బాధ్యత అంటే..?!

వృత్తి అయినా.. కుటుంబం అయినా.. ఇతర పనులు ఏవైనా సరే బాధ్యతగా నడుచుకున్నప్పుడే అవి సజావుగా ఉంటాయి. సమాజం దృష్టిలో బాధ్యత అంటే ఏంటి.. చాలామంది చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి అన్ని విధాలుగా ఆలోచించి చివరకు తమ దగ్గరే ఆగుతారు. తమ అవసరాలకు అనుగుణంగా బాధ్యతల్ని నిర్ణయిస్తారు.

నిజానికి బాధ్యతంటే.. డిమాండింగ్, కమాండింగ్ ల మధ్య సాగేది కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ఒక తండ్రి తన ఆర్థిక కారణాల వల్ల ఉన్నదాంట్లో తన పిల్లలని సంతోషపెట్టాలని చూస్తే పిల్లలు కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్టు సర్దుకుపోవాలి. వృత్తిలో సమర్థవంతమైన వర్క్ అవుట్ పుట్ ను అందించినప్పుడు.. స్నేహితులు, బంధువుల దగ్గర అనవసర డాబు పోకుండా, మోహమాటాల కోసం శక్తి, సామర్థ్యం మించిన పనులు ఒప్పుకోకుండా ఉండగలగాలి. మరీ ముఖ్యంగా నిజాయితీగా చెప్పేయడం, చేయడం వంటివి చేస్తే వ్యక్తిత్వాన్ని చూసి అందరూ గౌరవిస్తారు. బాధ్యత కలిగిన వ్యక్తిగా చూస్తారు.

ఒకరి మెప్పు కోసమో, ఒకరికి గొప్పగా చెప్పుకోవడం కోసమో కాకుండా తాము చేయవలసిన పనిని తమ పూర్తి సామర్త్యంతో చేస్తే అప్పుడు మనిషి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్టు అని గ్రహిస్తే మంచిది.

ఓ తండ్రి తన పిల్లలకు మంచి దారి చెప్పడం, చూపించడం, జీవితంలోని అనుభవాల్ని పంచుకోవడం.. చదువు, సంస్కారం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి.
తల్లిదండ్రులు పిల్లల మీద తమ ఇష్టాలను రుద్దుతున్నారు. అలా చేయకూడదు. పెద్దల ఆలోచనలను కూడా పిల్లలు అర్థం చేసుకునేలా నచ్చజెప్పాలి. చదువు విషయంలో తమ ఇష్టాల్ని చెప్పి అందులో ఉత్తమంగా రాణించేలా ప్రోత్సహించాలి. జులాయిగా తిరగడం, అల్లరిగా మారిపోవడం వదిలి కాసింత పరిపక్వతతో ఆలోచించేలా వారి చుట్టూ పరిసరాలను మార్చాలి. అప్పుడు వారు తమ బాధ్యతలను తెలుసుకోగలుగుతారు.