిద్ధం కావు. పాత విమానాల నిర్వహణ ఖర్చులు, వాటి వయస్సు కారణంగా కొత్త విమానాలు తీసుకురావడం అవసరమని అమెరికా వైమానిక దళం భావిస్తోంది. కొత్త విమానాలు సిద్ధమయ్యే వరకు ఖతార్ గిఫ్ట్ విమానాన్ని ఉపయోగించాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఖతార్ గిఫ్ట్ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా మార్చడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విమానం లగ్జరీ ఫీచర్లతో ఉన్నప్పటికీ, ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించడానికి అమెరికా వైమానిక దళానికి సూచించే కఠినమైన భద్రతా, సైనిక ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి. ఇందుకు యాంటీ-మిసైల్ కౌంటర్‌మెజర్స్, రేడియేషన్ షీల్డింగ్, అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆన్‌బోర్డ్ ఆపరేటింగ్ రూమ్ వంటి ఫీచర్లను జోడించాలి. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న గాలిలో ఇంధనం నింపే సామర్థ్యం ఈ ఖతార్ విమానంలో లేదు. దీనిని జోడించడం సాంకేతికంగా సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పని. ఈ విమానంలో మార్పులు చేయడానికి ఓ డిఫెన్స్ కాంట్రాక్టర్ ను నియమించారు. కానీ ఈ మార్పులు పూర్తి కావడానికి సమయం, భారీ ఖర్చు అవుతుంది. మరోవైపు ఓ విదేశీ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి కోసం ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు రావొచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ విమానాన్ని బహుమతిగా స్వీకరించి, 2029 జనవరి 1 నాటికి ట్రంప్ లైబ్రరీ ఫౌండేషన్‌కు బదిలీ చేయడం చట్టపరంగా సాధ్యమని ట్రంప్ టీమ్ చెబుతోంది. అయితే, ఈ మార్పులు త్వరగా పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్‌లు సైనిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే గిఫ్ట్ గా వచ్చిన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా మార్చడం సాధ్యమైనప్పటికీ, సమయం, ఖర్చు, భద్రతా సమస్యలు ఇబ్బందిగా మారాయి.