జయహో శుభాంశు శుక్లా..!

New chapter in India’s space history: భారతదేశం అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక అడుగు పడింది. గ్రూప్ కెప్టెన్, భారత వైమానిక దళ అధికారి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1984లో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన 41 సంవత్సరాల తర్వాత, శుభాంశు ఈ ఘనత సాధించారు. ఈ యాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? శుభాంశు ఐఎస్ఎస్‌లో ఏం చేయనున్నారు? ఈ మిషన్ భారత్‌కు ఎలా ఉపయోగపడనుంది? భవిష్యత్‌లో భారత అంతరిక్ష ప్రయోగాలకు శుభాంశు అనుభవం ఎలా తోడ్పడుతుంది?

భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. అంతరిక్షంలో భారత జెండా విహరించింది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకొని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలో విజయవంతంగా వెళ్లారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం మిషన్-4 లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ అక్సియం స్పేస్ నిర్వహించింది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌పై క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో శుభాంశు, అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఐఎస్ఎస్‌కి చేరుకున్నారు. ఈ ప్రయాణం సుమారు 28 గంటలు పట్టింది. ఐఎస్ఎస్‌లో 14 రోజులు గడపనున్న శుభాంశు, వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, విద్యార్థులతో సంభాషణలు, అంతరిక్షంలో భారత సంస్కృతిని ప్రదర్శించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మిషన్‌లో శుభాంశు పైలట్‌గా వ్యవహరించారు. అంటే, రాకెట్ లాంచ్, డాకింగ్ వంటి కీలక ఆపరేషన్లలో మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్‌కు సహాయం చేశారు. ఈ ప్రయాణం సజావుగా సాగడానికి శుభాంశు 2,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం, రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో, నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో తీసుకున్న శిక్షణ ఎంతగానో ఉపయోగపడ్డాయి.

1984లో రాకేష్ శర్మ రష్యా సోయుజ్ రాకెట్‌లో సల్యూట్-7 అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత, 41 సంవత్సరాలకు భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన మరో వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లారు. శుభాంశు శుక్ల లక్నోలో 1985 అక్టోబర్ 10న జన్మించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, 1999 కార్గిల్ యుద్ధం స్ఫూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 2006లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా కమిషన్ పొంది, సుఖోయ్-30, మిగ్-21, జాగ్వార్ లాంటి విమానాలు నడిపారు. 2019లో ఇస్రో ఎంపిక చేసిన తర్వాత, రష్యా, అమెరికాలో శిక్షణ పొంది, అంతరిక్షంలో భారత జెండా ఎగురవేశారు. శుభాంశు ఐఎస్ఎస్‌కి వెళ్లిన తొలి భారతీయుడు, రెండో భారత వ్యోమగామి. ఈ మిషన్ భారత్‌కు ప్రత్యేకం ఎందుకంటే, ఇది ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అక్సియం స్పేస్‌ల మధ్య అంతర్జాతీయ సహకారానికి నిదర్శనం. ఇస్రో ఈ మిషన్ కోసం 550 కోట్ల రూపాయలు చెల్లించి, శుభాంశు కోసం సీట్ సెక్యూర్ చేసింది. ఈ మిషన్ భారత్‌ను గ్లోబల్ స్పేస్ రంగంలో కీలక భాగస్వామిగా నిలబెట్టింది. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలతో పోటీ పడుతూ, భారత్ ఇప్పుడు మానవ అంతరిక్ష యాత్రల్లో తన సత్తా చాటబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తన యాత్ర 140 కోట్ల భారతీయుల యాత్ర అని శుభాంశు చెప్పిన మాటలు దేశంలో కొత్త తరాన్ని ఉత్తేజపరిచాయి.

ఐఎస్ఎస్‌లో శుభాంశు శుక్లా 14 రోజులపాటు బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. ఐఎస్ఎస్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరిగే ఒక భారీ ల్యాబొరేటరీ, ఇక్కడ వ్యోమగాములు అనేక ప్రయోగాలు చేస్తారు. శుభాంశు, మిగతా ముగ్గురు వ్యోమగాములతో కలిసి 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. వీటిలో భారత్ కు సంబంధించిన ఏడు ప్రయోగాలను శుభాంశు చేయనున్నారు. ఈ ప్రయోగాల్లో కొన్ని భారత ఆహార పంటలైన మెంతి, పెసర విత్తనాలు అంతరిక్షంలో ఎలా మొలకెత్తుతాయో చూడటం, సైనోబాక్టీరియా మైక్రోగ్రావిటీలో ఎలా పెరుగుతుందో అధ్యయనం చేయడం వంటివి ఉన్నాయి. ఈ సైనో బాక్టీరియా ఆక్సిజన్, ఆహారం ఉత్పత్తి చేయగలదు, భవిష్యత్‌లో అంతరిక్ష నౌకల్లో జీవనాధార వ్యవస్థలకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే మైక్రోగ్రావిటీలో కండరాలు ఎలా బలహీనపడతాయో, దాన్ని ఎలా నివారించాలో అధ్యయనం చేసే మయోజెనెసిస్ ప్రయోగం కూడా శుభాంశు నిర్వహించనున్నారు. ఇది వ్యోమగాముల ఆరోగ్యానికి, భూమిపై కండరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, శుభాంశు భారత విద్యార్థులతో రేడియో ద్వారా మాట్లాడి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. New chapter in India’s space history.

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర భవిష్యత్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు కీలకం కానుంది. శుభాంశు ఇస్రో గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరు. గగన్‌యాన్ అనేది 2026లో భారత్ సొంతంగా పంపించే తొలి మానవ అంతరిక్ష మిషన్. ఈ మిషన్‌లో ఒకటి నుంచి ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి 400 కిమీ ఎత్తులో మూడు రోజులు గడుపుతారు. ఐఎస్ఎస్‌లో శుభాంశు పొందిన అనుభవం గగన్‌యాన్‌కు ఎంతో కీలకం. స్పెష్ షటిల్ ఆపరేషన్లు, మైక్రోగ్రావిటీలో జీవించడం, ఎమర్జెన్సీ సిట్యుయేషన్లను హ్యాండిల్ చేయడం, శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణ వంటి అంశాల్లో శుభాంశు నేర్చుకున్నవి గగన్‌యాన్ టీమ్‌కు ఉపయోగపడతాయి. ఇవి గగన్‌యాన్‌లో కూడా ఉంటాయి, కాబట్టి ఈ అనుభవం ఇస్రోకు టెక్నికల్, ఆపరేషనల్ గ్యాప్‌లను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, శుభాంశు నిర్వహించిన ప్రయోగాల ఫలితాలు భవిష్యత్‌లో అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి, జీవనాధార వ్యవస్థల అభివృద్ధికి దోహదపడతాయి. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటోంది, ఇందులో శుభాంశు అనుభవం కీలక పాత్ర పోషిస్తుంది.

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారన్నారు. ఆయన ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. శుభాంశు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారన్నారు ముర్ము. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక, భారత్‌, హంగేరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాలులతో కూడిన అంతరిక్ష మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఈసందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్లమంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని వెల్లడించారు.

Also Read: https://www.mega9tv.com/national/axiom-4-mission-launch-shubhanshu-shukla-becomes-second-indian-to-head-to-space/