
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటేసింది. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇవన్నీ బంగారం ధరలను కొండెక్కిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు, స్టాక్ మార్కెట్ పడిపోతే బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలపై ఎందుకు ఫోకస్ చేస్తాయి? ప్రపంచంలో ఎక్కువ బంగారం ఎవరి దగ్గర ఉంది? భారత్‌లో ఎంత బంగారం ఉంది?
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరలను ఆకాశానికి చేర్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సైనిక దాడి తర్వాత, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీంతో బంగారం స్పాట్ మార్కెట్‌లో ఔన్సుకు 3,428 డాలర్లకు చేరింది, ఒక్క వారంలోనే 3.5% పెరిగింది. భారతదేశంలో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,680కి చేరుకుంది, ఒక్క రోజులోనే రూ.2,200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబైలో ఈ ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ పెరుగుదల వెనుక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు, డాలర్ విలువ క్షీణత, అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల అంచనాలు కీలకంగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు బంగారం ధరలపై ఎందుకు ప్రభావం చూపుతాయి? ఆర్థిక అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా చూస్తారు. స్టాక్ మార్కెట్ కుదేలైనప్పుడు, షేర్లలో నష్టాలు రావొచ్చు, కానీ బంగారం విలువ స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది, ధరలు పైకి వెళ్తాయి. కొంత కాలంగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఈ డిమాండ్‌ను మరింత పెంచాయి. తాజా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు బంగారం రేటు పెరగడానికి కారణమయ్యాయి. భారత్‌లో బంగారం కేవలం పెట్టుబడి కాదు, సాంస్కృతిక, భావోద్వేగ విలువ కలిగిన ఆస్తి. పెళ్లిళ్లు, పండుగల్లో బంగారం కొనుగోళ్లు మరింత జోరందుకుంటాయి.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు? నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరొచ్చు, 2026 నాటికి ఔన్సుకు 4,000 డాలర్లు దాటొచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, డాలర్ బలహీనపడి, బంగారం ధరలు మరింత పెరగొచ్చు. భారత్‌లో దిగుమతి సుంకం, వ్యవసాయ సెస్, మేకింగ్ ఛార్జీలు కూడా ధరలను పెంచుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభ సమయంలో ఇది ఎంతో ఉపయోగం.
ప్రపంచ దేశాలు బంగారం నిల్వలపై ఎందుకు దృష్టి పెడుతున్నాయి? బంగారం కేవలం ఆభరణం కాదు, ఆర్థిక భద్రతకు చిహ్నం. దేశ కరెన్సీ విలువ స్థిరత్వానికి బంగారం నిల్వలు కీలకం. కరెన్సీ విలువ క్షీణిస్తే, బంగారం ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేస్తాయి. 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ 72 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి, మొత్తం 876 టన్నుల నిల్వలతో 8వ స్థానంలో నిలిచింది. ఈ నిల్వలు ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడతాయి.
ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలు ఎవరి దగ్గర ఉన్నాయి? బంగారు నిల్వల్లో 8,133 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాత జర్మనీ దగ్గర 3,351 టన్నులు, ఇటలీ దగ్గర 2,451 టన్నులు, ఫ్రాన్స్ దగ్గర 2,437 టన్నులు, రష్యా దగ్గర 2,336 టన్నులు, చైనా దగ్గర 02,27 టన్నులు బంగారం ఉంది. భారతదేశం 876 టన్నులతో 8వ స్థానంలో ఉంది. అంటే 8.76 లక్షల కిలోల బంగారం. ఈ నిల్వలు దేశ ఆర్థిక విశ్వసనీయతను పెంచుతాయి, ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
భారతదేశంలో బంగారం మొత్తం ఎంత? రిజర్వ్ బ్యాంక్ దగ్గర 876 టన్నులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ నిల్వలతో పాటు, ప్రజల దగ్గర ఉన్న బంగారం కూడా ఉంటుంది. భారత్‌లో సామాన్యులు, ముఖ్యంగా మహిళలు, పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారాన్ని కొంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం, భారత దేశంలో యావరేజ్ గా వివాహిత మహిళలు 100 గ్రాములు, అవివాహిత మహిళలు 50 గ్రాములు, పురుషులు 25 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. దీన్ని బట్టి, భారత్‌లో బంగారం ఆర్థిక, సాంస్కృతిక రెండు కోణాల్లోనూ కీలకం.