
హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కోల్డ్ వారు కొనసాగుతోంది. హార్వర్డ్ కు ట్రంప్ వరుస షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఓ పక్క నిధుల్లో కోతలు విధిస్తూనే.. అనేక ఆంక్షలు పెడడుతున్నారు. ఇంతకీ ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నారు? హార్వర్డ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కుమార్తె రహస్యంగా చదువుకుందని ఎలా తెలిసింది? ట్రంప్ ఆగ్రహానికి ఇదే కారణామా..? అందుకే విదేశీ విద్యార్థులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారా..? హార్వర్డ్ లో అమెరికా శత్రుదేశాల విద్యార్థులు ఏం చేస్తున్నారు..?
హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తాను పెట్టిన రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు. లేకపోతే ఒక్క పెన్నీ కూడా ఇచ్చేది లేదని చెబుతున్నారు. హార్వర్డ్ అనేది అమెరికాలో అతి పాత, అతి ధనిక విశ్వవిద్యాలయం. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హార్వర్డ్‌ను టార్గెట్ చేస్తున్నారు. హార్వర్డ్ విద్యార్థులు అమెరికా వ్యతిరేక, యూదు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇంకా, హార్వర్డ్‌కు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ కారణాల వల్ల హార్వర్డ్‌పై చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంపై ట్రంప్ ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. దీని వల్ల ఇప్పటికే చదువుతున్న 6,800 మంది విదేశీ విద్యార్థులు ఇతర యూనివర్సిటీలకు మారాలి, లేదా అమెరికాను వదిలి వెళ్లాలి. ఈ నిర్ణయం హార్వర్డ్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బ కొడుతోంది. హార్వర్డ్‌కు ఏటా 591 మిలియన్ డాలర్ల ఆదాయం విదేశీ విద్యార్థుల నుంచే వస్తుంది. ఈ నిషేధం వల్ల ఆ ఆదాయం ఆగిపోతుంది. ఇంకా, ట్రంప్ 2025 ఏప్రిల్ నుంచి హార్వర్డ్‌పై ఒత్తిడి పెంచారు. 2.3 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను ఆపేశారు. 2.7 మిలియన్ డాలర్ల గ్రాంట్‌లను రద్దు చేశారు. ఈ చర్యలు హార్వర్డ్‌కు ఆర్థికంగా భారీ నష్టం కలిగిస్తున్నాయి.

విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నారు? హార్వర్డ్‌లో చదివే విదేశీ విద్యార్థులు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్‌లో 27% మంది విదేశీయులు విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో చైనా, భారత్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి వచ్చినవాళ్లు ఎక్కువ. ఈ విద్యార్థులకు చెందిన కొన్ని దేశాలు అమెరికాకు స్నేహపూర్వకంగా లేవు, వాళ్లు ఇక్కడ చదువుకోవడానికి డబ్బు కూడా చెల్లించరని ట్రంప్ అంటున్నారు. హార్వర్డ్ విద్యార్థులు కొందరు పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేస్తూ యూదు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించారు. హార్వర్డ్‌కు ఇచ్చిన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం సర్టిఫికేషన్‌ను ఇటీవల అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. దీని వల్ల హార్వర్డ్ కొత్త విదేశీ విద్యార్థులను చేర్చుకోలేదు. ఇప్పటికే ఉన్న విద్యార్థులు 2025-26 నుంచి ఇతర యూనివర్సిటీలకు మారాలి. అలాగే విదేశీ విద్యార్థుల సమాచారం, గత 5 ఏళ్లలో వాళ్లు చేసిన నిరసనలు, హింసాత్మక చర్యల ఆడియో, వీడియో రికార్డులు 72 గంటల్లో ఇవ్వాలి అని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకపోతే, నిషేధం శాశ్వతం అవుతుందని హెచ్చరించారు.

