
వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుని జననం జరిగింది. బుద్ధుడు బోధిచెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందింది కూడా ఇదే రోజున కావడంతో.. ఈ పర్వదినాన బుద్ధ పౌర్ణమి వేడుకలను జరుపుకోవడం విశేషం.
బోధిచెట్టు కింద జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు గౌతమబుద్ధుడు నిర్యాణం చెందాడు. బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాల్లోనూ ఈరోజున బోధి వృక్షానికి, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఒక చేతిలో వరదముద్ర, మరో చేతిలో భిక్షాపాత్రను ధరించడంలో అర్థం.. తాను సమస్త సమస్యల నుంచి మానవాళికి విముక్తి కలిగిస్తానని చెప్పడమే..
జీవితసవాళ్లను ఎదుర్కోవడంలో మనకు బోధపడే ఎన్నో శాశ్వత సత్యాలను ఆవిష్కరించిన గొప్ప అధ్యాత్మికవేత్త.
బ్రాహ్మణులు చేసే యోగ సాధనలకు ఆకర్షితుడై, ఎన్నో యోగ సాధనలు చేశాడు. కానీ అవి స్వర్గ సాధన కోసమని తెలిసి వదిలేశాడు. అనంతరం
సిద్ధార్థుడు వేగనుని ఆశ్రమం చేరుకున్నాడు. వైరాగ్యం అవలంబించి, కుండలినీ యోగం సాధన చేశాడు. ఇది అష్టాంగ యోగ సాధనకు దారి తీసింది. యోగాలన్నిటిలో అష్టాంగయోగం ఉత్తమమైనదని స్వీయానుభవంతో తెలుసుకున్నాడు. అవి ఎనిమిది..
అష్టాంగ మార్గం..
- సరిగా, సమంగా ఆలోచించి, మంచి సంకల్పం చేయడం.
- సత్యమైన మాటలే పలకడం.
- పనులను సక్రమమైన మార్గంలో చేయడం.
- స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం.
- చెడుని విస్మరించి మంచిని పాటించడం.
- తెలుసుకున్న మంచి విషయాలను ఆచరించడం.
- మరణం అనివార్యమని గ్రహించి మంచి పనులు చేయడం.
- జనహితమైన జీవితంతో పునీతులు కావడం.
ప్రపంచంలో ప్రతిదీ కారణం నుంచి పుడుతుంది. కారణరహితంగా ఏదీ ఉండదు. ఎక్కడైతే దుఃఖం ఉందో, అక్కడ అందుకుగల కారణం ఉండి తీరుతుంది. అకారణంగా ఏదీ ఉండదు కదా!
ఆ కారణాన్ని తెలుసుకొని నిరోధించగలిగితే దుఃఖమనే దానికి ఆస్కారం ఉండదు.
దానిని అధిగమించడానికి బుద్ధుడు సూచించినదే ఈ అష్టాంగ మార్గం.