
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. అమెరికా భారత్ ఎగుమతులపై సుంకాలను మరింత పెంచుతూ, కొన్ని వస్తువులపై 50% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సుంకాలు ఏ వస్తువులపై విధించనున్నారు? అమెరికా ఎందుకు మరోసారి సుంకాలు పెంచింది? భారత్ ఎలా స్పందిస్తోంది? ఈ వాణిజ్య యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ట్రంప్ భారత్‌కు మిత్రుడా, శత్రువా?
ట్రంప్ తన సుంకాలతో ప్రపంచ దేశాలను ఇప్పటికే ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. మిత్రదేశం అని అంటూనే భారత్ పై సుంకాలు బాంబు వేశాడు ట్రంప్. ఏప్రిల్ లో భారత్‌పై 26%-27% సుంకాలు విధిస్తూ రెసిప్రొకల్ టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఈ సుంకాలను మరింత పెంచుతూ, కొన్ని భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధిస్తామని అమెరికా తెలిపింది. ఈ 50% సుంకాలు విధించబడే వస్తువుల్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ భాగాలు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు ఉన్నాయి. ఈ వస్తువులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తుల్లో ఒకటి, ఇవి సుమారు $14 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్, $9 బిలియన్ విలువైన రత్నాలు, ఆభరణాలను కలిగి ఉన్నాయి. అమెరికా ఇప్పటివరకూ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై విధించిన సుంకాల్లో టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, పెట్రోకెమికల్స్, మెషినరీ, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2 నుంచి అమెరికా 25% సుంకాలను స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ ఇంపోర్ట్స్‌పై విధించింది.
ఇందులో భారత్ ఎగుమతులు కూడా ఉన్నాయి. అయితే, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఎనర్జీ ఉత్పత్తులు, సెమీకండక్టర్స్, కొన్ని కీలక ఖనిజాలపై సుంకాలు విధించలేదు. భారత్ నుంచి అమెరికాకు సుమారు $12.2 బిలియన్ విలువైన ఫార్మా ఎగుమతులు ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందాయి . ఇది భారత్ ఫార్మా రంగానికి కొంత ఊరటనిచ్చింది. అయితే మిగిలిన వాటిపై మాత్రం సుంకాలు భారీగా ఉన్నాయి. అసలు సుంకాలు పెంచడానికి ట్రంప్ చాలా వాదనలు వినిపిస్తున్నారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోంది, దీనివల్ల అమెరికాకు $46 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడింది. అమెరికా భారత్ ఆటోమొబైల్స్‌పై 2.5% సుంకం విధిస్తే, భారత్ అమెరికా ఆటోమొబైల్స్‌పై 70% సుంకం విధిస్తోంది. అమెరికా ఆపిల్స్ డ్యూటీ ఫ్రీగా భారత్‌లోకి ప్రవేశిస్తే, భారత్ అమెరికా ఆపిల్స్‌పై 50% సుంకం విధిస్తోంది. ఈ అసమానతలను సరిచేయడానికి రెసిప్రొకల్ టారిఫ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇటీవల చైనా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించడం వల్ల, అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాలను 50%కి పెంచింది.
ఈ సుంకాలపై భారత్ ఎలా స్పందిస్తోంది? ఏప్రిల్ లో అమెరికా 26%-27% సుంకాలు విధించినప్పుడు, భారత్ ప్రతీకార సుంకాలు విధించకుండా సంయమనం పాటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించింది. ఫిబ్రవరి లో మోదీ అమెరికా పర్యటన సమయంలో, $23 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అమెరికా సుంకాలను 50%కి పెంచడంతో, భారత్ ధోరణి మారింది. భారత్ ఇప్పుడు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఇది ట్రంప్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి.
భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలని యోచిస్తోంది. ఈ వస్తువుల్లో ప్రధానంగా క్రూడ్ ఆయిల్, కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ మెషినరీ, ఏరోస్పేస్ భాగాలు, హై-ఎండ్ ఆటోమొబైల్స్, వుడ్ ప్రొడక్ట్స్, ఫుట్‌వేర్, ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. 2024లో అమెరికా నుంచి భారత్‌కు $42 బిలియన్ విలువైన దిగుమతులు జరిగాయి. వీటిపై భారత్ ఇప్పటివరకూ 7% నుంచి 68% వరకు సుంకాలు విధించింది. ఇప్పుడు ఈ సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే ఒకవైపు అమెరికాతో చర్చలు కొనసాగిస్తూనే, మరోవైపు ప్రతీకార సుంకాలతో ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని భారత్ అనుసరించాలని భావిస్తోంది. అదే సమయంలో, భారత్ తన ఎగుమతి మార్కెట్‌ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్‌లపై దృష్టి పెట్టి, అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది. టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ వంటి రంగాల్లో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లపై భారత్‌కు పోటీ వల్ల ప్రయోజనం ఉంది. ఎందుకంటే వాటిపై అమెరికా 37%-46% సుంకాలు విధించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
అయితే ట్రంప్ భారత్ పై ట్రేడ్ విషయంలో నిప్పులు కక్కుతూనే ఉన్నారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తూ, అమెరికా మార్కెట్‌కు అన్యాయం చేస్తోందని ట్రంప్ అంటున్నారు. అందుకే అమెరికా ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించడానికి, తమ దేశీయ తయారీ రంగాన్ని పెంచడానికి ట్రంప్ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. 1997 నుంచి 2024 వరకు అమెరికా 5 మిలియన్ మాన్యుఫాక్చరింగ్ ఉద్యోగాలు కోల్పోయిందని, దీనికి అసమాన వాణిజ్య సంబంధాలే కారణమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ సుంకాలు ఎలా ఉన్నా.. నిపుణుల అంచనా ప్రకారం, సుంకాలు భారత్ ఆర్థిక వృద్ధిని 0.5% నుంచి 0.8% వరకు తగ్గించవచ్చు. ఎలక్ట్రానిక్స్, రత్నాలు ఆభరణాలు, ఆటో భాగాలు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిటీ రీసెర్చ్ అంచనా ప్రకారం, ఈ సుంకాల వల్ల భారత్‌కు సంవత్సరానికి $7 బిలియన్ నష్టం వాటిల్లవచ్చు.
భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18% ఉండగా, 2024లో $74 బిలియన్ విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికా సుంకాల వల్ల ఎగుమతులను తగ్గి, ఉత్పత్తి ఖర్చులు పెరిగి, చాలా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డైమండ్ ఇండస్ట్రీలో వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు. అయితే, భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎగుమతుల వాటా కేవలం 1.1% ఉండటం, దేశీయ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఈ సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సుంకాలు భారత్ GDPని 0.5% తగ్గించవచ్చు, కానీ దేశీయ ఉద్దీపనలతో ఈ నష్టాన్ని భర్తీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, ఈ సుంకాల వల్ల రూపాయి విలువ క్షీణించి, డాలర్‌తో 85.69 వద్ద ఉంది, దీనివల్ల దిగుమతి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
ఇటీవలి పరిణామాలు చూస్తే, ట్రంప్ భారత్‌కు మేలు చేస్తున్నారా, నష్టం కలిగిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు, ట్రంప్ సుంకాలు భారత్ ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఆటో భాగాలు, రత్నాలు వంటి రంగాలు నష్టపోతున్నాయి. అయితే, మరోవైపు, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లపై అమెరికా 34%-46% సుంకాలు విధించడం వల్ల, భారత్ టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో పోటీ ప్రయోజనం పొందుతోంది. ఉదాహరణకు ఆపిల్ వంటి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు ఉత్పత్తిని మార్చాయి. 2024-25లో భారత్ నుంచి $17.4 బిలియన్ విలువైన ఐఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఈ సుంకాల వల్ల భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చైనా కంటే 20% చౌకగా మారాయి, దీనివల్ల భారత్ గ్లోబల్ సప్లై చైన్‌లో ఒక కీలక హబ్‌గా మారుతోంది.
అయితే, ట్రంప్ వైఖరి మొత్తంగా చూస్తే భారత్‌కు నష్టమే కలిగిస్తోంది. ఆయన భారత్ మిత్రదేశం అని చెప్పినప్పటికీ, వాణిజ్య విషయంలో కఠిన విధానాలతో ఒత్తిడి చేస్తున్నారు. భారత్‌పై సుంకాలు పెంచడం వల్ల దేశీయ తయారీ రంగాన్ని పెంచాలనే ట్రంప్ లక్ష్యం కనిపిస్తున్నప్పటికీ, ఇది భారత్ ఆర్థిక వృద్ధిని, ఎగుమతులను దెబ్బతీస్తోంది. ట్రంప్ సుంకాలు గ్లోబల్ ట్రేడ్‌ను కుదేలు చేస్తున్నాయని, దీనివల్ల గ్లోబల్ రిసెషన్ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా, ట్రంప్ విధానాలు భారత్‌కు కొన్ని అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, ఎక్కువగా నష్టమే కలిగిస్తున్నాయి. భారత్ ఇప్పుడు ఒకవైపు అమెరికాతో చర్చలు కొనసాగిస్తూనే, ప్రతీకార సుంకాలతో సమతూకం పాటించాలని, అదే సమయంలో ఎగుమతి మార్కెట్‌ను మార్చుకోవలని నిపుణులు సూచిస్తున్నారు.