భారత్ లో మరో కరోనా వేవ్.? రోజురోజుకు పెరుగుతున్న కేసులు.!

భారత్‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వారంలో ఎన్ని కేసులు పెరిగాయి? ఏ వేరియంట్ ఈ పెరుగుదలకు కారణమవుతోంది? దీని లక్షణాలు, ప్రమాద స్థాయి ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

దేశంలో మళ్లీ కరోనా విజృంభించనుందా.. మళ్లీ కరోనా ప్రాణాలను బలితీసుకోనుందా.. అనే భయాలను ఇప్పుడు ప్రజలను వెంటాడుతున్నాయి. దీనికి రోజురోజకు దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులే కారణం. జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా 3,395 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మే 25 1,010 యాక్టివ్ కేసులు ఉండగా, ఒక వారంలో ఇది మూడు రెట్లు పెరిగి 3,395కి చేరింది. అంటే, గత వారంలో సుమారు 2,385 కేసులు కొత్తగా నమోదయ్యాయి. మే 31న ఒక్క రోజులోనే 685 కేసులు నమోదయ్యాయి, ఇందులో కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్యలు మే 25 నుంచి జూన్ 1 వరకు ఐదు రెట్లు పెరిగాయని నిపుణులు అంటున్నారు. అంటే కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం 210 యాక్టివ్ కేసులు ఉండగా, ముంబైలో 36 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. ఢిల్లీలో 104, తమిళనాడులో చెన్నైలో కేసులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ప్రధానంగా మెట్రో నగరాల్లో, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తోంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన JN.1 సబ్-వేరియంట్‌లు, ముఖ్యంగా NB.1.8.1 మరియు LF.7, ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ వేరియంట్‌లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సింగపూర్‌లో మే 3తో ముగిసిన వారంలో కేసులు 28% పెరిగాయి, హాంకాంగ్‌లో నాలుగు వారాల్లో టెస్ట్ పాజిటివిటీ రేటు 6.21% నుంచి 13.66%కి చేరింది. ఈ వేరియంట్‌లు భారత్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజల్లో వ్యాక్సినేషన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి తగ్గుతుండటం కూడా కరోనా వ్యప్తికి మరో కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు సమావేశాలు, పండుగలు, రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది.

ఈ పరిస్థితిపై డాక్టర్లు, నిపుణులు ఏమంటున్నారు? కొత్త సబ్-వేరియంట్‌లు NB.1.8.1, LF.7 రోగనిరోధక శక్తిని బలహీనపరిచే సామర్థ్యం కలిగి ఉన్నాయి, కానీ అవి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం లేదని డాక్టర్లు అన్నారు. ఈ వేరియంట్‌లు ఒమిక్రాన్ కుటుంబానికి చెందినవి, ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి కానీ చాలా మందిలో తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించవని అంటున్నారు. అయితే, నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ICMR, ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఈ వేరియంట్‌లను నిశితంగా పరిశీలిస్తున్నాయి. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం, చాలా కేసులు స్వల్పంగానే ఉన్నాయి, హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా ఉన్నాయి. అయితే, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. INSACOG డేటా ప్రకారం, JN.1 వేరియంట్ ప్రస్తుతం భారత్‌లో ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఇది 53% కేసులకు కారణమవుతోంది. దీని సబ్-వేరియంట్‌లు NB.1.8.1, LF.7 కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. NB.1.8.1 తమిళనాడులో ఏప్రిల్‌లో, LF.7 గుజరాత్‌లో మొదటిసారి కనుగొనబడ్డాయి. ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌ల మాదిరిగానే, ఈ JN.1, NB.1.8.1, LF.7 వేరియంట్‌లు స్వల్ప జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, రన్నీ నోస్, శరీర నొప్పులు, అలసట, తలనొప్పి వంటి లక్షణాలను కలిగిస్తున్నాయి. గతంలో డెల్టా వేరియంట్‌లో కనిపించిన వాసన, రుచి కోల్పోవడం ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తోంది. అయితే, కొందరిలో డయేరియా, కండ్లలో ఎరుపు వంటి కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నివేదికలు చెబుతున్నాయి.

ఈ వేరియంట్‌ల ప్రమాద స్థాయి ఎంత? WHO ప్రకారం, JN.1 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంది. భారత్‌లో కూడా చాలా కేసులు స్వల్పంగానే ఉన్నాయి, హాస్పిటలైజేషన్ లేదా ICU అవసరం లేని స్థాయిలో ఉన్నాయి. అయితే, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణీలు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 26 మరణాలు నమోదయ్యాయి, అందులో మహారాష్ట్రలో 7, కేరళలో 6, ఢిల్లీలో 3, కర్ణాటకలో 3 మరణాలు ఉన్నాయి. చాలా మరణాలు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిలోనే సంభవించాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిపుణుల సూచనల ప్రకారం, ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరి. ముందుగా, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రోగ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండటం చేయాలి. లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి, RT-PCR లేదా రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ పాజిటివ్ వస్తే, ఇంట్లో వేరే బాత్రూమ్ ఉపయోగించడం, తడిపిన బట్టలు, వస్తువులు షేర్ చేయకపోవడం, ఇంట్లో కూడా మాస్క్ ధరించడం చేయాలి. వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. బూస్టర్ డోస్‌లు తీసుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యం నుంచి రక్షణ పొందవచ్చు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బూస్టర్ డోస్‌లు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, తేలికైన ఆహారం తీసుకోవడం చేయాలి. ఆక్సిజన్ స్థాయిలు, జ్వరం తరచూ చెక్ చేసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటోంది? ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. అయితే, కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ స్థాయిలు తగ్గడం వల్ల కేసులు ఆలస్యంగా గుర్తిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కమ్యూనిటీలో వైరస్ వ్యాప్తిని పెంచే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ వైరస్ వల్ల లాంగ్ కోవిడ్ ప్రమాదం ఉందని WHO నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాంగ్ కోవిడ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం ఉండవచ్చు, ఇది 5, 10, 20 సంవత్సరాల తర్వాత కూడా సమస్యలను కలిగించవచ్చు. మొత్తంగా, ప్రస్తుతం కేసులు స్వల్పంగా ఉన్నప్పటికీ, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్-19 ఇప్పుడు ఎండమిక్‌గా మారింది, అంటే ఇది పూర్తిగా అదృశ్యం కాదు, సీజనల్ ఫ్లూ లాగా ఎప్పటికప్పుడు తిరిగి వస్తుంది. అందుకే, ప్రాథమిక జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి.