వీటితో డిప్రెషన్ వస్తుందా?

ఆందోళన, డిప్రెషన్ అనేవి.. వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఇది… పొద్దున లేచింది మొదలు ఉద్యోగమనో, చదువనో.. జీవితమంతా ఉరుకుల పరుగులతో సాగిపోతుంది. దీంతో రోజంతా పూర్తయ్యేసరికి ఎక్కడలేని చిరాకు, ఒత్తిడి కలుగుతుంది. ఇందుకు మనం తీసుకునే రోజువారి ఆహారం కూడా కారణమవుతుందని చాలామందికి తెలియదు.. మరీ ఇప్పుడైనా తెలుసుకొని జాగ్రత్త పడదామా…

కెఫిన్… నిద్ర లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది. అలాగని రోజుకు రెండుసార్లకుమించి టీ లేదా కాఫీ తాగితే.. ఇకనైనా ఆ అలవాటును మానుకోండి. ఇది మీ మెంటల్ హెల్త్ పై ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుందనీ వైద్య పరిశోధనల్లో తేలింది. ఇందులోని కెఫిన్ వల్ల స్ట్రెస్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల త్వరగా నిద్ర కూడా రాదు. బదులుగా హెర్బల్ టీనీ తీసుకోవడం ఉత్తమం.

ప్రాసెసెడ్ ఫుడ్… ప్రాసెసెడ్ ఫుడ్/ ప్యాకెట్ లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలలో అత్యధికంగా తీపి లేదా ఉప్పు ఉంటుంది. ఇది బ్రెయిన్ కు అందాల్సిన రక్త ప్రసరణను అందకుండా తగ్గిస్తుంది. ఫలితంగా ఒత్తిడి పెరుగుతుంది.

ఫాస్ట్ ఫుడ్స్… పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి ఇది. దీనివల్ల మనకు తెలియకుండానే షుగర్, బీపి, ఊబకాయం వంటి తీవ్రమైన సమస్యలను కొని మరీ తెచ్చుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి పిల్లలను వీటికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. బదులుగా ఉడకబెట్టిన శనగలు, చిలగడదుంపలు, స్ప్రౌట్స్ లేదా అన్ని రకాల పండ్లను స్నాక్స్ గా ఇవ్వాలి.

చాలామంది తరచుగా వేయించిన ఆహారాన్ని తినడాన్ని ఇష్టపడుతుంటారు. ఇది నోటికి రుచిగా ఉండొచ్చు. కానీ అదే పనిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి కూరగాయలను ఉడకబెట్టి, తక్కువ సమయం వేడి మీద వండుకొని తినాలి. ఇక అలవాటుగా తాగే కూల్ డ్రింక్స్, సాప్ట్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా తాజా పండ్లరసాలను తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా ఒత్తిడి, చిరాకు, ఆందోళన లాంటివి ఏవి దరి చేరవు.