విటమిన్ ఇ లోపాన్ని తరిమేద్దామిలా..!

విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను సైతం బలపరుస్తుంది. శరీరంలో విటమిన్ E లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి విటమిన్ E డెఫిషియెన్సీ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దాని నుంచి బయటపడటం ఎలా? ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం:

లక్షణాలు..

విటమిన్ E లోపం వల్ల కండరాల బలహీనత, నరాల సమస్యలు (చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటివి), దృష్టి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, నడకలో సమతుల్యత కోల్పోవడం వంటివి.

  • తీవ్రమైన సందర్భాల్లో నరాలు దెబ్బతినడం, కాలేయం, మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తవచ్చు.
  • సిస్టిక్ ఫైబ్రోసిస్, క్రోన్’స్ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలున్నవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ లోపాన్ని నివారించేందుకు సమతుల ఆహారం తీసుకోవడం కీలకం.. బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు గింజలు, ఆలివ్ నూనె, పాలకూర, బ్రోకలీ, అవకాడో, కివీ వంటి విటమిన్ E అధికంగా ఉండే ఆహారాలను రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

అవసరమైతే వైద్యుల సలహా మేరకు విటమిన్ E సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అది కూడా పెద్దలకు రోజుకు 15 మి.గ్రా (22.4 IU) మాత్రమే. అధిక మోతాదు తీసుకోవడం వల్ల రక్తస్రావం, రక్తం పలుచబడటం వంటి సమస్యలు రావచ్చు.

అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులను (ఆలివ్ నూనె, అవకాడో) ఆహారంలో చేర్చుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వాటికి దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో విటమిన్ E శోషణ మెరుగుపడుతుంది.

ఒకవేళ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం రక్త పరీక్షలు చేయించుకోవడం, న్యూరాలజిస్ట్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.