ఐఎస్ఐ ట్రాప్ .. భారతీయులు ఎలాపడుతున్నారు..? సిమ్ కార్డు ఇస్తే ఏం అవుతుంది.?

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లో దర్యాప్తు సంస్థల కన్ను.. గూఢచారులు, స్లీపర్ సెల్స్ పై పడింది. ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అరెస్టుతో.. మన దేశంలో మన వారితో గూఢచర్యం ఎలా చేయగలరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ భారతీయులను ట్రాప్ చేసి… మన దేశానికి చెందిన సీక్రెట్ విషయాలను తెలుసుకుంటోందని నిఘా వర్గాలు గుర్తించాయి.. అసలు ఐఎస్ఐ భారతీయులను ఎలా ట్రాప్ చేస్తోంది..? వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తోంది..? ఈ విషయంలో భారతీయ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి…?

న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వీసా విభాగంలో కంటికి కనిపించని ఒక కుతంత్రం నడుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ దౌత్యపరమైన రక్షణ కవచంలో దాక్కుని ఉంటారు. ఎవరైనా బలహీనమైన వ్యక్తులు కనిపిస్తే చాలు.. వారిని మాటలతో లొంగదీసుకుని వారిని సమాచారం సేకరించే గూఢచారులుగా మార్చుకుంటారు. అయితే భారతీయులను అంత సులువుగా ఐఎస్ఐ లొంగతీసుకుంటోందా..? అంటే కాదు. పాకిస్థాన్ అంటేనే భారతీయులకు చాలా అనుమానాలు ఉంటాయి. అందుకే ఆ దేశానికి చెందిన వారు ఏం చేసినా భారతీయులు కాస్త అనుమానంగానే చూస్తారు. అయితే కొంతమంది వీక్ మైండె సెట్ ఉన్న వారు మాత్రం ఐఎస్ఐ చేతికి చిక్కుతున్నారని.. భారత గూఢచార సంస్థలు, ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తులో తెలిసింది. అసలు ఐఎస్ఐ భారత్ లో ఎలా పనిచేస్తుంది.. వారు మన సమాచారాన్ని ఎలా సేకరిస్తారో భారతీయ నిఘా వర్గాలు గుర్తించాయి..

వీసా దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకునే ఐఎస్ఐ గేమ్ ప్లాన్ మొదలు పెడుతుంది.
పాకిస్తాన్ హైకమిషన్‌లోని వీసా విభాగంలో ఐఎస్ఐ ఏజెంట్లు దౌత్యవేత్తలు, వీసా అధికారులుగా మారువేషంలో ఉంటారు. వీరు వీసా దరఖాస్తుదారులకు అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తారు. ముఖ్యంగా లోకల్ సిమ్ కార్డు అడగడం, అనవసరమైన పత్రాలను సమర్పించమని కోరడం వంటివి చేస్తారు. దీని వల్ల దరఖాస్తుదారులు హైకమిషన్‌కు పదేపదే రావలసి వస్తుంది. ఈ ప్రక్రియలో ఐఎస్ఐ ఏజెంట్లు దరఖాస్తుదారుల బలహీనతలను, సహకరించే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత ఐఎస్ఐ స్పైయింగ్ ఆపరేషన్ ఒక సిమ్ కార్డు అడగడంతో మొదలవుతుంది. దరఖాస్తుదారుడు సిమ్ కార్డును అందిస్తే, వారు ఐఎస్ఐ చేతిలో ఇరుక్కుపోయినట్టే. ఒకరి సిమ్ కార్డు మరొకరికి అందించడం అనేది చాలా డేంజర్.. అదీ పాకిస్థాన్ లాంటి శత్రుదేశం వ్యక్తికి మన సిమ్ కార్డు ఇస్తే ఇక అంతే. ఒకవేళ సిమ్ కార్డు నేరుగా ఇవ్వకపోయినా.. నకిలీ పత్రాలతో, దరఖాస్తుదారు పేరుతో తీసుకుంటారు. ఒకసారి దరఖాస్తుదారుడు ఈ చిన్న తప్పు చేస్తే, ఐఎస్ఐ ఏజెంట్లు వీసా ప్రక్రియలో ఇబ్బందులు సృష్టించడం, బెదిరింపుల ద్వారా ఒత్తిడి చేయడం వంటి రెండో స్టేజ్ కు వెళ్తారు. ఈ విధంగా దరఖాస్తుదారులు గూఢచర్య కార్యకలాపాల్లోకి తమకు తెలియకుండానే లాగబడతారు.

