బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తోన్న దర్యాప్తు సంస్థలు.!

Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాణ తర్వాత.. విమానాల పరిస్థితి, ఎయిర్ పోర్టుల్లో నిర్వహణ వంటి అంశాలపై డీజీసీఏ దృష్టి పెట్టింది. ఈ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి.. ఇంతకీ అవి ఏంటి..? బ్లాక్ బాక్స్ పాడైందని.. దానిని విదేశాలకు పంపారనే వార్తనులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుక ఖండించారు..? విమానల్లో సాంకేతిక సమస్యలు ఎందుకు ఆందోళన కలగిస్తున్నాయి..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. జూన్‌ 12న లండన్‌ వెళ్లేందుకు అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలడం పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు కాగా.. 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. ప్రమాద ఘటనలో ప్రాణనష్టానికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ తొలిసారి అధికారికంగా ఈ వివరాలను ప్రకటించింది. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 260 మందిని గుర్తించారు. మరో ఆరుగురిని మాత్రం ముఖాలతో నిర్ధరించారు. చనిపోయిన వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 256 మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతావారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. అటు విమానం బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఈ విమానంలో అసలేం జరిగిందో తెలుసుకోనేందుకు అందరి దృష్టీ ఇప్పుడు బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణపై పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తోసిపుచ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉందన్నారు. దీన్ని ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది అని స్పష్టం చేశారు. డేటా విశ్లేషణ చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారమని.. ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు.

అయితే విమాన ప్రమాదం తర్వాత జరుగుతున్న తనిఖీల్లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఎయిరిండియా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ఇటీవల పరిశీలించింది. ఈ క్రమంలోనే విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలున్నాయని తెలిసింది. విమానాలు, రన్‌వేల్లో లోపాలు వంటివీ ఇందులో గుర్తించారు. డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్ర పరిశీలనలు నిర్వహించాయి. ఫ్లైట్‌ ఆపరేషన్స్‌, ర్యాంప్‌ సేఫ్టీ, ఏయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌, నేవిగేషన్‌ సిస్టమ్స్‌, ప్రీ-ఫ్లైట్‌ మెడికల్‌ ఎవాల్యూయేషన్స్‌ తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాయి. ఓ ఎయిర్‌పోర్ట్‌లో అరిగిపోయిన టైర్ల కారణంగా ఓ దేశీయ విమానం నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. విమానాల్లో లోపాలు అనేకసార్లు పునరావృతమైన కేసులు వెలుగుచూశాయని డీజీసీఏ తెలిపింది.

అటు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత విమాన ప్రయాణాలపై ఫోకస్ పెరిగింది. అటు ఎయిర్‌లైన్ సంస్థలు, ఇటు ప్రయాణికులు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. కొంత ఆలస్యమైనా సరే.. పొరపాట్లు జరగకుండా ఉండాలని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో విమానాల్లోని సమస్యలు, బాంబు బెదిరింపులు వంటి అంశాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. శంషాబాద్‌లోని స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్‌ నెంబర్‌ SG-2138లో మొదట టెక్నికల్‌ సమస్య అని సిబ్బంది ప్రయాణికులకు తెలిపారు. దీంతో మూడు గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు భయంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇక దుబాయ్ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Air India Plane Crash.

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భద్రతా కారణాలతో తిరిగి వెనక్కి వెళ్లింది. సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అందులో బాంబు స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తేలిన తరువాత ప్రయాణానికి అనుమతిచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం అటు ప్రయాణికుల ఆందోళన, ఇటు విమానయాన సంస్థలు జాగ్రత్తలతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Also Read: https://www.mega9tv.com/national/indian-army-shows-off-its-mighty-power-with-operation-sindoor/