
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీమ్ మునీర్ కు చేదు అనుభవం ఎదురైంది. సొంత దేశానికి చెందిన వారే అతడిని తీవ్రంగా అవమానించారు. దీంతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు మునీర్ కు. అమెరికాలో ఐదు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. అసలు అసీమ్ మునీర్‌పై ఎందుకు ఇంత వ్యతిరేకత? భారతీయులతో పాటు పాకిస్థాన్ ప్రజలు మునీరపై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు..? జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడితో మునీర్‌కు సంబంధం ఏమిటి?
అమెరికాలో పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీమ్ మునీర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఐదు రోజుల పర్యటన కోసం వచ్చిన మునీర్కు .. అతడు బస చేసిన హోటల్ వద్ద షాక్ తగిలింది. పాక్ సంతతి అమెరికన్లు, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతు దారులు మునీర్ కు చుక్కలు చూపించారు. షేమ్ ఆన్ యూ, మాస్ మర్డరర్, డిక్టేటర్, ఇస్లామాబాద్ హంతకుడు అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాము పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్నాం, తమకు మాట్లాడే హక్కు ఉందని అధికారులతో వాదించాడు. ప్రచారం కోసం వాడే వాహనాల బిల్‌బోర్డ్‌లపై మాస్ మర్డరర్ అసీమ్ మునీర్ , గన్స్ మాట్లాడితే డెమోక్రసీ చస్తుంది, మునీర్, నీ టైమ్ అయిపోయింది, పాకిస్థాన్ మేల్కొంటోంది అని రాసి ఉంది. ఈ ఆందోళనలు మునీర్‌కు, అతడి మద్దతు దాడులకు ఇబ్బంది కరంగా మారాయి.
అసీమ్ మునీర్‌పై ఈ వ్యతిరేకత ఎందుకు? పాకిస్థాన్‌లో మునీర్ చర్యలే ఈ నిరసనలు కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ తో పాటు పాకిస్థాన్ లోను మునీర్ పై చాలా వ్యతిరేకత ఉంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత, మునీర్ ఆదేశాలతో PTI కార్యకర్తలపై దాడులు చేశారని.. అన్యాయంగా చాలా మందిని అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వేల మంది PTI మద్దతుదారులను అరెస్ట్ చేశారు, కొందరిని టార్చర్ చేశారని, మరికొందరు అదృశ్యమయ్యారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో మునీర్ రిగ్గింగ్ చేశారని, ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయాల నుంచి బ్యాన్ చేయించారని PTI ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్‌లో పవర్ కట్‌లు, ఇంధన కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మునీర్ మాత్రం కేవలం కాశ్మీర్‌పై దృష్టి పెట్టారని విమర్శిస్తున్నారు.
మునీర్‌ను సైకోపాత్, వార్ క్రిమినల్ అని ఇమ్రాన్ పార్టీ నాయకులు పిలుస్తున్నారు. మునీర్ పాకిస్థాన్‌లో వేల మంది ప్రజలను, జర్నలిస్టులను చంపించారని, ఆప్ఘనిస్థాన్‌లో నిరపరాధులైన పిల్లలు, మహిళలపై దాడులు చేయించారని ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని, రూల్ ఆఫ్ లా, స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం పోరాడుతున్న పాక్ ప్రజలను, విదేశాల్లోని పాక్ సంతతిని ISI, మునీర్ టార్గెట్ చేస్తున్నాయని చెప్తున్నారు. మునీర్ స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్‌లో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు మునీర్ అంతర్జాతీయ ఇమేజ్‌ను దెబ్బతీశాయి.
మునీర్ అమెరికా పర్యటన ఎందుకు వివాదాస్పదమైంది? మునీర్ యూఎస్ ఆర్మీ 250వ వార్షికోత్సవ పరేడ్‌కు హాజరవుతారని మొదట ప్రచారం జరిగింది. కానీ, వైట్ హౌస్ ఏ విదేశీ సైనిక నాయకుడినీ ఆహ్వానించలేదు అని స్పష్టం చేసింది. మునీర్ యూఎస్ సెంట్‌కామ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా ఆహ్వానంతో అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. పాక్-యూ.ఎస్. మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం. కానీ, అమెరికా మునీర్‌తో కాదు, పాక్ డెమోక్రటిక్ ప్రభుత్వంతో మాట్లాడాలి అని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు మునీర్ భద్రత కోసం ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉంటుండగా.. ఆయన ఏర్పాటు చేసిన డిన్నర్‌కు చాలా మంది గెస్ట్‌లు రాలేదు.
మునీర్ పర్యటన ఎందుకు ముఖ్యం? పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. 2023లో ద్రవ్యోల్బణం 37%కి చేరింది. IMF బెయిలౌట్‌లపై ఆధారపడుతున్న పాక్‌కు అమెరికా సపోర్ట్ కీలకం. కానీ, మునీర్ మానవ హక్కుల ఉల్లంఘనలు, ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో యూఎస్. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భారత్ ఇటీవల గ్లోబల్ డిప్లొమసీలో బలంగా ముందుకెళ్తుండటంతో, పాక్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అయితే, మునీర్ వివాదాస్పద చర్యలు, పహల్గామ్ దాడి నేపథ్యం, ఆందోళనలు ఈ పర్యటనను ఇబ్బందికరంగా మార్చాయి.
పహల్గామ్ ఉగ్రదాడితో మునీర్‌కు సంబంధం ఏమిటి? ఈ ఘటన తర్వాత భారత్ లో మునీరపై తీవ్ర వ్యతిరేకత ఎందుకొచ్చింది..? ఈ ఏడాది ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను కిరాతకంగా చంపేశారు. ఈ దాడికి ముందు, మునీర్ ఓ సమావేశంలో కాశ్మీర్ పాకిస్థాన్ జీవనాడి అని, భారత ఆధిపత్యాన్ని అంగీకరించమని ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం ఉగ్రదాడికి పరోక్షంగా ప్రేరణగా నిలిచిందని భారత్ ఆరోపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం జరిగినా, పాక్ ప్రభుత్వం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేసింది. దీన్ని చారిత్రాత్మక విజయం అని ప్రచారం చేసుకుంది. ఈ దాడి కారణంగా మునీర్‌పై అంతర్జాతీయంగా విమర్శలు పెరిగాయి.
అయితే మునీర్ అమెరికా పర్యటనపై ట్రంప్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా ఆర్మీ డే వేడుకులకు మునీర్ ను పిలిచారని .. పాకిస్థాన్ మీడియా గొప్పులు చెప్పుకుంది. దీనిపై భారత్ లో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇది పెద్ద అవమానంగా భావించిన భారత్.. అమెరికా తీరును కూడా విమర్శించింది. అయితే మునీర్ ను తాము ఆర్మీ డే వేడుకలకు ఆహ్వానించలేదని అమెరికా క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఇదంతా పాకిస్థాన్ మీడియా ఆడిన డ్రామా అని తేలిపోయింది. అయితే మునీర్ కు పేవర్ గా వ్యవహరిస్తే భారత్ తో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాకు తెలుసు.. అందుకే మునీర్ ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.