
సైట్ ఉందనో.. లేదంటే ఫ్యాషన్ కోసమో.. కళ్లజోడు/ స్పెట్స్ ధరించే చాలామందిలో ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పడటం సహజం. అయితే ఒక్కోసారి కళ్లజోడు పెట్టనప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో అసౌకర్యంగా ఫీలవుతుంటారు కొందరు. మరి, వీటిని దూరం చేసుకోవాలంటే ఇవి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
- కళ్లద్దాలను ఎంపిక చేసుకునేటప్పుడు లెన్స్ తక్కువగానూ, బరువు ఉండేలా చూసుకోవాలి.
- అలాగే ఫ్రేమ్ ను ఎంచుకునేటప్పుడు కూడా తేలికైనది తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల కళ్లజోడు తక్కువ బరువు ఉండి ముక్కుపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.
- లెన్స్ ఫ్రేము తయారుచేసిన మెటీరియల్స్ చర్మానికి హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మెటల్ వాడుతుంటారు. అలాంటివి పెట్టుకుంటే వెంటనే అలర్జీ వచ్చే అవకాశముంటుంది. కాబట్టి దీన్నిబట్టి ఫ్రేమ్ మెటీరియల్ ను ఎంచుకోవడం ముఖ్యం.
- కళ్లజోడు కారణంగా మచ్చలు పడినచోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇందుకోసం కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో కాస్త రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్నచోట రాయాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నల్లమచ్చలు క్రమంగా తగ్గుతాయి.
- కాస్త రోజ్ వాటర్ తీసుకొని దానికి కొద్దిగా వెనిగర్ కలిపి ఈ మిశ్రమంతో మచ్చలున్నచోట రోజూ మర్దన చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే మచ్చలు మాయమవుతాయి.
- బాదంనూనెలో ఉండే విటమిన్ ‘ఇ’ ముక్కు మీద పడిన కళ్లద్దాల మచ్చలను తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో రోజూ బాదం నూనెతో మచ్చలున్న చోట మర్దన చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.
- ఒక గిన్నెలో పాలు, తేనె, ఓట్స్ తీసుకుని బాగా కలపాలి. కావాలంటే వీటిని మిక్సీలో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో మచ్చలున్న చోట రోజూ మృదువుగా మర్దన చేయాలి. ఫలితంగా మచ్చలు తగ్గుముఖం పట్టడమే కాకుండా చర్మం తాజాగా మారి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మంచి లుక్ అండ్ ఫీల్ కలుగుతుంది.