
చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రధాన అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే ఒకపట్టాన తగ్గదు. ఈ దీర్ఘకాలిక వ్యాధి నయం అయ్యేందుకు తినే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే ఈ డయాబెటిస్ స్ట్రోక్, గుండెపోటువంటి ఇతర అనారోగ్యాలతో ఇంటర్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.
ప్రీ డయాబెటిస్ వస్తే ఈ లక్షణాలు ఉండొచ్చు.
- తరచుగా దాహం లేదా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లాంటి లక్షణాలు ఉంటే మీకు ప్రీ డయాబెటిస్ ప్రారంభమైనట్లు అనుమానించాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఇందుకోసం శరీరం అదనపు గ్లూకోజ్ ను మూత్రం ద్వారా తొలగిస్తుంది. కాబట్టి తరచుగా దాహం వేయడం లేదా యూరిన్ చేయాల్సి వస్తుంది.
- శరీర కణాలకు గ్లూకోజ్ సరిగ్గా చేరకపోవడం వల్ల కళ్లు తిరిగినట్లు అనిపించడం, అలసట, బలహీనత వస్తాయి. వెంటనే షుగర్ టెస్టు చేయించుకోవాలి. ప్రీడయాబెటిస్ దశలోనే కేర్ తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది.
- సడెన్ గా బరువు తగ్గితే డౌట్ పడాల్సిందే. శరీరం గ్లూకోజ్ ను శక్తిగా కన్వర్ట్ చేయలేనప్పుడు.. ఒంట్లో ఉన్న కొవ్వును కండరాలను విచ్చిన్నం చేస్తుంది. దీనివల్ల అనుకోకుండా బరువు తగ్గుతారు.
- మన శరీరం తగిన శక్తిని పొందలేనప్పుడు ఆకలి వేస్తుంది. అయితే తరచుగా అధిక ఆకలి వేస్తుంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే మీ శరీరం గ్లూకోజ్ ను శక్తిగా ఉపయోగించలేదు. అలాంటప్పుడు డయాబెటిస్ డెవలప్ అవుతున్నదనర్ధం.
- దీంతోపాటు తరచుగా చర్మం పొడిబారడం, దురద లేదా గాయాలు అయినప్పుడు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసకబారడం వంటివి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతుంటాయి. అంటే అది డయాబెటిస్ కావచ్చు.
- యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా వస్తుంటే డయాబెటిస్ లక్షణాలుగా అనుమానించాలి.
- కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా డయాబెటిస్ డెవలప్ అయి ఉండొచ్చు. కాబట్టి వయసును బట్టి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు తరచుగా వ్యాయామాలు చేయడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.