
ఏళ్ల తర్వాత ముంబై దాడుల కేసుకు సంబంధించి కీలక అడుగు పడింది. ఎన్నో ఏళ్ల ప్రయత్నానికి ఫలితం దక్కింది. ఈ కేసులో కీలక సూత్రదారి తహవూర్ రాణాని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం ఓ కొల్కికి వచ్చింది. 2008 ముంబై దాడుల తర్వాత ఇతన్ని 2009లో అమెరికాలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి భారత్ ఇతన్ని రప్పించాలని పోరాడుతోంది. దాదాపు 16 సంవత్సరాల ప్రయత్నాల తర్వాత.. ఎన్ఐఏ, రా బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ విజయం వెనక భారత్ దౌత్యం ఎంతో పనిచేసింది. తహవూర్ రాణాను తీసుకొచ్చేందుకు అమెరికా కోర్టుల్లో పెద్ద యుద్ధమే జరిగింది. 2011లో తహవూర్ రాణాను అమెరికాలో లష్కర్-ఎ-తొయ్బాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చారు. కానీ ముంబై దాడులకు సంబంధం లేదని విడుదల చేశారు. భారత్ ఇతన్ని 2020లో రప్పించాలని అభ్యర్థించింది. అమెరికా సుప్రీం కోర్టు 2025లో ఇతని అప్పీళ్లను తిరస్కరించి.. ఎక్స్ ట్రడిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టంగా మారింది.?
తహవూర్ రాణా ఇండియాకు తీసుకువావడంపై అటు ప్రజలు, ఇటు ముంబై దాడుల బాధితుల నుంచి భారీ స్పందన వచ్చింది. చాలా మంది దీన్ని న్యాయం కోసం గెలిచిన పోరాటంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో జనం సంతోషం వ్యక్తం చేస్తూ.. తహవూర్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కొందరు మాత్రం ఇంత ఆలస్యం ఎందుకైందని ప్రశ్నిస్తున్నారు.తహవూర్ రాణా ఎవరు? ఇతను పాకిస్తాన్ లో పుట్టి.. కెనడా పౌరసత్వం తీసుకున్న వ్యాపారవేత్త. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నడిపాడు. ఇతను లష్కర్-ఎ-తొయ్బాకు సహాయం చేసి.. ముంబై దాడులకు సహకరించాడు. ఇతని సన్నిహితుడు డేవిడ్ హెడ్లీతో కలిసి.. దాడులకు పథకాలు రచించాడు. ముంబై దాడులతో ఇతని సంబంధం ఏంటి? 2006 నుంచి 2008 వరకు తహవూర్ డేవిడ్ హెడ్లీకి ముంబైలో రెక్కీ చేసేందుకు సహాయం చేశాడు. తన వ్యాపారాన్ని కవర్ గా ఉపయోగించి.. హెడ్లీకి వీసా, లాజిస్టిక్స్ అందించాడు. ఈ దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు 60 గంటల పాటు ముంబైని అతలాకుతలం చేశారు.
ఇప్పుడు తహవూర్ రాణా ఢిల్లీలో తీహార్ జైల్లో ఉంచారు. ముంబైలో ట్రయల్ కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ఐఏ ఇతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనుంది. ఈ కేసు ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం బయటపడే అవకాశం ఉంది. రాణాను భారత్ కు తీసుకురావడం పెద్ద విజయం. ఉగ్రవాదులకు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకురావడం తప్పదని సంకేతం. ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. కానీ ఇప్పుడు న్యాయం జరగాల్సిన సమయం. రాణా లాంటి వాళ్లు ఇకపై ఇలాంటి నేరాలు చేయకుండా ఎలా ఆపాలి? ఇది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.