ఆడవాళ్ళు బరువు త్వరగా పెరుగుతారు.. ఎందుకు?

కొంతమంది ఆడవాళ్లు ఏమీ తినకపోయినా.. బరువు ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటారు. అయితే ఇలా పెరగడానికి ఫలానా కారణమే అని మనం చెప్పలేం. హార్మోన్లలో మార్పు, నిద్రలేమి, థైరాయిడ్, PCOS వంటి ఆరోగ్య సమస్యలు ఇతరత్రా బరువు పెరిగేందుకు కారణమవుతాయి. కాబట్టి వీటిపై సరైన అవగాహన లేకపోతే మాత్రం భవిష్యత్‌ లో పలు రకాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం:

హార్మోన్ల ప్రభావం: ఆడవాళ్ల జీవితంలో పుబర్టీ, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్లలో మార్పుల మూలాన శరీరంలో ప్రభావం చూపుతుంది. ఇవి మెటాబాలిజాన్ని ప్రభావితం చేసి శరీరంలో కొవ్వు నిల్వల రూపంలో ఎక్కువ మార్పులు తీసుకొచ్చి బరువు పెరిగేలా చేస్తుంది.

నిద్రలేమి: నిద్ర సరిపోకపోతే, సరైన విధంగా నిద్ర పోకపోతే కోర్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఆకలిని పెంచి, అధిక మొత్తంలో తినడానికి దారి తీస్తుంది.

PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్): ఇది ఎక్కువమంది యువతుల్లో కనిపించే హార్మోనల్ డిసార్డర్ గా చెప్పవచ్చు. ఈ సమస్య వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, బరువు అదేపనిగా పెరుగుతారు.

థైరాయిడ్ సమస్యలు: హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లలో మెటాబాలిజం అనేది నెమ్మదిగా పని చేస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి వినియోగం తగ్గి, బరువు పెరుగుతుంది. దీంతోపాటు ఆఫీసులో ఉండటం, ఇంట్లో పనుల్లో నిమగ్నమవ్వడం వల్ల తమ మీద తాము కేర్ తీసుకోరు. శరీరానికి సరైన వ్యాయామం ఉండదు. దీని ప్రభావం కాలక్రమంలో బరువు పెరుగుదలకు కారణమవుతుంది.

కాబట్టి చక్కని నిద్ర, తీసుకునే ఆహారంలో కొవ్వులు, తీపి పదార్థం ఎక్కువ ఉన్నవి కాకుండా పోషకాలు ఉండేలా తీసుకుంటూ చక్కని జీవనశైలిని అలవర్చుకుంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు.