అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం ఏం అయ్యి ఉండొచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారు..? పక్షుల వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? లేక సాంకేతిక సమస్యా..? బోయింగ్ విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు రావడానికి కారణం ఏంటి..? గతంలో జరిగిన విమాన ప్రమాదాలు ఏంటి..?

విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఓ కారణమైతే పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాలకే ఘోర ప్రమాదానికి గురయ్యింది . ఇందుకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిని ఉండొచ్చని ప్రాథమికంగా కనిపిస్తోంది. టేకాఫ్‌ సరిగా కాలేదు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజీలో కనిపించింది. పైలట్‌ వెంటనే మేడే కాల్‌ ఇచ్చారు. ఇంజిన్‌ శక్తి కోల్పోవడం లేదా విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భంలోనే ఇలా జరుగుతుంది.

ప్రమాదానికి గురైన విమానాన్ని 11 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. మీర అంత పాతది కూడా కాదు. అందుకే ప్రమాదానికి సాంకేతిక సమస్య కారణం కాకపోయి ఉండవచ్చని విమానయాన నిపుణులు అంటున్నారు. ఎయిర్‌పోర్టు పక్కనే నివాస స్థలం కావడం, ఆ ప్రాంతంలో పక్షులు ఉండే అవకాశం ఉండొచ్చంటున్నారు. అయితే, ప్రమాదానికి ఇది కూడా ఓ కారణం అయి ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. అసలు వాస్తవాలన్నీ దర్యాప్తులోనే బయటపడతాయని అంటున్నారు. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ ప్రకారం విమానాలను పక్షి ఢీకొట్టే ఘటనల్లో 92 శాతం అంతగా ప్రమాదం లేనప్పటికీ.. మిగతా 8 శాతం మాత్రం తీవ్ర ప్రమాదాలకు కారణం కావొచ్చు. దీనికి తోడు ఫ్లైట్‌రాడార్‌ 24 డేటా ప్రకారం.. ప్రమాదానికి ముందు విమానం కేవలం 625 అడుగుల ఎత్తువరకే వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, సుదూర ప్రయాణానికి వెళ్లే ఆ విమానంలో ఇంధనం కూడా భారీగానే ఉంటుంది. ప్రమాదానికి ముందు విమాన దృశ్యాలను చూస్తుంటే.. ఎత్తుకు వెళ్లేందుకు బదులుగా విమానం వేగంగా నేల వైపు దూసుకెళ్లింది. ఇలా భారీ పరిమాణం, బరువు ఉన్న విమానం ఆ ఎత్తులో సిగ్నల్‌ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు.

అటు ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్‌ విమానాల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డ్రీమ్‌లైనర్‌లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా.. విమానం కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్‌ రూపొందించిన వైడ్‌ బాడీ మోడల్స్‌లో 787-8 డ్రీమ్‌లైనర్‌ ఒకటి. ఇందులో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించొచ్చు. 2011లో బోయింగ్‌ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌లైన్‌ సంస్థలు సుదూర ప్రయాణాలకు ఈ విమానాలను వినియోగిస్తుంటాయి. ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ నాన్‌స్టాప్‌గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రధాన నగరాల మధ్య నాన్‌-స్టాప్‌ ప్రయాణాలకు ఈ మోడల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది. అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకొంటుంది. పర్యావరణహితమైనదిగా దీనికి పేరుంది. అయితే బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. బోయింగ్‌ 777, 787 డ్రీమ్‌లైనర్‌ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలున్నాయి. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపేయాలని నిపుణులు కొందరు డిమాండ్ చేశారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలను బోయింగ్‌ కొట్టిపారేసింది. తాజా ఘటనపై లోతైన దర్యాప్తు జరిగాక ఈ ఆరోపణలకు సంబంధం ఉందా లేదా అనేది తేలుతుంది. ప్రమాద ఘటనతో బోయింగ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. షేరు ధర సుమారు 197.3 డాలర్లకు పడిపోయింది. ఈ ప్రమాదం బోయింగ్ భద్రతా ప్రమాణాలపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో 2018, 2019 ప్రమాదాల సమయంలో కూడా బోయింగ్ షేర్లు ఇదే స్థాయిలో పడిపోయాయి. ఈ సంఘటనలు బోయింగ్ మార్కెట్ విలువను బిలియన్ల డాలర్లలో తగ్గించాయి. 2019లో షేరు ధర గరిష్ఠంగా 430.30 డాలర్లు ఉండగా, ఈ ప్రమాదాల తర్వాత గణనీయంగా తగ్గింది.

మరోవైపు బోయింగ్ విమానాలు గతంలో ప్రమాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. 1970 నుంచి ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. వీటిలో సాంకేతిక లోపాలు, పైలట్ తప్పిదాలు, వాతావరణ సమస్యలు, ఉగ్రవాద దాడుల కారణాలుగా ఉన్నాయి. 2018లో ఇండోనేషియాలో లయన్ ఎయిర్ ఫ్లైట్, 2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ విమానాలు కూలిపోయాయి. ఈ రెండు ప్రమాదాలు సాఫ్ట్‌వేర్ లోపం వల్ల జరిగాయి, దీంతో బోయింగ్ విమానాలపై ప్రజల్లో విశ్వాసం తగ్గింది. ఇక గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారీ విమాన ప్రమాదాలు చూస్తే, 2015లో జర్మన్‌వింగ్స్ ఫ్లైట్ ఫ్రాన్స్‌లో కూలిపోయింది. 2020లో కేరళలోని కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ కూలి 19 మంది మరణించారు. 2023లో నేపాల్‌లో యతి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కూలిపోయిన ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు భారతదేశంలో గత 50 ఏళ్లలో 50కి పైగా విమాన ప్రమాదాలు జరిగాయి. 1976లో ముంబైలో ఎయిర్ ఇండియా ఫ్లైట్, 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉగ్రవాద దాడిలో కూలి 329 మంది మరణించారు, ఇది భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఘటన. 1990లో బెంగళూరులో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్, 2010లో మంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్, 2020లో కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యాయి. భారతదేశంలో విమానయాన భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరింత కఠినమైన భద్రతా ప్రమాణాలు, సాంకేతిక మెరుగుదలలతో ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చు.