అహ్మాదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం..!

అహ్మాదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలింది . టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఒక్క సారిగా ఇళ్లపై కుప్ప కూలింది. దీంంతో విమానంలో ఒక్క సారిగా మంటు చెలరేగాయి…..

ఎత్తున పొగలు అలుముకున్నాయి. ఇక ఈ విమానంలో మొత్తం 242 మంది ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న .. అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి మంట‌లు ఆర్పుతున్నాయి.. ఈ విమానం అహ్మాదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారిని ఆకాశం అర్ధాంతరంగా తనలోకి లాగేసుకుంది. ఈ రోజు కేవలం క్యాలెండర్‌లో ఒక రోజు మాత్రమే కాదు…ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాయాన్ని మిగిల్చిన రోజు. భారత విమానయాన చరిత్రలో ఒక మరువలేని మచ్చగా మిగిలిపోయిన చీకటి రోజు. ప్లీజ్ వెయిర్ యువర్ సీట్ బెల్ట్స్.. అని అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఎవరూ ఊమించిన విధంగా ఆ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 242 మంది దుర్మరణం చెందారని సమాచారం. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు , ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారని తెలుస్తోంది. గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన విమానాల ప్రమాదాల్లో ఇది భారీదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ దుర్ఘటన ఒక్కటే కాదు.. భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో భయంకరమైన ప్రమాదాలు ఎన్నో జరిగాయి.

1990 ఫిబ్రవరిలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఫ్లైట్ 605 కుప్పకూలింది. రన్‌వేను తాకడంతో విమానం ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో 146 మంది ప్రమాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 16, 1991 లొ ఇంఫాల్ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు. ఆ తర్వాత 1993 ఏప్రిల్‌లో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం టేకాఫ్‌ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్‌వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ఫ్లైట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు,55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

నవంబర్ 12, 1996లో చార్ఖీ దాద్రి విమాన ప్రమాదం.. భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం . సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 763, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 విమానం ఒకదానితో ఒకటి ఢీకున్నాయి. ఢిల్లీ సమీపంలోనే గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యూషిన్ ఇల్ విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు. 1998 జులైలో ఆలయన్స్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ బోయింగ్ 737-2A8 విమానం ల్యాండింగ్‌ సమయంలో కంట్రోల్ తప్పి జనావాసాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బిహార్‌లోని పట్నా ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు చనిపోగా , మరో ఐదుగురు స్థానికులు మరణించారు.

2020 కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను దేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్‌లో బోయింగ్ 737-800 విమానం దుబాయ్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా ఆ విమానం అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

2010 మేలో మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఐఎక్స్‌-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ఎన్ఆర్ఐలు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. అయితే టైమ్ కి రన్‌వేపై ల్యాండ్ కాలేకపోయింది. రన్‌వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఫ్లైట్ లో మంటలు చెలరేగి 158 మంది చనిపోయారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు.