మేకప్ రిమూవర్ కు బదులు కొబ్బరినూనె..!

మేకప్ వేసుకోకుండా, ట్రై చేయకుండా ఈరోజుల్లో ఎవరున్నారు చెప్పండి. మంచి అకేషన్స్ అప్పుడు.. వేడుకలప్పుడు.. రోజంతా మేకప్ ఉన్నా.. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్ ను తొలగించుకోవడం తప్పనిసరి కదా.. లేదంటే వివిధ రకాల చర్మ సమస్యలు అనేకం చుట్టుముడతాయి. ఈ క్రమంలో రసాయనపూరిత మేకప్ రిమూవర్స్ కి బదులు ఇంట్లోనే లభించే సహజమైన పదార్థాలతో మేకప్ ను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా…

కొబ్బరినూనెతో మేకప్ అనేది త్వరగా చెరిగిపోకుండా ముఖ్యంగా వర్షాకాలంలో చాలామంది వాటర్ ప్రూఫ్ మేకప్ ను ఎంచుకుంటారు. అయితే ఇది వేసుకోవడానికి బాగానే ఉన్నా దీన్ని తొలగించుకోవడానికి కాస్త ఎక్కువగా శ్రమించాలి. సమయం పట్టొచ్చు.

ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో మేకప్ రిమూవర్స్ వాడాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా తయారవుతుంది. అంతేకాక వివిధ రకాల చర్మ సమస్యలూ తలెత్తొచ్చు. ఇలాంటప్పుడు సహజమైన కొబ్బరినూనెను వాడటం మంచిది.

ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ ను ఎంతో సులువుగా తొలగించడమే కాకుండా చర్మానికి మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మృదువుగా మారుస్తుంది. దీనికోసం ఒక టీస్పూన్ కొబ్బరినూనెను చేతుల్లోకి తీసుకొని ముఖానికి, మెడకు బాగా పట్టించి 2-3 నిమిషాల తర్వాత కాటన్ ప్యాడ్లతో తుడిచేసుకుంటే సరి. లిప్ స్టిక్ ను సైతం కొబ్బరినూనెతో ఇలాగే తొలగించుకోవచ్చు.