వేసవిలో చెమట వల్ల జుట్టు జిగటగా అనిపిస్తోందా?!

ఈ సమ్మర్ లో ఎంత మంచి ఫ్యాషన్ వేర్ వేసుకున్నా.. చెమట వల్ల మన లుక్ మొత్తం సాయంత్రం కల్లా మారిపోతుంది. భరించలేని ఎండ, దాన్నుంచి పుట్టే చెమట మన జుట్టు మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే.. జుట్టు సంరక్షణ కోసం ఈ చిట్కాలు పాటించండి.
చెమట కారణంగా జుట్టు జిగటగా, ఆయిలీగా మారుతుంది. అయితే హెయిర్ స్టైల్ చేసేందుకు హీటింగ్ టూల్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ సమ్మర్ సీజన్‌లో హెయిర్ స్ట్రెయటినింగ్ లాంటి హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి, జుట్టు ఫ్రీగా ఉండటానికి బదులు తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది. తలలో పుట్టే చెమట ఇందుకు మెయిన్ రీజన్ అవుతుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి, చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. జిడ్డుగా మారుతుంది.

  • ఇందుకోసం వారానికోసారి జుట్టుకు ఎగ్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం మేలు. దీనివల్ల జుట్టు జిగట నుంచి ఉపశమనం లభిస్తుంది. హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు లేదా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు.
  • వేసవిలో ఉదయం పూట చెమట ఎక్కువగా పడుతుంది. ఒకవేళ పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా తయారవుతుంది. కాబట్టి ఉదయానికి బదులు రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి, మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.
  • చాలామంది మహిళలకు కండీషనర్‌ని ఉపయోగించడం సరిగా తెలియదు. దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ రాయడం బెస్ట్ మెథడ్. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారి, బరువుగా అనిపిస్తుంది. దీంతో అడిషనల్ గా తలపై జిడ్డు ఏర్పడేందుకు కారణమవుతుంది.
  • ఎంత వేడిగా ఉన్నా ప్రతిరోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే! హెయిర్ ఫాల్ భయం ఒకటి. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించవచ్చు. క్లీన్ అయిన తర్వాత జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.