అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం చివరి ప్రయాణం..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశం విషాదం నింపింది. లండన్‌కు బయల్దేరిన బోయింగ్ 787-B Al171 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఆకాశంలో దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? వెంటనే అధికారులు ఏం చేశారు? ఈ దుర్ఘటనలో ఎవరెవరు చనిపోయారు?

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు భారత్ లో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే అత్యంత పెద్దది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లయిట్‌ ఏఐ-171 విమానం సెకన్ల వ్యవధిలోని కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటిపొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్‌ రాడార్‌ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్‌ కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఎక్కువ ఫ్యూయల్ ఉండటంతో భారీ పేలుడు సంభవించింది. చాలా దూరం నుంచి ఈ పేలుడు, దట్టమైన పొగ కనిపించాయి. ఈ పేలుడు వల్ల ప్రాణనష్టం ఇంత భారీ స్థాయిలో ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్‌ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

విమానానికి కెప్టెన్‌గా సుమిత్‌ సబర్వాల్‌, ఫస్ట్‌ ఆఫీసర్‌గా క్లైవ్‌ కుండర్‌ ఉన్నారు. సుమిత్‌కు ఎల్‌టీసీగా 8,200 గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల అనుభవం ఉంది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్‌వే నుంచి గాల్లోకి ఎగిరి కొద్దిసేపటికే ఆ ఎయిర్‌ క్రాఫ్ట్‌ నుంచి ఏటీసీకి మేడేకాల్‌ వచ్చిందని వెల్లడించింది. తిరిగి ఏటీసీ పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన కరవైనట్లు పేర్కొన్నాయి. అనంతరం కొన్ని సెకన్లలోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలో దట్టమైన పొగలు అలముకున్నాయి మేడే కాల్‌ అనేది డిస్ట్రెస్‌ కాల్‌. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్‌ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడుతారు.

విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అటు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో వెంటనే రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలపై వారు దర్యాప్తు చేపట్టారు. అటు ప్రమాద ఘటనపై ఎయిరిండియా యాజమాన్యమైన టాటా గ్రూప్‌ స్పందించింది. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని తెలిపింది. ఎయిరిండియా ప్రమాద ఘటన తమని తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదని తెలిపింది.

ఈ విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా చనిపోయారు. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ రూపానీ ఈ విమానంలో లండన్ కు బయలుదేరారు. బీజేపీకి చెందిన విజయ్‌ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయన మృతి పట్ల నేతలు సంతాపం ప్రకటించారు. అటు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని రాష్ట్రపతి ద్రౌపదీ తెలిపారు. ఇది హృదయ విదారకర ఘటన. దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని అన్నారు. అటు అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం నింపిందన్నారు. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నారు.

విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైందని… బాధిత కుటుంబాల ఆవేదన వర్ణణాతీతమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం, ప్రతి క్షణం విలువైనదే. సహాయకచర్యలు వేగంగా జరగాలని… క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ముందుండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రిని ఆదేశించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్‌ నాయుడు, అమిత్‌ షాకు ప్రధాని సూచించారు. ఆ ప్రమాకరంమే అమిత్ షా, రామ్మోహన్ నాయుడు వెంటనే అహ్మదాబాద్ కు వెళ్లారు.

అలాగే అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాద ఘటనపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం చెందారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారత్‌లో జరిగిన విమానం ప్రమాదం బాధాకరమన్నారు. అహ్మాదాబాద్‌ సమీపంలో ఎయిరిండియా విమానానికి జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా స్పందిస్తూ.. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం ఘటన హృదయవిదారకరమని తెలిపారు.