
అందాన్ని, కేశ సంరక్షణ కోసం చాలామంది మహిళలు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు. మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు. హెల్తీగా, అందంగా ఉండొచ్చు. వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా.. చర్మం, జుట్టు నిర్జీవంగా మారతాయి. పొడి చర్మం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇందుకు తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్స్‌ను ఎప్పటికప్పుడు బయటికి పంపుతుంది. జుట్టుకూ మేలు చేస్తుంది.
అయితే మనలో చాలామంది ఎండలు, దాహం నుంచి ఉపశమనం పొందడానికి తరచుగా కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతుంటాం. అంతేకాకుండా, చక్కెర కలిపిన ద్రవాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ.. రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఫలితంగా, చర్మంపై ముడతలు ఏర్పడటంతో పాటు జుట్టుకూ చేటు చేస్తుంది. వెంట్రుకలను బలహీనపరుస్తుంది. చివరికి.. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి.. వేసవిలో చక్కెరకు ఎంతదూరం ఉంటే.. అందానికి అంత మంచిది. వేసవిలో చెమట రూపంలో శరీరం అధిక మొత్తంలో సోడియం లాస్ అవుతుంది. దీంతో కొందరు ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు.
ఇక జంక్ ఫుడ్ కూడా జుట్టుకు, చర్మానికి నష్టం కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక కేలరీలు, చక్కెరలు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్.. ముఖంలో గ్లోను తగ్గిస్తుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతాయి. జుట్టునూ బలహీనపరుస్తాయి. కాఫీ, టీ లాంటి కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకున్నా.. చర్మం డీహైడ్రేట్ అవుతుంది. విటమిన్లు, ఖనిజాలు లోపిస్తే.. జుట్టు, చర్మానికి ముప్పు వాటిల్లుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడటంతోపాటు జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది.
మానసిక, శారీరక ఒత్తిడి కూడా ఒకరకంగా జుట్టు, చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
అందుకు యోగా, ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.