ట్రంప్ ఎందుకు విదేశీ విద్యార్థుల పేర్లు అడుగుతున్నారు? హార్వర్డ్‌కు తాము బిలియన్ల డాలర్లు ఇస్తున్నామని… అందుకే విద్యార్థులు ఎవరు, ఏ దేశాల నుంచి వచ్చారో తమకు తెలియాలి అని ట్రంప్ అంటున్నారు. విద్యార్థుల్లో కొందరు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారు. పేర్లు ఇవ్వకపోతే, హార్వర్డ్‌కు ఇచ్చే ఫండింగ్‌ను ఆపేస్తామని, టాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్‌ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 3.2 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ను ఆపేశారు. మిగిలిన 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌లను కూడా రద్దు చేసేందుకు మే 27న ఫెడరల్ ఏజెన్సీలకు లేఖ పంపారు. అటు హార్వర్డ్‌లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రొ-పాలస్తీనా నిరసనలను అణచివేయమని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌లను హార్వర్డ్ తిరస్కరించడంతో, విదేశీ విద్యార్థుల చేరికపై నిషేధం విధించారు.
ట్రంప్.. హార్వర్డ్ మధ్యలో.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కుమార్తె ఎలా వచ్చింది..? జీ జిన్‌పింగ్ కుమార్తె జీ మింగ్‌జే 2010 నుంచి 2014 వరకు హార్వర్డ్‌లో చదివింది. ఆమె సైకాలజీ, ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సింథియా జీ అనే ఫేక్ పేరుతో చదివిన ఆమె, అమెరికాలో రహస్య జీవితం గడిపిందని చెబుతున్నారు. 2015లో ఈ విషయం చైనా, అమెరికా మీడియా ద్వారా బయటకు వచ్చింది. అమెరికా రాజకీయ కార్యకర్త లారా లూమర్, జీ మింగ్‌జే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అజెండాను ప్రచారం చేసేందుకు హార్వర్డ్‌ను వాడుకుందని వ్యాఖ్యానించారు. 2024-25లో హార్వర్డ్‌లో చదివే విదేశీ విద్యార్థుల్లో 20% మంది చైనా నుంచి వచ్చినవాళ్లు. ఈ విషయం ట్రంప్ ఆరోపణలకు బలం చేకూర్చినట్లు కనిపిస్తోంది. జీ మింగ్‌జే విషయం ట్రంప్ ఆగ్రహానికి కారణమా? ఖచ్చితంగా అవునని చెప్పలేం, కానీ ఇది ఒక కారణం కావచ్చని అనుకోవచ్చు. హార్వర్డ్‌పై చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జీ మింగ్‌జే హార్వర్డ్‌లో చదివిన విషయం ట్రంప్ ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. అయితే తమ శత్రుదేశాలకు చెందిన విద్యార్థులు ఇంకా హార్వర్డ్ లో చదువుకుంటున్నారని ట్రంప్ భావిస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కూడా అంటున్నారు. అందుకే వీదేశీ విద్యార్థుల వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు ట్రంప్.

హార్వర్డ్‌కు ఫండింగ్ ఆపితే ఏం జరుగుతుంది? ఫెడరల్ ఫండింగ్ ఆగితే, హార్వర్డ్‌లో పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు, ప్రయోగాలు తగ్గిపోతాయి. హార్వర్డ్ దీన్ని అకడమిక్ స్వాతంత్ర్యంపై దాడి అని, చట్టవిరుద్ధమని చెబుతోంది. ట్రంప్ నిర్ణయాలను హార్వర్డ్ చట్టపరంగా కోర్టులో సవాల్ చేసింది. ఒక ఫెడరల్ జడ్జి, ఈ నిషేధాన్ని తాత్కాలికంగా ఆపమని ఆదేశించారు. ఈ వివాదం హార్వర్డ్ ఆర్థిక పరిస్థితిపై, అమెరికాలోని విదేశీ విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపవచ్చు. హార్వర్డ్‌కు ఏటా 591 మిలియన్ డాలర్ల ఆదాయం విదేశీ విద్యార్థుల నుంచి వస్తుంది.