ఐఎస్ఐ ప్రధాన లక్ష్యం భారతీయ పౌరులను గూఢచారులుగా మార్చి, మన సైనిక, ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం. బలహీనమైన వ్యక్తులను మానసికంగా ట్రాన్స్ లోకి నెట్టడం ద్వారా, ఐఎస్ఐ భారతదేశ రక్షణ, ప్రభుత్వ, ఇతర సున్నితమైన రంగాల గురించి సమాచారం సేకరిస్తోందని భారత నిఘా వర్గాల నిపుణులు చెబుతున్నారు. ఒక సారి ఐఎస్ఐ ట్రాన్స్ లోకి వెళ్లిపోతే.. సైనిక స్థావరాల ఫోటోలు తీయడం, రైళ్ల కదలికలను ట్రాక్ చేయడం వంటి పనులను చేయిస్తారు. ఈ కార్యకలాపాలు సాధారణంగా చేసే పనులతో మొదలై, క్రమంగా ప్రమాదకరమైన గూఢచర్యంగా మారుతుందని అంటున్నారు. అయితే గతంలో ఐఎస్ఐ ట్రాప్ లను ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. 2020లో ఢిల్లీ పోలీసులు అబిద్ హుస్సేన్, తాహిర్ ఖాన్ అనే ఇద్దరు వీసా అధికారులను ఒక వ్యక్తి నుంచి రహస్య పత్రాలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తించారు. ఆ తర్వాత భారతదేశం నుంచి బహిష్కరించబడ్డారు. అలాగే, 2016లో ఐఎస్ఐ ఏజెంట్ మెహమూద్ అక్తర్ కూడా వీసా అధికారిగా మారువేషంలో ఉండగా దొరికాడు. అయితే దౌత్యపరమైన రక్షణ కారణంగా తప్పించుకున్నాడు. అయితే ఇలాంటి వారిని గుర్తించడం..

గూఢచర్య కార్యకలాపాలను అరికట్టడం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. ఐఎస్ఐ ఏజెంట్లు సాధారణంగా హైకమిషన్ పరిసరాల్లోనే ఉంటారు. ఇక్కడ దౌత్యపరమైన రక్షణ వారిని కాపాడుతుంది. అయితే వారు ఒక్కోసారి హైకమిషన్ బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు వారిని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. 2020లో అబిద్ హుస్సేన్, తాహిర్ ఖాన్‌ అనే ఇద్దరు పాక్ కు చెందని వ్యక్తులు రహస్య పత్రాలు తీసుకుంటుండగా అరెస్టు అయ్యారు. 2016లో మెహమూద్ అక్తర్ అనే వ్యక్తి కూడా కూడా ఇలాంటి సందర్భంలో బయటపడ్డాడు.

తాజాగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాలు భారత్ లో మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడి తర్వాత భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలపై నిఘా పెరిగింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో 12 మంది వ్యక్తులను ఐఎస్ఐతో సంబంధం ఉన్న గూఢచర్య ఆరోపణలపై అరెస్టు చేశారు. వీరిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె పాకిస్తాన్ హైకమిషన్‌లోని ఒక అధికారితో సంబంధం కలిగి ఉందని, భారత సైనిక సమాచారాన్ని పంచుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లిందని, ఐఎస్ఐ ఏజెంట్ డానిష్‌తో సంబంధం కలిగి ఉందని పోలీసులు తెలిపారు. ఈ గూఢచర్య కార్యకలాపాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ హైకమిషన్‌లోని పలువురు వీసా అధికారులను, ఇతర అధికారులను బహిష్కరించడం ద్వారా ఐఎస్ఐ ట్రాప్ లో ఎవరు పడకుండా చేస్తోంది. ఇటీవల డానిష్ వంటి ఐఎస్ఐ ఏజెంట్లను భారతదేశం నుంచి బహిష్కరించారు. అలాగే ఐఎస్ఐ గూఢచర్యాన్ని, దాని ట్రాప్ ను ఛేదించడానికి భారత నిఘా సంస్థలు, ఢిల్లీ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు

పాకిస్తాన్ ఐఎస్ఐ భారత వీసా దరఖాస్తుదారులను గూఢచారులుగా మార్చడానికి దౌత్యపరమైన కవచాన్ని, బలహీనతలను ఉపయోగించుకుంటోంది. సిమ్ కార్డు కోరడం, వీసా ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం వంటి వ్యూహాలతో దరఖాస్తుదారులను మానసికంగా ఒత్తిడి చేసి, వారిని గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగుతోంది. ఈ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉన్నాయి. భారత గూఢచార సంస్థలు, పోలీసులు ఈ జాలాన్ని ఛేదించడానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, దౌత్యపరమైన రక్షణ కారణంగా ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేయడం సవాలుగా ఉంది. ఈ సంఘటనలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.