భారత్ ఫ్యూచర్ వెపెన్స్ ఇవేనా..? ఈ డ్రోన్లను చూస్తే పాకిస్థాన్ కు హడలే..!

ఆపరేషన్ సిందూర్ భారత్ రక్షణ సత్తా ప్రపంచానికి తెలిసేలా చేసింది. శత్రుదేశాన్ని భారత ఆయుధాలు గడగడలాడించాయి. దీంతో భవిష్యత్తులో ఉపయోగపడేలా కొత్తతరం అత్యాధునిక ఆయుధాల తయారీపై భారత్ దృష్టి పెట్టింది. వాటిని సక్సెస్ ఫులగా ప్రయోగిస్తోంది కూడా.. ఇవి అమెరికా ఆయుధాలకు ఏ మాత్రం తీసిపోవు. అసలు భారత్ తయారు చేసిన కొత్త ఆయుధాలు ఏంటి..? వీటి వల్ల ఉపయోగం ఉందా..? సంప్రదాయ ఆయుధాలు పోయి ఏఐతో పనిచేసే మిషన్ గన్లు, డ్రోన్లు ఎంత వరకు భారత్ బలాన్ని పెంచుతాయి..?

పాకిస్థాన్ తో ఇటీవల పరిస్థితుల తర్వాత.. భారత్ రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆధునిక ఆయుధాలు ఎలా పనికి వస్తాయో ఆపరేషన్ సిందూర్ తర్వాత అందరికీ తెలిసి వచ్చింది. దీంతో భారత్ కొత్త తరం టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. భారతదేశం ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే లైట్‌వెయిట్ మిషన్ గన్‌లను పరీక్షించడంతో పాటు, డ్రోన్ల తయారీపై గణనీయంగా దృష్టి సారించింది. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ వినియోగించిన చైనీస్, టర్కిష్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోవడం, స్వదేశీ డ్రోన్లతో ప్రతిదాడి చేయడం భారత్‌కు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో వినూత్నమైన మానవ రహిత విమానం చేరనుంది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ రూపొందించిన రుద్రాస్త్ర యూఏవీని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రీడ్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ శ్రేణిలోకి వస్తుంది. ఎక్కువసేపు గగనతలంలో ఉంటూ.. లక్ష్యంపై కచ్చితత్వంతో దాడి చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ యూఏవీ 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పని చేసింది. స్థిరమైన రియల్‌టైమ్‌ వీడియో అందించడంతోపాటు, సురక్షితంగా లాంచింగ్‌ పాయింట్‌కు తిరిగి వచ్చింది. లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకొంటే దీని రేంజి 170 కిలోమీటర్లు. ఇది గంటన్నరసేపు నిరంతరాయంగా ఆకాశంలో ప్రయాణించింది. ఈ పరీక్షలో లక్ష్యంపై అత్యంత కచ్చితత్వంతో యాంటీ పర్సనల్‌ వార్‌హెడ్‌ను ప్రయోగించింది. అది భూమికి అత్యంత సమీపంలోకి వచ్చాక ఆ వార్‌హెడ్‌ను పేల్చేసింది.

భారత్‌ డ్రోన్‌ యుద్ధ తంత్రంలో బలోపేతం కావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌లో శత్రు యుద్ధ నౌకలపై సైలెంట్‌గా దాడి చేయగల వాటర్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. దీనిలోని పరికరాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు వెల్లడించింది. మరోవైపు సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ భార్గవాస్త్రను కూడా రూపొందించింది. దీనిని మే నెలలో విజయవంతంగా పరీక్షించారు. ఇక డీఆర్‌డీఓ మానవ రహిత విమానం రుస్తుం సిరీస్‌ డ్రోన్‌లను అభివృద్ధి చేస్తోంది. మధ్యస్థ ఎత్తులో ఎక్కువ సమయం ప్రయాణించేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు. అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ వంటి ప్రముఖ సంస్థలూ అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి. వీటిని సరిహద్దులో నిఘా, యుద్ధం, సామగ్రి చేరవేత వంటివాటి కోసం రూపొందిస్తున్నారు.

అంతేకాదు భారత్ వివిధ రకాల స్వదేశీ డ్రోన్లను తయారు చేస్తోంది. వీటిలో సర్వైలెన్స్, కామికేజ్, లోయిటరింగ్ మ్యునిషన్స్ ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన కీలక డ్రోన్లలో స్కైస్ట్రైకర్, JM-1, ALS-50 ఉన్నాయి. ఈ డ్రోన్లు ఏఐతో నడిచే ఆటోనమస్ నావిగేషన్, టార్గెట్ గుర్తించే సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అలాగే నగస్త్ర-1 వంటి సూసైడ్ డ్రోన్లు 30 కిమీ పరిధి, 2 మీటర్ల ఖచ్చితత్వంతో రూపొందించబడ్డాయి, ఇవి రాత్రి-పగలు సర్వైలెన్స్, సైలెంట్ ఆపరేషన్‌లకు అనువైనవి. DRDO అభివృద్ధి చేసిన ఆర్చర్-NG, ఘటక్ వంటి అధునాతన డ్రోన్లు కూడా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఇండియా-యూఎస్ ఒప్పందం కింద 31 MQ-9B ఆర్మ్డ్ హేల్ డ్రోన్ల కొనుగోలు కూడా జరిగింది. ఈ డ్రోన్లు రక్షణలో గేమ్-చేంజర్‌గా మారనున్నాయి, సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లలో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తంగా, ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ సాంకేతికతలో ఒక మలుపు తిరిగిన సంఘటనగా నిలిచింది. ఇది స్వదేశీ ఏఐ ఆయుధాలు, డ్రోన్ల అవసరాన్ని గుర్తించి, రక్షణ రంగంలో పెట్టుబడులను, స్టార్టప్‌లను ప్రోత్సహించింది. 2030 నాటికి భారత డ్రోన్ మార్కెట్ $11 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా, ఇది ఆర్థిక వృద్ధికి, ఉపాధి సృష్టికి దోహదపడుతుంది. భవిష్యత్తులో, జామింగ్-ప్రూఫ్ టెక్నాలజీ, స్వార్మ్ డ్రోన్లపై దృష్టి పెట్టడం ద్వారా భారత్ ఆధునిక యుద్ధ సన్నద్ధతను మరింత బలోపేతం చేయనుంది.

కొత్త రకం డ్రోన్లతో పాటు భారత్ ప్రస్తుతం ఏఐతో పనిచేసే నెగెవ్ లైట్ మెషిన్ గన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఇటీవల 14,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించారు. ఈ గన్ దానికదే టార్గెట్ ను గుర్తిస్తుంది. అలాగే శత్రువులు, స్నేహితులును వర్గీకరిస్తుంది., రియల్-టైమ్ దాడి సామర్థ్యాలతో రూపొందించబడింది. దీని ఏఐ మాడ్యూల్ వివిధ ఆయుధ వ్యవస్థలతో సమన్వయం కాగలదు, ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధాలకు అనువైనది. ఇది సైన్యానికి స్వయంచాలక ఆయుధాల అవసరాన్ని బలపరిచింది.