గవర్నర్ వ్యాఖ్యలపై డీఎంకే విమర్శలు..!

DMK criticizes Governor’s remarks: తమిళ నాగరికత గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఎంతవరకు నిజం? ఇది వేదకాలం కన్నా పురాతనమా? లేక రాజకీయంగా చెప్పబడుతున్న కట్టుకథా? ఇటీవల కీళది తవ్వకాల్లో పురాతన నాగరికతకు సంబంధించి బయటపడిన ఆనవాళ్లు ఎందుకు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ రవి మధ్య మాటల యుద్ధం ఎందుకు నడిచింది..?. కీళది తవ్వకాల్లో ఏం బయటపడ్డాయి..?

తమిళ నాగరికత భారతదేశంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం, తమిళనాడులో 15 వేల బీసీ నుంచి మానవ నివాసాల ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. సంగం సాహిత్యం, తమిళ బ్రాహ్మీ లిపి ఆధారంగా 300 బీసీ నుంచి లిఖిత ఆధారాలు లభిస్తున్నాయి. కీళది తవ్వకాల్లో 580 బీసీ నాటి శాసనాలు, ఇటుక నిర్మాణాలు, నాళాలు, బావులు బయటపడ్డాయి. అడిచ్చనల్లూర్‌లో 696 బీసీ నాటి అస్థిపంజరాలు, మట్టి పాత్రలు లభించాయి. శివగలై తవ్వకాల్లో 1155 బీసీ నాటి ఇనుప పరికరాలు, ధాన్యాలు బయటపడ్డాయి. ఇవన్నీ తమిళ నాగరికత పురాతనమని నిరూపిస్తున్నాయి. కానీ ఇదే అంశంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. DMK criticizes Governor’s remarks.

అయితే కీళది తవ్వకాలు చరిత్రను మాత్రమే కాదు, రాజకీయాలను కూడా కుదిపేశాయి. 2014లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ తవ్వకాల్లో, మధ్య యుగానికి చెందిన నగర నాగరికతకు ఆధారాలు బయటపడ్డాయి. అయితే అవ్వకాలను నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త అమర్నాథ్ రామకృష్ణన్‌ను 2017లో అస్సాంలోకి బదిలీ చేయడం, ఆయన 982 పేజీల నివేదికను తిరస్కరించి తేదీలు సరిచేయాలి అని చెప్పడం వివాదానికి బీజం వేసింది. ఆయన నివేదిక శాస్త్రీయంగా సరైనది, AMS కార్బన్ డేటింగ్ ఆధారంగా ఉంది అని చెప్పినా, కేంద్రం ఇంకా ఆధారాలు కావాలి అని పట్టుబడింది. దీంతో కేంద్రం తమిళ చరిత్రను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది అని స్టాలిన్ , మంత్రులు ఆరోపించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాత్రం ఇది శాస్త్రీయ ప్రక్రియ, రాజకీయంగా చూడకూడదు అని అన్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం తవ్వకాలను స్వయంగా చేపట్టి, 11వ దశకు చేరుకుంది. మదురై కామరాజ్ యూనివర్సిటీ, హార్వర్డ్ DNA ల్యాబ్ సహకారంతో పురాతన మానవ ముఖ నిర్మాణాలను పునర్నిర్మించారు. ఈ ఫలితాలు తమిళ నాగరికత 2,500 సంవత్సరాల క్రితమే అభివృద్ధి చెందినది అని సూచించాయి. గవర్నర్ ఆర్.ఎన్. రవి మాత్రం చరిత్రను అతిశయోక్తిగా చూపకూడదు అని వ్యాఖ్యానించడంతో, స్టాలిన్ ఇది తమిళ అత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం అని తీవ్రంగా స్పందించారు. DMK విద్యార్థి విభాగం మదురైలో నిరసన చేపట్టి, పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని డిమాండ్ చేసింది.

