వాము.. నెలసరి సమస్యలకు దివ్యౌషధం..!

ఒకప్పుడు మన పెద్దలు వామును ఒక ఔషధంగా రెగ్యులర్ గా వినియోగించేవారు. వాము పొడి, వాము నీరు, వాము, బెల్లంతో కలిపి చేసిన చూర్ణం ఇలా రకరకాలుగా వామును ఉపయోగించేవారు. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ విరివిగా ఉపయోగపడే వాము వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

  • వాము.. అజీర్ణానికి గొప్ప ఔషధం.

మూత్రకోశ వ్యాధులకు ముఖ్యంగా స్త్రీలలో వచ్చే యూరినరీ ట్రాక్ సమస్యలకు ఇది మంచి ఔషధంలా పని చేస్తుంది. అందువల్ల రెగ్యులర్ గా భాగం చేసుకోవడం బెటర్.

వామును దోరగా వేయించి అందులో కొంచెం సైంధవ లవణం వేసి వారానికోసారైనా పిల్లలకు అన్నంలో నెయ్యి వేసి మొదటి ముద్దగా తినిపిస్తే వారి జీర్ణశక్తి మెరుగవుతుంది. విరేచనాలు అయినప్పుడు వాము కషాయం తాగితే చాలు రిలీఫ్ గా ఉంటుంది.

నెలసరి సమయంలో వాము కషాయం తాగడం వల్ల రుతుక్రమం సరిగా వస్తుంది. నెలసరి దోషాల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుంది. చంటి పిల్లల్లో అజీర్ణం, విరేచనాల సమస్య ఎక్కువగా ఉంటే చెంచా వామునీరును కలిపి ఇస్తే కడుపు చల్లబడుతుంది.

వాము పొడిని మూడు చిటికెల చొప్పున తీసుకొని, బెల్లంతో కలిపి కుంకుడుకాయ అంత పరిమాణంలో రోజుకు మూడు పూటల తీసుకుంటూ ఉంటే చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి.

దదుర్లు, దురద లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రక్తంలో పెరిగిన చెడుకొవ్వులు ట్రై గ్లిజరైడ్ లను తరిమేందుకు రోజుకు రెండు పూటల భోజనానికి ముందు గోరువెచ్చని నీటితో వామును సేవిస్తే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అంతేకాక గుండెకు, మూత్ర పిండాల పనితీరును బెటర్ చేస్తుంది.

కడుపునొప్పి నివారణకు జీర్ణశక్తి పెంచేందుకు వామును మిరియాలు, సైంధవ లవణంతో కలిపి పావు చెంచాడు గోరువెచ్చని నీటితో పరగడపున తీసుకుంటే మంచిది. వాముకు విరుగుడు కొత్తిమీర రసం. వేడి శరీరం ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడదు.