గోళ్ల అందం.. మరింత పెరగాలంటే..?

అందం అంటే.. ఒక్క ముఖం వరకు మాత్రమే కాదు. కేశాలు మొదలుకొని కాలి గోళ్ల వరకూ.. అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. కొన్నిసార్లు మన అన్ హెల్తీ నెస్ కు సంకేతంగా గోళ్లు అనేవి పెళుసుగా, విరిగినట్లు కనిపిస్తాయి. ఇలా గోళ్లలో కనిపించే ప్రతి చిన్న మార్పు శరీరంలో తలెత్తే అనారోగ్యం తాలూకు సంకేతమని వైద్యులు చెబుతుంటారు. అటువంటి మీ గోళ్లను ఆరోగ్యంగా, అందంగా, బలంగా ఉంచుకోవడం కోసం ఈ చిట్కాలు పాటించండి.

  • మీరు ఒక రెగ్యులర్ టైమ్​ ప్రకారం గోళ్లను కత్తిరించడం అలవాటుగా చేసుకోవాలి అయితే.. గోళ్లను ఎప్పుడూ చర్మానికి పూర్తి దగ్గరగా కత్తిరించకూడదు. వాటి అంచులకు కొంచం ముందువరకు సున్నితంగా కట్ చేయాలి.
  • గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ వాటిని శుభ్రంగా, పొడిగా, తడి అవ్వకుండా ఉంచుకోవాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా మీ చేతులను సబ్బు నీటితో కడుక్కోవాలి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ గోళ్లను కడిగిన తర్వాత పూర్తిగా తుడుచుకోవాలి. ఎక్కువసేపు నెయిల్స్ నీళ్లలో నానితే.. వాటి చుట్టూ ఉన్న చర్మం బాగా పొడిగా మారుతుంది. అప్పుడు విరిగిపోవడం, పెళుసుబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • గోళ్లతో ఇంట్లో డబ్బాలు లేదా ప్యాకేజీలు ఓపెన్ చేసేటప్పుడు కాన్షియస్ తో తీయాలి. ఒక్కోసారి గోళ్లు విరగడమే కాక రక్తస్రావం కూడా అవ్వొచ్చు. తద్వారా వాటి అందం దెబ్బతింటుంది.
  • మీ నెయిల్స్, క్యూటికల్స్‌ను మాయిశ్చరైజ్ చేయండి. చాలామంది దీన్ని పెద్దగా ఫాలో అవ్వరు. కానీ మీ గోళ్లు, క్యూటికల్స్‌ను హైడ్రేట్‌గా, పొడిగా ఉంచడానికి.. పగుళ్లను నివారించడానికి మాయిశ్చరైజింగ్ చాలా అవసరం. అలాగే ఇది రక్త ప్రసరణను ప్రేరేపించి, నెయిల్ డెవలప్ మెంట్ కు ఉపయోగపడుతుంది.
  • ఎక్కువమంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. గోళ్లకు ఒక్కసారి నెయిల్ పాలిష్ వేస్తే, దానంతట అది పోయేవరకు దానిని పట్టించుకోరు. కానీ ఈ కారణంగా కూడా గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నెయిల్ పెయింట్​ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ముఖ్య సందర్భాల్లో పాలిష్ వేసుకోవడం.. ఆ వేడుక పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోండి. వీటితోపాటు గోళ్లను కొరకడం, నెయిల్ పెయింట్ రిమూవల్​ కోసం కఠిన రసాయనాలు వాడడం లాంటివి చేయకుండా ఉంటే మీ గోళ్లు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.