
మేడిన్ చైనా అనగానే మనకు గుర్తకు వచ్చే నెల రోజుల కంటే ఎక్కువ పనిచేయదని.. ఇది వస్తువల విషయంలోనే కాదు .. సైనిక ఆయుధాలు.. క్షిపణుల విషయంలో కూడా రుజువైంది. భారత్, చైనా ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన చైనా మేడర్ PL-15 క్షిపణి తుస్సుమంది. భారత్ పై ఈ క్షిపణిని పాకిస్థాన్ ప్రయోగించినా.. మార్గమధ్యలోనే పడిపోయింది. పాకిస్థాన్ ఎంతో గొప్పగా చెప్పుకున్న ఈ క్షిపణి ఎందుకు విఫలమైంది..? భారత్ కు దొరికిన దీని శకాలాల ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే.. చైనా టెక్నాలజీ గుట్టురట్టేనా..? PL-15 టెక్నాలజీ సీక్రెట్స్ భారత్ నుంచి అమెరికాకు చేరుతుందని చైనా భయపడుతోందా.?
భారత్, పాకిస్తాన్ మధ్య పోరులో పాకిస్తాన్ సైన్యం చైనా తయారు చేసిన PL-15 క్షిపణులను ఉపయోగించినట్లు తెలిసింది. వీటిని ఎయిర్ టూ ఎయిర్ దాడి కోసం వినియోగిస్తారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల సమయంలో మన సరిహద్దుల్లో పడిపోయిన PL-15 క్షిపణి శిథిలాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ చూపించారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో సేకరించిన PL-15 లాంగ్ రేంజ్ క్షిపణి శిథిలాలు, ముఖ్యంగా దాదాపు పూర్తిగా ఉన్న వెనుక భాగం, భారత భూభాగంలో పడినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యం టర్కీ డ్రోన్‌లతో పాటు ఈ క్షిపణులను ఉపయోగించడం ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య గొడవల్లో చైనా పేరు మొదటిసారి బయటపడింది.
PL-15 అనేది చైనా తయారు చేసిన యాక్టివ్ రాడార్ గైడెడ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. ఇది అమెరికా తయారుచేసిన AIM-120D అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ క్షిపణి టెక్నాలజీకి తగ్గట్టు రూపొందించబడింది. చైనా వైమానిక దళం ఈ క్షిపణిని ఉపయోగిస్తుంది. దీని ఎగుమతి వెర్షన్, PL-15E, 145 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్ కలిగి ఉంది. ఈ వెర్షన్‌ను పాకిస్తాన్ JF-17, J-10 ఫైటర్ జెట్‌లలో ఉపయోగిస్తున్నారు. చైనా సైన్యం ఉపయోగించే దేశీయ వెర్షన్ 300-500 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉందని చెబుతున్నారు. ఈ క్షిపణిని చైనాలోని లుయోయాంగ్‌లో ఉన్న చైనా ఎయిర్‌బోర్న్ మిసైల్ అకాడమీ అభివృద్ధి చేసింది. 2011లో దీనిని పరీక్షించారు, 2015లో చైనా సైన్యంలో చేర్చారు. చైనా చెంగ్డూ J-10C, షెన్‌యాంగ్ J-16, చెంగ్డూ J-20 విమానాలలో ఈ క్షిపణి కనిపించింది. ఏప్రిల్ 26న, పాకిస్తాన్ వైమానిక దళం JF-17 విమానాలు PL-15E, PL-10 క్షిపణులతో ఉన్న ఫోటోలను విడుదల చేసింది. పాకిస్తాన్ వద్ద సుమారు 45 నుంచి 50 JF-17, 20 వరకు J-10 విమానాలు ఉన్నాయి. అంటే సుమారు 70 విమానాలు PL-15Eని ప్రయోగించగలవు.
భారత్ వద్ద PL-15కి సమానమైన క్షిపణి MBDA మీటియోర్ అని చెప్పొచ్చు. రామ్‌జెట్ ఇంజన్‌తో పనిచేసే మీటియోర్ క్షిపణి.. చైనా PL-15 కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంది. PL-15, మీటియోర్ మాగ్జిమంమ్ రేంజ్ సమానంగా ఉందని చెప్పినప్పటికీ, మీటియోర్ రామ్‌జెట్ ఇంజన్ వల్ల దీనికి చాలా ఎక్కువ నో-ఎస్కేప్ జోన్ ఉంది. అంటే శత్రు విమానం మీటియోర్ దాడి నుంచి చివరి దశలో తప్పించుకునే అవకాశం తక్కువ. శత్రువు చివరి దశలో తీవ్రమైన యుక్తులతో తప్పించుకునే ప్రయత్నం చేసినా మీటియోర్ నుంచి తప్పించుకోలేడు. కాని PL-15 నుంచి తప్పించుకోవచ్చు . భారత్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా మీటియోర్ క్షిపణి మన అమ్ముల పొదిలో చేరింది. భారత వైమానిక దళం ఆంగ్లో-ఫ్రెంచ్ కంపెనీ MBDAతో మీటియోర్ క్షిపణిని భారత్‌లో తయారు చేసిన యుద్ధ విమానాలలో ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. ఇక భారత్ వద్ద PL-15ని ఎదుర్కోవడానికి ఆస్ట్రా క్షిపణి ఉంది. ఇది భారత్ మొదటి స్వదేశీ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని ఉత్పత్తి చేసింది. DRDO ప్రకారం, ఆస్ట్రా 61 మైళ్ల రేంజ్‌లో అత్యంత చురుకైన, సూపర్‌సోనిక్ లక్ష్యాలను ఛేదించగలదు. ఇది మాక్ 4.5 వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణి ఇనర్షియల్ గైడెన్స్, డేటాలింక్ ద్వారా మిడ్‌కోర్స్ అప్‌డేట్స్, చివరి దశలో యాక్టివ్ రాడార్ సీకర్‌ను ఉపయోగిస్తుంది. శత్రు జామింగ్‌ను తట్టుకునేందుకు ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్‌మెజర్స్ సామర్థ్యం కూడా ఉంది. ఈ క్షిపణులను Su-30MKI విమానాల్లో ఉపయోగిస్తున్నారు. ఇక చైనా PL-15ని ఎదుర్కోవడానికి భారత్ వద్ద మరో ఆయుధం ఇజ్రాయెల్ తయారు చేసిన రాఫెల్ డెర్బీ క్షిపణి. ఇది తేజస్ విమానాల ద్వారా మాత్రమే ఉపయోగించబడుతుంది. భారత్ ఉపయోగించే డెర్బీ ER వెర్షన్ 61 మైళ్ల మాగ్జిమమ్ రేంజ్‌లో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణులు భారత వైమానిక దళానికి PL-15 వంటి శత్రు క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని ఉపయోగించింది. అయితే, ఈ క్షిపణి భారత వైమానిక దళం రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో విఫలమైంది. దీని ఫలితంగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఇది కూలిపోయింది. అయితే PL-15 క్షిపణి విఫలమవడానికి చాలు కారణాలు ఉన్నాయి. భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ముఖ్యంగా S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ, రాడార్ జామర్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, PL-15 యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ ఎరే రాడార్ సీకర్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఈ వ్యవస్థలు క్షిపణి గైడెన్స్ సిస్టమ్‌ను గందరగోళానికి గురిచేసి, లక్ష్యాన్ని గుర్తించకుండా చేశాయని చెబుతున్నారు. ఇక PL-15E క్షిపణిలో లక్ష్యాన్ని చేరుకునే ముందు ఇంధనం అయిపోయి ఉండవచ్చు. దీని వల్ల క్షిపణి శక్తిని కోల్పోయి భారత భూభాగంలో పడిపోయింది. ఇక ఈ క్షిపణి యుద్ధ సామర్థ్యం ఇప్పటివరకు యుద్ధ పరిస్థితులలో పరీక్షించలేదు. అందుకే PL-15 పనితీరుపై సందేహాలు ఉన్నాయి. పాకిస్తాన్ రాడార్, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు భారత్ కు చెందిన స్టెల్త్ టెక్నాలజీతో కూడిన రాఫెల్, సుఖోయ్ విమానాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. దీని వల్ల PL-15E క్షిపణులు లక్ష్యాన్ని సరిగా ట్రాక్ చేయలేకపోయాయి. భారత్ ఈ దాడులను ఎదుర్కోవడంలో తన రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించింది. S-400 వ్యవస్థతో పాటు, L-70 గన్స్, జు-23మిమీ, షిల్కా రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకున్నాయి.
భారత్ మీటియోర్ క్షిపణులు.. PL-15E కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. హోషియార్‌పూర్‌లో లభ్యమైన PL-15E శకలాలు, ముఖ్యంగా PL-15E సీకర్ సెక్షన్, ప్రొపల్షన్ యూనిట్, డేటాలింక్, ఇనర్షియల్ రిఫరెన్స్ యూనిట్ వంటి కీలక భాగాలు DRDOకు అప్పగించారు . ఈ శిథిలాలు చైనా క్షిపణి ఎలక్ట్రానిక్ జామింగ్‌ను తట్టుకునే సామర్థ్యం, గైడెన్స్ అల్గారిథమ్‌లు, ఇంధన సామర్థ్యం గురించి భారత్‌కు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ సమాచారం ఆస్ట్రా క్షిపణి వంటి భారత్ స్వదేశీ BVR క్షిపణులను మెరుగుపరచడానికి, PL-15Eని ఎదుర్కోవడానికి కౌంటర్‌మెజర్స్ అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అదనంగా, ఈ శిథిలాలను అమెరికాతో పంచుకోవడం ద్వారా భారత్-అమెరికా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయవచ్చు, ఎందుకంటే PL-15 చైనాతో భవిష్యత్ ఘర్షణలలో అమెరికా వైమానిక దళానికి సవాలుగా మారుతుంది. ఇప్పుడు PL-15Eని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా సైనా టెక్నాలజీని తెలుసుకోవచ్చు. దీంతో ఈ సమాచారం అమెరికాకు ఎక్కడ వెళ్లిపోతుందా అని చైనా ఆందోలన చెందుతోంది. అటు పాకిస్థాన్ కూడా చైనా మేడ్ PL-15Eపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సకమ్రంగా పనిచేయని నాసిరకం మిస్సైళ్లను తమకు చైనా అంటగట్టిందని మండిపడుతోంది.