
పహల్గామ్ ఉగ్రవాది తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ తో ఆ ఆవేశం కాస్త చల్లారింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసం.. సైనిక స్థావరాలను భారత ఆర్మీ చిత్తు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాల్పుల విరమణ ప్రకటన వచ్చిందో .. భారతీయుల్లో ఏదో అసంతృప్తి మన దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్న పాకిస్థాన్ ను ఎందుకు అంత తేలిగ్గా వదిలేశారనే ప్రశ్న.. ? దీంతో ఈ కోపం వేరే విధంగా తీర్చుకుంటున్నారు..? ఇంతకీ భారతీయులు పాకిస్థాన్ పై కోపాన్ని ఎలా తీర్చుకుంటున్నారు..? దీని వల్ల మన సమస్య తీరుతుందా..?
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఆ తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగాగా పాకిస్థాన్ భారత నగరాలపై దాడులకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది. భారత్ పాకిస్థాన్ పై కూడా ప్రతీకార దాడులు చేసి.. ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా? అనే చర్చ కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అప్పటి వరకు పాకిస్థాన్ కు బుద్ధి చెబుతారనే ఆలోచనలో ఉన్న భారతీయులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారే చర్చ జోరందుకుంది. కొందరు అసలు ఎందుకు కాల్పుల విరమణ చేసుకున్నారని విమర్శలు కూడా చేశారు. అయితే దేశ రక్షణ.. కొన్ని పరిస్థితుల కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగొచ్చు.. దానికి భారత్ ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదు. దీనిని గ్రహించిన ప్రజలు పాకిస్థాన్, దానికి మద్దతు ఇచ్చిన దేశాలపై వేరే విధంగా పగ తీర్చుకుంటున్నారు. శత్రుదేశాలకు వేరే విధంగా బుద్ధి చేప్పే ప్లాన్స్ వేశారు.
టర్కీ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో భారతీయులు ఆ దేశంపై పీకల వరకు కోపంతో ఉన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్థాన్‌ను సోదర దేశంగా పిలిచి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చాడు. భారత్ పై విషం కక్కాడు. 2023లో టర్కీ భూకంపం సమయంలో భారతదేశం ఆపరేషన్ దోస్త్ ద్వారా సహాయం అందించినప్పటికీ, టర్కీ భారత్ వ్యతిరేక చర్యలు భారతీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో #BoycottTurkey హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు భారతీయులు పర్యాటకం, ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత్‌లోని పెద్ద ట్రావెల్ పోర్టల్‌లలో ఒకటైన మేక్‌మైట్రిప్ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లే భారత్ టూరిస్టులు వెళ్లకుండా తమ పోర్టల్ లో మార్పులు చేసింది. దీని ద్వారా టర్కీ టూరిస్టుల బుకింగ్స్ 60 శాతం పడిపోయాయి. ఇప్పుటికే బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకున్నారు. చాలామంది తాము, తమ స్నేహితులు, బంధువులు దేశభక్తితో టర్కీ, అజర్‌బైజాన్ టికెట్లను రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. కొందరు టర్కీ బదులు గ్రీస్, ఆర్మేనియాకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. అటు టర్కీకి చెందిన యాపిల్స్, బంగారు ఆభరణాలను భారత్ లో విక్రయించకుండదని నిర్ణయించుకున్నారు. భారతీయ విమానాశ్రయాల్లో టర్కీకి చెందిన ఓ సంస్థ చేపడుతున్న పనులకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అటు టర్కీతో పాటు అజర్‌బైజాన్ కూడా ఆపరేషన్ సిందూర్‌ను ఖండిస్తూ, పాకిస్థాన్‌తో సంఘీభావం ప్రకటించడంతో భారతీయుల బహిష్కరణ జాబితాలో చేరింది. అజర్‌బైజాన్ విదేశాంగ శాఖ పాకిస్థాన్ పై భారతదేశం దాడులను విమర్శించి, శత్రుదేశానికి మద్దతు ఇచ్చింది. ఈ చర్యలతో #BoycottAzerbaijan హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2024లో 2.44 లక్షల భారతీయ పర్యాటకులు అజర్‌బైజాన్‌ను సందర్శించారు. ఇది ఆ దేశ టూరిజం ఆదాయంలో 9% వాటాను కలిగి ఉంది. బహిష్కరణ పిలుపుల తర్వాత, అజర్‌బైజాన్‌కు టూరిజం బుకింగ్‌లు 30%, టర్కీకి 22% తగ్గాయి. భారత ట్రావెల్ సంస్థలైన మేక్‌మైట్రిప్, ఈజీమైట్రిప్, ఇక్సిగో, కాక్స్ అండ్ కింగ్స్ బుకింగ్‌లను నిలిపివేశాయి. ఈ బహిష్కరణలు అజర్‌బైజాన్ ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా టూరిజం, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
