
భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ, ఢిల్లీలో కరోనా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కరోనా వేరియంట్ ప్రభావం ఎలా ఉంది..? ఇది ఎంత వరకు ప్రమాదం..? వైద్యులు ఏం అంటున్నారు..? కేంద్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది..? తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితి ఏంటి..?
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, గతంలోని తీవ్రమైన దశలతో పోలిస్తే పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెలలోనే వెయ్యికంటే ఎక్కువ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత కేసులు సాధారణంగా తేలికపాటి లక్షణాలతో ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా కేరళలో నమోదవుతున్నాయి. ఇక్కడ సుమారు 400కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో , కర్ణాటక, గుజరాత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత కొన్ని వారాల్లో కేసుల సంఖ్యలో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ, ఆరోగ్య నిపుణులు ఈ వైరస్ తీవ్రత గతంలోని డెల్టా వేరియంట్ తో పోలిస్తే తక్కువగా ఉందని చెబుతున్నారు.
కేరళలో కరోనా కేసులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయి. మే నెలలో 400 కు పైగా కొత్త యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయి. కేరళ గతంలో కూడా కరోనా కేసులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన రికార్డ్ ఉంది. దీనికి కారణం కేరళలోని బలమైన ఆరోగ్య వ్యవస్థ, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో కరోనా జాగ్రత్తలను కొనసాగిస్తూ, కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచారు. అటు ఢిల్లీలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వందకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆసుపత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్, అవసరమైన మందులు, వ్యాక్సిన్‌ల అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. అన్ని పాజిటివ్ శాంపిల్‌లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లోక్ నాయక్ ఆసుపత్రికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ, లక్షణాలు తేలికగా ఉండటం వల్ల పెద్దఎత్తున ఆంక్షలు విధించలేదు. అయితే, రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశంలో కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, ICMR ద్వారా నిరంతర సర్వైలెన్స్ కొనసాగుతోంది. ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌లను, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తీసుకోవాలని కేంద్రం సిఫారసు చేస్తోంది. అలాగే, పాజిటివ్ కేసులను గుర్తించి, వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా పరీక్షించి కొత్త వేరియంట్‌లను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలోని లాక్‌డౌన్ వంటి కఠిన ఆంక్షలు ప్రస్తుతం అవసరం లేదని, కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా కేసులకు ప్రధానంగా JN.1 సబ్-వేరియంట్, అలాగే LF.7, NB 1.8 వంటి వేరియంట్‌లు కారణమని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్‌లు ఒమిక్రాన్ జాతికి చెందినవి, గతంలోని డెల్టా వేరియంట్‌తో పోలిస్తే తక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. JN.1 వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఇది ఎక్కువగా తేలికపాటి రోగ లక్షణాలను కలిగిస్తోంది. గతంలోని డెల్టా వేరియంట్‌లా వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌లలో కనిపించడం లేదు. అయితే, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే సామర్థ్యం ఈ వేరియంట్‌లకు ఉందని, అందుకే బూస్టర్ డోస్‌లు తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వ్యాక్సిన్‌లు తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించడంలో సమర్థవంతంగా ఉన్నాయని, కానీ పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోలేవని తెలుస్తోంది. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని, ఏడు రోజుల పాటు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. పిల్లలను లక్షణాలతో స్కూళ్లకు పంపొద్దని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌లు తీసుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రావెల్ ఆంక్షలు లేనప్పటికీ, అనవసర ప్రయాణాలను నివారించాలని, ముఖ్యంగా రిస్క్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అటు మే నెలలో సింగపూర్, హాంకాంగ్‌లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగాయి. ఇది తూర్పు ఆసియాలో కొత్త కరోనా వేవ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌లో ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు కేసులు 30 శాతం పెరిగాయి. రోజువారీ ఆసుపత్రి అడ్మిషన్లు 102 నుంచి 133కి పెరిగాయి. అయితే ఐసీయూ కేసులు 3 నుంచి 2కి తగ్గాయి. కరోనా పెరుగుదలకు ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సింగపూర్‌లో ప్రస్తుతం ఓమిక్రాన్ జేఎన్.1 వేరియంట్ నుంచి ఉద్భవించిన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్లు మూడింట రెండు వంతుల కేసులకు కారణమవుతున్నాయి. అధికారులు వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు బూస్టర్ షాట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. హాంకాంగ్‌లో కూడా వైరస్ యాక్టివిటీ గత ఏడాది కంటే గరిష్ఠ స్థాయిలో ఉంది. మార్చి ప్రారంభంలో 33 యాక్టివ్ కేసులు ఉంటే.. మే నెలల వెయ్యి దాటింది. హాంకాంగ్‌లో శ్వాసకోశ నమూనాలలో పాజిటివిటీ రేటు ఏప్రిల్ మధ్యలో 6.21% నుంచి మే 10 నాటికి 13.66%కి పెరిగింది. మురుగునీటిలో వైరల్ లోడ్ పెరగడం కమ్యూనిటీ వ్యాప్తిని సూచిస్తోంది. అధికారులు మాస్క్ ధరించడం, రద్దీ ప్రదేశాలను నివారించడం, బూస్టర్ షాట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు. అలాగే చైనాలో మార్చి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఫ్లూ లాంటి లక్షణాలతో వచ్చిన రోగులలో పాజిటివిటీ రేటు 7.5% నుంచి 16.2%కి, ఆసుపత్రి అడ్మిషన్లలో 3.3% నుంచి 6.3%కి పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఇంకా పెరగడ వచ్చు.