
Cold Side Effects: సీజన్ తో సంబంధం లేకుండా.. తరచుగా జలుబు చేస్తోందా.. అయితే అది మీ శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. జలుబు ఎందుకు పదే పదే వస్తుంది? దీనికి గల కారణాలేంటి? ఏ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండవచ్చు? నివారణ వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తరచుగా జలుబు రావడం ఒక సాధారణ సమస్య అనుకుంటాం. దుమ్ము, ధూళితో కూడిన పొల్యూషన్ వల్ల, చల్లటి ద్రవపదార్థాలు తీసుకున్నప్పుడు, వర్షంలో ఎక్కువగా తడిసినప్పుడు.. ఇలా రకరకాల కారణాల వల్ల జలుబు అనేది చేస్తుంది. ఇలా వాతావరణం మారినప్పుడు జలుబు రావడం సాధారణమే, కానీ పదే పదే జలుబు రావడం, ముక్కు కారడం, గొంతు నొప్పిగా ఉండటం లేదంటే తుమ్ములు ఆగకపోతే, అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని గ్రహించాలి. Cold Side Effects.
- పదే పదే జలుబు రావడానికి అత్యంత సాధారణ కారణం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితే అది శరీరంలో వచ్చే వైరస్, బ్యాక్టీరియాతో పోరాడలేకపోవచ్చు. ఇది తరచుగా జలుబుకు దారితీస్తుంది. సరైన ఆహారం, నిద్ర లేకపోవడం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు.
- చాలామందికి దుమ్ము, పొగ, పెంపుడు జంతువుల వెంట్రుకలు లేదా కొన్ని ఆహారపదార్థాల వల్ల అలెర్జీ ఉంటుంది. అలెర్జీలు కూడా తరచుగా జలుబు లక్షణాలను కలిగిస్తాయి.
- సైనస్ ఇన్ఫెక్షన్.. దీనినే సైనసైటిస్ అని కూడా అంటారు. ఇది మీ ముక్కు చుట్టూ ఉన్న సైనస్‌లలో వాపు లేదా ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఇది సాధారణంగా జలుబు లేదా అలెర్జీల వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి, జ్వరం వంటివి లక్షణాలు. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది నయమవుతుంది.
- మీకు తరచుగా జలుబుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంటే మటుకు అది ఆస్తమా కావచ్చు. చాలాసార్లు దీనిని కామన్ జలుబుగా భావిస్తారు. కానీ చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
- జలుబు వచ్చిన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ తీసుకునే అలవాటు మీ రోగనిరోధక శక్తిని మరింత బలహీనపరుస్తుంది. ఇది శరీర సహజ రోగనిరోధక శక్తిని సైతం హరిస్తుంది.
నివారణ..
- విటమిన్ సి, డి, జింక్ అధికంగా ఉండే పోషకాహారాన్ని తినండి.
- రోజూ వ్యాయామం, తగినంత నిద్రపోవడం తప్పనిసరి.
- రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ పెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత అవసరం.
- అతి చల్లటి ద్రవ పానీయాలు, కూల్ డ్రింక్స్, చల్లటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి