భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా..?!

ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడైనా టిఫిన్ లేదా భోజనం చేశాక టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీలు తీసుకోవడం అనేది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిదనే సందేహం ఉంటుంది. అయితే ఇలా భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయనే విషయంపై ఆహార నిపుణులు, వైద్యులు ఏం చెబుతున్నారంటే..

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్, టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి లేదా కడుపులో గ్యాస్ ఈజీగా ఫామ్ అవుతుంది. పైగా తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు.

ఈ అలవాటు అదే పనిగా ఉంటే గనుక శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసటగా అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను గ్రహించకుండా చేస్తుంది. ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు సైతం దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటినొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర కూడా పట్టదు. అటువంటప్పుడు టీ తగడాన్ని తగ్గించడం మేలు!