కోపాన్ని నియంత్రించే సూత్రాలు..!

‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే నానుడి ఉంది. ప్రతి ఒక్కరిలో సహజమైన ఎమోషన్ కోపమే అయినా.. కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాల్లో స్థిమితం కోల్పోయి.. ఎన్నో నష్టాలను కొని తెచ్చుకుంటారు. కొందరు దూరమైతే, మరికొందరూ చెడ్డవారనే ముద్ర వేస్తారు.

అదే కోపం ఇంట్లో వాళ్ళమీద మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువ కాలంపాటు చూపిస్తే సహనం కోల్పోయి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించేందుకు కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు.

వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే, ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలివారికి కోపం కంట్రోల్ అవ్వదు. ఫలితంగా కోపం ఇంకాస్త పెరుగుతుంది. దూరం పెరుగుతుంది. అలానే అవతలివారు ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు.

మీరు ఎంత నచ్చచెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే.. కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే మరో వ్యక్తిని సంప్రదించడం, వారితో మాట్లాడి చూడటం. ఇలా మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే కోపగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశం ఉంటుందిగా.

నిజానికి భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ మనిషి ప్రమేయం ఉండకూడదు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్భంలో మాత్రం మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట.

అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా, మాటా మాటా పెరిగినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని ఆ ఇష్యూను పరిష్కరించుకోవడమే ఉత్తమం.