
భారత్ వరుసగా పాకిస్థాన్ ను అష్టదిగ్బంధనం చేస్తోంది.. యుద్ధం మొదలు పెట్టకుండానే యుద్ధం మొదలు పెట్టేసింది. ఇప్పటికే అన్ని రకాలుగా పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత భారత్, బాగ్లిహార్ డ్యామ్ ద్వారా చినాబ్ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడం వల్ల పాకిస్థాన్‌కు ఏ నష్టం వస్తుంది? ఈ సమస్య కొనసాగితే పాకిస్థాన్ ఏమవుతుంది?
పాకిస్థాన్ కు నీటి కష్టాలు మొదలయ్యాయి. భారత్ ఎన్ని సార్లు యుద్ధం చేసినా.. భారత్ కనికరించింది. నీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. కాని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానకు భారత్ జల దిగ్బంధనంతో బుద్ధి చెబుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని బాగ్లిహార్ డ్యామ్ ద్వారా చినాబ్ నదికి నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసిన భారత్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ డ్యామ్ 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి, 12.50 టీఎంసీలు నీటిని నిల్వ చేయగలదు. ఇప్పుడు ఈ డ్యామ్ గేట్లు మూసివేయడం ద్వారా పాకిస్థాన్ కు నీటిని వెళ్లకుండా చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో చినాబ్ నదిపై బాగ్లిహార్ డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ 2008 నుంచి సేవలు అందిస్తోంది. ఇది రన్-ఆఫ్-ది-రివర్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్‌గా పనిచేస్తోంది. అంటే ఇది పెద్దగా నీటిని నిల్వ చేయకుండా నది ప్రవాహాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, దీని గేట్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలవు.. ముఖ్యంగా ఎక్కువ నీటి ప్రవాహం లేని డ్రై సీజన్‌లో నీరు దిగువకు వెళ్లకుండా చేయవచ్చు. ఈ డ్యామ్ గతంలోనూ భారత్-పాకిస్థాన్ మధ్య వివాదాలకు కారణమైంది. దీనిపై వరల్డ్ బ్యాంక్ వద్ద పాకిస్థాన్ అభ్యంతరాలు లేవనెత్తింది.
బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడం వల్ల చినాబ్ నది ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లే నీటి ప్రవాహం తగ్గిపోయింది. చినాబ్ నది పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రధాన ఆధారం. ఈ నది ఆ దేశంలో 80% సాగు భూములకు నీటిని అందిస్తోంది. నీటి తగ్గుదల వల్ల పంటల దిగుబడి తగ్గుతుంది. ఆహార కొరత, ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. అలాగే, భారత్ డ్యామ్‌లో నీటిని విడుదల చేస్తే, పాకిస్థాన్‌లోని దిగువ ప్రాంతాల్లో వరదలుసంభవించవచ్చు. దీని వల్ల పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసింది. దీనితో నీటి డేటా షేరింగ్, ఫ్లడ్ వార్నింగ్‌లు, ప్రాజెక్ట్ నోటిఫికేషన్‌లు ఆగిపోయాయి. ఏప్రిల్ 30 నాటికి, చినాబ్, జీలం, ఇండస్ నదులు సాధారణంగానే ప్రవహిస్తున్నాయి. కానీ డ్రై సీజన్‌లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లోని మంగ్లా, తర్బెల డ్యామ్‌లు కేవలం 627.26 టీఎంసీల నీటిని నిల్వ చేయగలవు. ఇది దేశ వార్షిక నీటి వాటాలో 10% మాత్రమే.
బాగ్లిహార్ డ్యామ్ వంటి ప్రాజెక్ట్‌ల ద్వారా నీటి ప్రవాహం నిలిపివేయడం కొనసాగితే, పాకిస్థాన్‌లో వ్యవసాయ ఉత్పాదకత తగ్గి, ఆహార ధరలు పెరుగుతాయి. దేశ జీడీపీలో 21% వాటా, 45% ఉపాధిని అందించే వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. నీటి కొరత వల్ల గ్రౌండ్‌వాటర్ అధికంగా ఆధారపడటం వల్ల… భూగర్భ జలస్థాయిలు తగ్గుతాయి. హైడ్రోఎలెక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. దీర్ఘకాలంలో, ఇండస్ డెల్టాలో సముద్ర నీరు చొచ్చుకొని వస్తే, వ్యవసాయ భూములు బీడుపడతాయి. దీంతో పాకిస్థాన్ ఎడారిగా మారిపోతుంది.
ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్‌తో పాటు, భారత్ పాకిస్థాన్‌పై బహుముఖ ఒత్తిడి చేస్తోంది. అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలంపై నిషేధం, వాణిజ్య బహిష్కరణ, దౌత్య సంబంధాల డౌన్‌గ్రేడ్ వంటి చర్యలు తీసుకుంది. బాగ్లిహార్ డ్యామ్ వంటి ప్రాజెక్ట్‌లలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, కొత్త డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా భారత్ పాకిస్థాన్‌ను ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో ఒత్తిడిలోకి నెట్టింది. ఈ చర్యలు దీర్ఘకాలంలో పాకిస్థాన్‌ను నీటి కొరత, ఆర్థిక సంక్షోభంలోకి దించవచ్చు.
నీటి ప్రవాహ నిలిపివేతను పాకిస్థాన్ యుద్ధ చర్యగా వర్ణించింది. ఇండస్ వాటర్స్ ట్రీటీ ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన నీటిని ఆపడం లేదా మళ్లిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్ హెచ్చరించింది. భారత్ చర్యల వల్ల పాకిస్థాన్ రైతులు, నిపుణులు వ్యవసాయ భూములు ఎడారిగా మారే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ వరల్డ్ బ్యాంక్, ఐక్యరాష్ట్ర సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. కానీ భారత్ ఉగ్రవాదాన్ని కారణంగా చూపుతూ తన నిర్ణయాన్ని సమర్థిస్తోంది.
బాగ్లిహార్ డ్యామ్ నీటి నిలిపివేత పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధానికి సంకేతంగా భావిస్తున్నారు. భారత్ కొత్త డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తే, పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రమవుతుంది. అయితే దీనికి భారత్‌కు కూడా సవాళ్లు ఉన్నాయి. పెద్ద డ్యామ్‌ల నిర్మాణానికి సంవత్సరాలు, భారీ పెట్టుబడులు అవసరం.