2024లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చైనా-సానుకూల వైఖరి తీసుకోవడంతో #BoycottMaldives ఉద్యమం ద్వారా భారతీయ పర్యాటకులు ఆ దేశ టూరిజం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. దీంతో ముయిజ్జూ తన వైఖరిని సరిచేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు టర్కీ కూడా ఇలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. మాల్దీవులకు భారతీయులు బుద్ధిచెప్పినట్టు టర్కీకి కూడా బుద్ధి రావాలని అంటున్నారు. 2024లో 3.3 లక్షల భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని ఆ దేశానికి తెచ్చిపెట్టారు. ఇప్పుడు #BoycottTurkishProducts హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశానికి చుక్కలు చూపించాలని పనిగా పెట్టుకున్నారు. టర్కీ యాపిల్స్, మార్బుల్ దిగుమతులను వ్యాపారులు బహిష్కరించారు. భారతదేశంలోని పలు విమానాశ్రయాలలో సేవలు అందించే టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ లైసెన్స్‌ను జాతీయ భద్రతా కారణాలతో రద్దు చేశారు. దీంతో దాని షేర్లు 10% క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, జేఎన్‌యూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం టర్కీతో సంబంధాలను నిలిపివేసింది. ఇది రూ.700 కోట్ల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తోంది.
భారతీయ సోషల్ మీడియాలో టర్కీ, అజర్‌బైజాన్‌తో సంబంధం ఉన్న సెలబ్రిటీలు, సినిమాలపై కూడా బహిష్కరణ పిలుపులు వచ్చాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ జాతీయ గర్వానికి చిహ్నంగా మారినప్పటికీ, కొందరు ప్రముఖ బాలీవుడ్ తారలు ఈ సంఘటనపై మౌనం వహించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్స్ పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై బహిరంగంగా స్పందించకపోవడం నెటిజన్లకు కోపం తెప్పించింది. పాకిస్థాన్ అభిమానులను కాపాడుకోవాలనే లక్ష్యంతో పెద్ద స్టార్స్ వీటిపై స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తారలకు పాకిస్థాన్‌లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని పేర్కొన్నాయి. ఆమిర్ ఖాన్ తన సినిమా సితారే జమీన్ పర్ విడుదల సమయంలోనే దేశభక్తి వ్యాఖ్యలు చేయడం, అంతకు ముందు మౌనంగా ఉండటం విమర్శలకు కారణమైంది. సితారే జమీన్ పర్ సినిమా #BoycottSitaareZameenPar హ్యాష్‌ట్యాగ్‌తో బహిష్కరణకు గురైంది. ఆమిర్ 2020లో లాల్ సింగ్ చడ్డా షూటింగ్ కోసం టర్కీ వెళ్లి, అక్కడి ఫస్ట్ లేడీ ఎమినె ఎర్డోగాన్‌తో ఫోటోలు దిగాడు. ఆ ప్రభావం ఇప్పుడు అమిర్ ఖాన్ సినిమాపై పడింది. ఆపరేషన్ సిందూర్‌ను దారుణంగా విమర్శించిన పాకిస్థాన్ స్టార్స్ పై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తారలు బాలీవుడ్‌లో కపూర్ అండ్ సన్స్, సనమ్ తేరీ కసమ్ వంటి సినిమాల్లో పనిచేసినవారు కావడంతో, వారి వ్యాఖ్యలు భారతీయులను మరింత రెచ్చగొట్టాయి. అయితే బాలీవుడ్ స్టార్స్ వీరి వ్యాఖ్యలను ఖండించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. భారత సినిమాల్లో పనిచేసి, ఇప్పుడు భారత్‌ను విమర్శిస్తున్న వీరిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. అటు పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చిన దేశాలను.. మద్దతు పలికిన వారిని భారతీయులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.