అసలు తమిళనాడు చరిత్ర ఏంటి…?
భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధూ లోయ నాగరికతది. గంగా పట్టణ నాగరికత రెండో పట్టణ నాగరికత. గంగా పట్టణ నాగరికత కాలంలో భారత్‌లో మరే పట్టణ నాగరికతా లేదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఈ భావన తప్పని తొలిసారిగా కీళడి ఆధారాలు రుజువు చేశాయి. గంగా పట్టణ నాగరికత కాలంలోనే భారత్‌లో మరో పట్టణ నాగరికత ఉందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సింధు లోయ పట్టణ నాగరికత తర్వాత, గంగా పట్టణ నాగరికత మాదిరి దక్షిణ భారతదేశంలోనూ తమిళ్ సంగం పట్టణ నాగరికత రెండో పట్టణ నాగరికతగా విలసిల్లిందని వీటిని బట్టి చెప్పొచ్చు. తమిళ సాహిత్యం, సంస్కృతి, వాణిజ్యం, కళలకు బంగారు యుగంగా పరిగణించబడుతుంది. తొల్కాప్పియం అనే వ్యాకరణ గ్రంథం ఈ కాలంలో రచించబడింది. చేర, చోళ, పాండ్య రాజులు తమిళ భాషను, సాహిత్యాన్ని, వాణిజ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఉండటం, తమిళ శాసనాలు ఈజిప్ట్, థాయిలాండ్ వంటి దేశాల్లో కనిపించడం ఈ నాగరికత ఎంత విస్తృతంగా ఉండేదో చూపిస్తుంది. కీళది శాసనాల ప్రకారం అక్షరాలు, ఖగోళ జ్ఞానం, శాస్త్రీయ నిర్మాణాలు, మత చిహ్నాల లేకపోవడం ఇవన్నీ ఒక ఆధునిక నగర సమాజాన్ని సూచిస్తున్నాయి. శివగలై తవ్వకాల్లో 1155 బీసీ నాటి ఇనుప పరికరాలు, ధాన్యాలు బయటపడ్డాయి. తమిళనాడు ఇనుప యుగంలోకి ప్రవేశించినప్పుడు, ఉత్తర భారతదేశం ఇంకా రాగి యుగంలో ఉండేదని నివేదికలు చెబుతున్నాయి. తమిళ బ్రాహ్మీ లిపి 685 బీసీ నాటిదిగా గుర్తించబడింది. ఇది కీళది కన్నా 100 సంవత్సరాలు ముందుగా ఉంది. ఈ తవ్వకాలు తమిళ నాగరికతకు కొత్త రూపు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇనుప యుగం మొదలైనది తమిళ మట్టిలోనే అని ప్రకటించారు. ఇది కేవలం తవ్వకాలు కాదు తమిళ ఆత్మగౌరవానికి, చరిత్రకు, రాజకీయ గుర్తింపురకు బలమైన ఆధారమని అన్నారు.

డీఎంకే పార్టీ ద్రవిడ ఉద్యమానికి వారసత్వంగా తమిళ గుర్తింపును బలంగా ప్రచారం చేస్తోంది. పెరియార్ స్థాపించిన ఆత్మ గౌరవ ఉద్యమం నుంచి తమిళ భాష, సంస్కృతి, చరిత్రను కాపాడాలన్న లక్ష్యం కొనసాగుతోంది. అందుకే గవర్నర్ వ్యాఖ్యలను డీఎంకే తమిళ ఆత్మగౌరవం తగ్గించే ప్రయత్నంగా చూస్తోంది. తవ్వకాల విషయంలో కేంద్రం వేద, ఆర్య నాగరికతను ప్రాధాన్యంగా చూపిస్తే, తమిళనాడు ప్రభుత్వం ద్రవిడ నాగరికతను ముందుకు తెస్తోంది. తమిళులు తమ భాష, సంస్కృతి, చరిత్రపై గర్వపడతారు. ఇది వారి గుర్తింపు. రాజకీయ పార్టీలు ఈ భావోద్వేగాన్ని ఓటు కోసం వాడుకోవడం సర్వసాధారణం. కానీ శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలు చరిత్రను అస్పష్టంగా చేస్తాయి. చరిత్రను గౌరవించాలి, కానీ వాస్తవాలను వక్రీకరించకూడదు.

ఈ వివాదం కేవలం తవ్వకాలు గురించి కాదు. ఇది చరిత్రను ఎవరు చెప్పాలి? ఎవరి కోణంలో చెప్పాలి? అనే ప్రశ్న గురించి. కేంద్రం శాస్త్రీయ ధృవీకరణను కోరుతోంది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం — ఇది అత్మగౌరవం, తమ గుర్తింపు అంటోంది. చరిత్రను రాజకీయంగా కాకుండా, శాస్త్రీయంగా, సమగ్రంగా చూడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. చరిత్ర ఎవరిదీ కాదు అందరిదీ. దాన్ని నిజాయితీగా, పారదర్శకంగా చెప్పాలి. కీళది, శివగలై, అడిచ్చనల్లూర్ తవ్వకాల్లో భారతదేశ చరిత్రను ఉత్తర భారతదేశం నుంచి మాత్రమే కాకుండా, దక్షిణం నుంచి కూడా చెప్పవచ్చని నిరూపిస్తున్నాయి. ఇది కేవలం తవ్వకాలు కాదు ప్రజల గర్వాన్ని, ప్రాంతీయ గుర్తింపును, శాస్త్రీయ చరిత్రను కలిపే ఒక గొప్ప ప్రయోగం.

Also Read: https://www.mega9tv.com/national/nepal-pm-olis-controversial-comments-that-lord-rama-was-born-in-nepal/