
Pawan Kalyan attended Murugan Temple: తమిళనాడు రాజకీయాల్లో మురుగ భక్తర్గళ్ మానాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు వెళ్లారు. మధురైలో జరిగిన మురుగ భక్తర్గళ్ మానాడుకు.. బీజేపీకి సంబంధం ఏంటి..? డీఎంకే నేతలు ఎందుకు విమర్శలు చేశారు..? అసలు ఈ మురుగ భక్తర్గళ్ మానాడు అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏమిటి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కార్యక్రమానికి వెళ్లారు?
ది హిందూ మున్నాని, విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో సహా ఇతర హిందూ సంస్థలు సంయుక్తంగా నిర్వర్తించిన ఆధ్యాత్మిక సమ్మేళనమే మురుగ భక్తర్గళ్ మానాడు. జూన్ 22న మధురైలో ప్రారంభమైంది. తమిళనాడులో అత్యంత ఆరాధనీయమైన దేవుడైన మురుగన్ భక్తులను ఏకం చేయడం, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, హిందూ ఐక్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధురైలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని అంచనా.
మురుగ భక్తర్గళ్ మానాడు ప్రత్యేకత ఏమిటి? మురుగన్ తమిళనాడులో తమిళ దేవుడిగా పేరు. మురుగన్ ఆరు క్షేత్రాలు తమిళ హిందూ గుర్తింపునకు కేంద్రంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం హిందూ సంఘాలను ఏకం చేయడమే కాక, తిరుప్పరంకుండ్రం హిల్‌ను సికందర్ హిల్ గా పేరు మార్చే ప్రయత్నాలను వ్యతిరేకించడానికి ఒక వేదికగా మారింది. హిందూ మున్నాని, బీజేపీ ఈ సమ్మేళనాన్ని సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ఒక చారిత్రక సమావేశంగా ప్రచారం చేశాయి. 50 లక్షల ఆహ్వాన పత్రాలు తయారు చేశారు. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ భద్రతా ఆంక్షలతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లారు? సనాతన ధర్మ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్న నాయకుడిగా, ఈ సమ్మేళనానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల తమిళనాడులో మురుగన్ ఆరు క్షేత్రాలను పవన్ దర్శించుకున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను గతంలో విమర్శించారు పవన్. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిసి, మానాడుకు వచ్చి కీలక ప్రసంగం చేయమని ఆహ్వానించారు. పవన్ తన సినిమా, రాజకీయ, ఆధ్యాత్మిక జీవితంలో తమిళనాడుతో గాఢమైన అనుబంధం ఉందని, తమిళ సంస్కృతి, మార్షల్ ఆర్ట్స్‌ను చెన్నైలో నేర్చుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా హిందూ ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆయన పాల్గొన్నారు. Pawan Kalyan attended Murugan Temple.
తమిళనాడు కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు పిలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా స్టార్‌గా తమిళనాడులో పాపులర్, జనసేన అధినేతగా బీజేపీతో కూటమిలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీ తమిళనాడులో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి పవన్ స్టార్ పవర్, సనాతన ధర్మంపై ఆయన గట్టి వైఖరిని ఉపయోగించుకుంటోంది. గతంలో తిరుపతి లడ్డూ వివాదంలో, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై పవన్ బలంగా స్పందించారు, ఇది తమిళనాడులో హిందూ భావజాలంతో ముడిపడిన ఓటర్లను ఆకర్షించింది. బీజేపీ 2026 తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి పవన్‌ను ఒక వ్యూహాత్మక ఆస్తిగా భావిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ప్రభావం ఎంత? తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యం ఉన్నప్పటికీ, బీజేపీ తన ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 11.24% ఓటు షేర్ సాధించింది, కానీ ఒక్క సీటూ గెలవలేదు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి 39 సీట్లలో 22 గెలిచింది. బీజేపీ మురుగన్ వంటి తమిళ దేవతలను, సాంస్కృతిక గుర్తింపును ఉపయోగించి హిందూ ఓటర్లను ఆకర్షించే వ్యూహం అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మురుగ భక్తర్గళ్ మానాడు వంటి కార్యక్రమాలు బీజేపీకి రాజకీయ, సాంస్కృతిక వేదికగా మారాయి. డీఎంకే ఈ కార్యక్రమాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయ ఎత్తుగడ గా విమర్శించింది.
మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంపై వివాదాలు ఏమిటి? మురుగ భక్తర్గళ్ మానాడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారిందని ప్రధాన వాదన. భద్రతా కారణాలతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజులకు కుదించాలని, మైక్‌లు, ఆంప్లిఫైయర్‌లకు అనుమతి నిరాకరించింది డీఎంకే ప్రభుత్వం. హిందూ మున్నాని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు భద్రతా నిబంధనలతో కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది. ఈ సభతో పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యనాథ్ కు సంబంధం ఏమిటి డీఎంకే నేతలు ప్రశ్నించారు. దీనికి బీజేపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చారు. పవన్ మురుగన్ భక్తుడని, యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు సిద్ధార్ స్థాపించిన గోరఖ్‌పూర్ మఠం అధిపతి అని సమాధానమిచ్చారు. ఈ వివాదం డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని రెచ్చగొట్టింది.